
కామెంట్
ఇండియా–యూఎస్ బాంధవ్యం ఎంత ఘోరంగా దెబ్బ తిన్నది! అటు చూస్తే వాషింగ్టన్ – బీజింగ్ సంబంధాలు మెరు గవుతున్నాయి. ఈ నూతన పరిణామం... అమెరికాతో ఇండియా బాంధవ్యాన్ని ఇంకెంతగా ప్రభావితం చేయబోతోంది? రష్యా చమురు కొనుగోలు ఆపేయకుంటే, ఇండియాపై అగ్రరాజ్యం రెండవ, మూడవ విడత అదనపు సుంకాలు విధిస్తుందా?
‘‘ఇండియా దౌత్యానికి నిజంగా ఇదో పరీక్షా సమయం. కొంతకాలం ముందు నుంచీ పరిస్థితులు ఏమంత బాగోలేవు. ఇప్పుడు అవి మరింత దుర్బలంగా మారాయి’’... మాజీ విదేశాంగ కార్యదర్శి శ్యామ్ శరణ్ అభిప్రాయం ఇది. అధ్యక్షుడు ట్రంప్ ‘‘స్వతహాగానే కక్ష సాధింపు మనిషి. ఇండియా పట్ల ఇప్పు డాయన అదే వైఖరితో వ్యవహరిస్తున్నారు’’. కాబట్టి ఇండియా– యూఎస్ సంబంధాలు ‘‘తప్పనిసరిగా మరింత క్షీణిస్తాయి’’.
‘క్వాడ్’ను సైతం వదులుకుంటారా?
వాషింగ్టన్‌తో ఢిల్లీ బాంధవ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీసే పరిణా మాల విషయానికి వద్దాం. మొదటిది – చైనాతో తనకున్న ఎంతో మంచి బాంధవ్యాన్ని గురించి, షీ జిన్‌పింగ్‌తో తన స్నేహాన్ని గురించి ట్రంప్ అదేపనిగా మాట్లాడుతున్నారు. బీజింగ్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆయన ఎంతో ఇదిగా ఉన్నారు. తాను చైనాలో పర్యటిస్తానని సైతం చెబుతున్నారు. ఆయన ఈ మొత్తం వ్యవహారంలో ఎంత దూరం వెళ్తారన్నదే ఇక్కడ ప్రశ్న.
చైనాతో పెద్ద ఒప్పందం ఒకటి కుదుర్చుకోవడానికి ‘క్వాడ్’ను సైతం త్యాగం చేయబోతున్నారా? ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం ప్రకారం, క్వాడ్ సదస్సు కోసం ఇండియాను సందర్శించే ఉద్దేశం ట్రంప్‌కు లేదు. దీనర్థం ఏమిటి? ఆయన ప్రభుత్వ విదేశాంగ విధానంలో ఇండో–పసిఫిక్ వ్యూహం ఇంకెంతో కాలం కీలకం కాదు. ఈ పరిణామం ఇండియా–యూఎస్ సంబంధాలకు శరాఘాతం లాంటిది. చైనా పట్ల అమెరికా విధానంలో ఒకప్పుడు కేంద్రస్థానంలో ఉన్న మనల్ని... ఇది అంచుల దాకా నెట్టివేస్తుంది. మన ప్రాధాన్యం పూర్తిగా మసకబారుతుంది.
శరణ్ దీన్ని చాలా సున్నితంగా ఇలా చెప్పారు: ‘‘యూఎస్, చైనాలతో ఇండియా సంబంధాలు... వాటి పరస్పర సంబంధాల కంటే మెరుగ్గా ఉన్నప్పుడు ఇండియాకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది’’. అయితే ఇప్పుడీ పరిస్థితి లేదు. వాషింగ్టన్–బీజింగ్ నడుమ ప్రస్తుత సంబంధాలు, కచ్చితంగా వాషింగ్టన్ – ఢిల్లీ నడుమ కంటే బాగున్నాయని చెప్పాలి.
ఇదంతా చూస్తుంటే – అమెరికా, చైనా నడుమ జి–2 తరహా ఏర్పాటుకు అవకాశం ఉందా అన్న ప్రశ్న తలెత్తుతుంది. సమాధానం అవును అనుకుంటే, ఆసియా ప్రాంతంలో చైనా ప్రాబల్యానికి ‘చట్ట బద్ధత’ కల్పించినట్లే! ఇండియాకు అది అంగీకారం కాదు.
ఈ పరిస్థితుల్లో, ఇండియా, చైనా సంబంధాల్లో ఎంత పురోగతి సాధ్యమవుతుంది? మరోపక్క పాకిస్తాన్‌తో చైనా దృఢ సంబంధాలు సడలిపోయే అవకాశం లేదు. సరిహద్దు సమస్య అలా అపరిష్కృతంగానే మిగిలిపోతుంది. ఆసియాలో ప్రాబల్యం వహించాలని చైనా కోరుకుంటోంది. ఇండియా అందుకు ససేమిరా అంగీకరించదు. వాణిజ్యం విషయానికి వస్తే– అరుదైన ఖనిజాలు, ఎరువులు,సొరంగ తవ్వక యంత్రాల్లో చైనా స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.
అందుకే, తియాన్‌జిన్‌లో ఎన్ని చిరునవ్వులు చిందించినా, ఎంత గట్టి కరచాలనాలు చేసినా... ఇండియా–చైనా సంబంధాల్లో గణ నీయ పురోగతికి అవకాశాలు అతి తక్కువ.
రష్యా కోసం మూల్యం చెల్లిస్తున్నామా?
రష్యా చమురు విషయానికి వద్దాం. రష్యా మీద ఆర్థికంగా ఒత్తిడి తెచ్చి ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకే ఇండియా మీద 25 శాతం అదనపు సుంకం విధించామని అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ చెప్పారు. ఆ ఎత్తుగడ పారలేదు. దీంతో ట్రంప్ నిస్పృహ చెందారు. ఇప్పుడు ఆయన ఇండియా మీద అదనపు సుంకాలు విధిస్తారా?
రష్యా చమురు గురించి జవాబు చెప్పుకోవలసిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. రష్యా చమురుతో ఇండియా ఆదా చేస్తున్నది బారె ల్‌కు సుమారు 2 డాలర్లు మాత్రమే! ఈ చమురు కొనుగోళ్ల కారణంగా మనం అమెరికాకు ఏటా 48 బిలియన్ డాలర్ల ఎగుమతు లను కోల్పోతాం. రష్యా నుంచి చేసుకునే చమురు దిగుమతులతో మనకు సమకూరే ప్రయోజనం, మనం అమెరికాకు చేసే ఎగుమతులతో పోల్చితే చాలా తక్కువ. ఆర్థికంగా చూసినట్లయితే – రష్యా చమురు కొనుగోళ్లు నిలిపి వేయడం ఉత్తమం.
అయితే వ్యూహాత్మక, రాజకీయ కోణాలు అందుకు అనుమతిస్తాయా? ఇప్పటి విధానం ప్రకారం చూస్తే, రష్యా చమురును ఇండియా కొంటూనే ఉంటుంది. దీనివల్ల రష్యాకు డబ్బు లభిస్తుంది. ఆంక్షల క్లిష్ట సమయంలో ఆర్థిక ప్రయోజనం పొందుతుంది. మరి ఇండియా? అమెరికాకు ఎగుమతులు చెయ్యలేకపోవడమే కాకుండా వాషింగ్టన్‌తో సంబంధాలు పూర్తిగా చెడతాయి. అలా రెండు రకాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
ఇప్పటి వరకూ తెర వెనుక నడచిన ఒక అంశాన్ని ఇప్పుడు తెర పైకి తీసుకువచ్చి దీనికి ఒక ముగింపు ఇస్తాను. అమెరికాతో మన సంబంధాలు గడిచిన మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంత అథమ స్థాయికి దిగజారి పోయాయి. మనకు పాకిస్తాన్‌తో ఎన్నడూ బాంధవ్యం లేదు. చైనాతో సంబంధాలు మెరుగుపడుతున్నా, ఆ దేశంతో మనకు ఉన్న సమస్యలు చిన్నవేమీ కావు. రష్యాతో మన సంబంధాలు బలోపేతం అయ్యాయి.
అయితే అందుకు మనం ఇప్ప టికే భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం. మరోవంక చైనా, పాకిస్తాన్, రష్యాలతో అమెరికా సంబంధాలు బైడెన్ హయాంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉన్నాయి. ఇది నిజంగా ఒక వైచిత్రి. తొమ్మిది నెలల్లోనే వీటి మధ్య సాన్నిహిత్యం మెరుగుపడింది. అదే సమయంలో అమెరికాతో మన సంబంధాలు కుప్ప కూలాయి. కాబట్టి ఇండియా దౌత్యానికి ఇది ‘బ్యాడ్ టైమ్’ అనుకోవాలా? దీనికి సమాధానం అవును అని తప్ప మరో విధంగా చెప్పలేను.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్