
భారతీయుల దృష్టంతా ఉత్తరాన చైనా లోని తియాన్‌జిన్‌పై ఉన్న సమయంలో, దక్షిణపు పొరుగు దేశం సడీచప్పుడు లేకుండా ఓ సందేశాన్ని పంపింది. శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకె ఇటీవల జాఫ్నా సందర్శించారు. ఒకే ఏడాదిలో దిస్సనాయకె ఆ రాష్ట్రాన్ని నాల్గవసారి సందర్శించడమే ఒక రికార్డు అనుకుంటే, ఆయన అక్కడ నుంచి నౌకా దళానికి చెందిన ఒక స్పీడు బోటులోబంజరు దీవి కచ్చతీవుకు వెళ్ళి మరో రికార్డు సృష్టించారు. శ్రీలంక అధ్యక్షుడు ఒకరు ఆ దీవిని సందర్శించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటన ద్వారా ఆయన శ్రీలంక భూభాగపు హద్దును స్పష్టంగా పేర్కొన్నట్లు అయింది.
శ్రీలంకదే అని ఒప్పుకొన్నప్పటికీ...
కచ్చతీవు శ్రీలంకలో భాగమే! పాక్ జలసంధిలోని ఈ చిన్న భూభాగంపై పొరుగు దేశపు క్లయిమును భారత్ అంగీకరించింది. ఆ మేరకు రెండు దేశాల మధ్య 1974లో ఒక అంగీకారం కుదిరింది. ఈ అంగీకారం 1976లో మరో అంగీకారానికి దారితీసింది. అది రెండు దేశాల మధ్య సాగర జలాల సరిహద్దును నిర్దేశించింది. అయినప్పటికీ, రామేశ్వరం–జాఫ్నాల మధ్యనున్న ఈ దీవి, భారత–శ్రీలంక సంబంధాలలో అడపాదడపా చిచ్చు రేపుతూనేఉంది. బ్రిటిష్ హయాంలోనూ, స్వాతంత్య్రానంతర కాలంలోనూ భారత్ మ్యాప్‌లలో దాన్ని ఒక భాగంగా ఎన్నడూ చూపలేదు. రామే శ్వరంలోని జాలర్ల కోపతాపాలను చల్లార్చేందుకు, తమిళనాడు రాజ కీయ నాయకులు మాత్రం ఆ నిర్జన దీవిని తిరిగి ‘వెనక్కి తీసు కోవడం’ గురించి తరచూ గొంతెత్తుతూ ఉంటారు.
తమిళనాడు జాలర్లు చేపల వేటకు అనుసరిస్తున్న ‘బాటమ్ ట్రాలింగ్’, ‘పర్స్ సైన్’, ‘డబుల్ నెట్’ వంటి పద్ధతుల వల్ల చేపలు ఇక ఏమాత్రం లభ్యంకాని స్థితి ఏర్పడింది. శ్రీలంక వైపు వనరులు ఎక్కువ ఉండటానికి కారణం, 30 ఏళ్ళ అంతర్యుద్ధ సమయంలో, జాఫ్నా జాలర్లు దూర ప్రాంతాల్లో చేపల వేటకు సాహసించకపోవ డమే! దాంతో శ్రీలంక వైపు చేపల వేట భారతీయ జాలర్లకు ఆకర్షణీ యమైనదిగా మారింది. ఫలితంగా, వారిని శ్రీలంక నౌకా దళం అరెస్టు చేయడం, వారి బోట్లను, వలలను స్వాధీనపరచుకోవడం పరిపాటిగా మారింది.
విజయ్ వ్యాఖ్యలతో మరోసారి...
గంగపుత్రులకు ప్రత్యామ్నాయ జీవనోపాధులను సృష్టించవల సిందిపోయి వారి సమస్యలన్నింటికీ పరిష్కారం కచ్చతీవును స్వాధీనపరచుకోవడమే అన్న భ్రమను తమిళ నాయకులు పెంచి పోషిస్తూ వచ్చారు. ‘తమిళిగ వెట్రి కళగం’ పార్టీని ప్రారంభించిన సినీ నటుడు విజయ్ కూడా నిన్నగాక మొన్న అదే పల్లవిని అందు కున్నారు. ఇంతవరకు ఆయన నిర్వహించిన ర్యాలీలన్నింటిలోకెల్లా ఇటీవలి మదురై ర్యాలీని అతి పెద్దదిగా చెప్పాలి. రాష్ట్ర జాలర్లకు ‘చిన్న పని చేసి పెట్టండి చాలు’, ‘ఈ దీవి మనదేనని క్లయిముచేస్తే మన జాలర్లు సురక్షితంగా ఉంటారు’ అంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి, అదే భ్రమను కొనసాగించడంలో తాను కూడా ఒక చేయి వేశారు.
కచ్చతీవును ‘తిరిగి’ తెచ్చుకోవాలంటూ తమిళనాడు ప్రభుత్వం ఇంతవరకు నాలుగు తీర్మానాలు చేసింది. శ్రీలంకతో కుదిరినఅంగీకారాన్ని ‘రాజ్యాంగ విరుద్ధమైనది’గా పేర్కొంటూ రద్దు చేయవలసిందని కోరుతున్న కేసులు కొన్ని సుప్రీం కోర్టు ముందు న్నాయి. కచ్చతీవును కాంగ్రెస్ ‘నిర్లక్ష్యపూరితం’గా శ్రీలంకకు అప్ప గించిందని 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించడం ద్వారా ప్రధాన మంత్రి మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అగ్నికి ఆజ్యం పోశారు.
కచ్చతీవును వెనక్కి తీసుకోవడం తమిళ జాలర్ల సమస్యలను పరిష్కరిస్తుందనే మాటే నిజమైతే, తమిళ చేపల బోట్లు కచ్చాతీవును దాటి, శ్రీలంక తూర్పు కోస్తా వరకు ఎందుకు వెళ్తున్నట్లు? విజయ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హేరత్, ‘‘రాజకీయ వేదికల నుంచి చేసే ప్రసంగాలను’’ చెవికెక్కించుకోవ ద్దంటూ శ్రీలంక పౌరులను కోరారు.
దిస్సనాయకెకు కలిసొచ్చింది!
కచ్చతీవును సందర్శించడం స్వదేశంలో దిస్సనాయకెకు చెందిన నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) పార్టీకి సహాయపడటం ఖాయం. తమిళులు ఎక్కువగా ఉన్న జాఫ్నాలో ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాన్ని ఆయన పార్టీ కొనసాగిస్తోంది. అంతర్యుద్ధ సమయంలో, తమిళ ఉగ్ర సంస్థలకు ఉదారంగా సహాయపడిన, ఆవలి వైపునున్న తమిళ సోదరులు, ఇపుడు తమకే ఎసరు పెడుతున్నారనే భావన జాఫ్నా తమిళులలో పాదుకొంది. కచ్చతీవు దీవిలో కాలు మోపడం ద్వారా, తాను శ్రీలంక తమిళ జాలర్ల పక్షాన ఉన్నానని దిస్సనాయకె చాటుకున్నట్లు అయింది.
దిస్సనాయకె ప్రతిష్ఠ కొద్ది నెలలుగా మసకబారుతూ వస్తోంది. ఆర్థిక వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తామని,కఠినంగా ఉన్న అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ షరతులలో మార్పులు కోరతామని వాగ్దానం చేయడం ద్వారా ఎన్పీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ, అది ఇంతవరకు ఉన్నపరిస్థితులు మరింత దిగజారకుండా మాత్రమే నిర్వహించగలుగుతోంది.
ఈ నేపథ్యంలో, కచ్చతీవు భూభాగం తమదేనని దిస్సనాయకె చాటుకోవడం, ఆయన ప్రభుత్వానికి ప్రధాన అండగా ఉన్నసింహళ జాతీయులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. భారత్ పట్ల మరీ మెతకగా వ్యవహరిస్తున్నారని నిందిస్తున్న స్వదేశంలోని విమర్శకులకు కూడా దిస్సనాయకె సందేశం పంపినట్లయింది. భారతదేశంతో రక్షణ సహకార ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఆయన విమర్శల పాలయ్యారు. మొత్తానికి, శ్రీలంక ప్రయోజ నాలకు కట్టుబడిన వ్యక్తిగా దిస్సనాయకె తనను తాను చాటుకో గలిగారు.
సముద్రంపై జీవనం సాగించేవారికి సెయింట్ ఆంటొని ఆరాధనీయుడు. ఆయన స్మారక ప్రార్థనా మందిరం కచ్చతీవులో శతాబ్దంపైగా నిలిచి ఉంది. అంతర్యుద్ధం అంతమైన తర్వాత, ప్రార్థనా మందిరం కొత్త రూపురేఖలను సంతరించుకుంది. ఇంతా చేసి, 1.6 కిలోమీటర్ల పొడవు, 300 మీటర్ల వెడల్పు కలిగిన కచ్చతీవు పర్యాటక ప్రదేశంగా పరిణమించవచ్చు. కానీ, తమిళనాడు నుంచి సన్నాయి నొక్కులు మాత్రం ఆగకపోవచ్చు.
- వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
- నిరుపమా సుబ్రమణియన్