breaking news
Katchatheevu row
-
కచ్చతీవుపై ఆగని రచ్చ
భారతీయుల దృష్టంతా ఉత్తరాన చైనా లోని తియాన్జిన్పై ఉన్న సమయంలో, దక్షిణపు పొరుగు దేశం సడీచప్పుడు లేకుండా ఓ సందేశాన్ని పంపింది. శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకె ఇటీవల జాఫ్నా సందర్శించారు. ఒకే ఏడాదిలో దిస్సనాయకె ఆ రాష్ట్రాన్ని నాల్గవసారి సందర్శించడమే ఒక రికార్డు అనుకుంటే, ఆయన అక్కడ నుంచి నౌకా దళానికి చెందిన ఒక స్పీడు బోటులోబంజరు దీవి కచ్చతీవుకు వెళ్ళి మరో రికార్డు సృష్టించారు. శ్రీలంక అధ్యక్షుడు ఒకరు ఆ దీవిని సందర్శించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటన ద్వారా ఆయన శ్రీలంక భూభాగపు హద్దును స్పష్టంగా పేర్కొన్నట్లు అయింది. శ్రీలంకదే అని ఒప్పుకొన్నప్పటికీ...కచ్చతీవు శ్రీలంకలో భాగమే! పాక్ జలసంధిలోని ఈ చిన్న భూభాగంపై పొరుగు దేశపు క్లయిమును భారత్ అంగీకరించింది. ఆ మేరకు రెండు దేశాల మధ్య 1974లో ఒక అంగీకారం కుదిరింది. ఈ అంగీకారం 1976లో మరో అంగీకారానికి దారితీసింది. అది రెండు దేశాల మధ్య సాగర జలాల సరిహద్దును నిర్దేశించింది. అయినప్పటికీ, రామేశ్వరం–జాఫ్నాల మధ్యనున్న ఈ దీవి, భారత–శ్రీలంక సంబంధాలలో అడపాదడపా చిచ్చు రేపుతూనేఉంది. బ్రిటిష్ హయాంలోనూ, స్వాతంత్య్రానంతర కాలంలోనూ భారత్ మ్యాప్‌లలో దాన్ని ఒక భాగంగా ఎన్నడూ చూపలేదు. రామే శ్వరంలోని జాలర్ల కోపతాపాలను చల్లార్చేందుకు, తమిళనాడు రాజ కీయ నాయకులు మాత్రం ఆ నిర్జన దీవిని తిరిగి ‘వెనక్కి తీసు కోవడం’ గురించి తరచూ గొంతెత్తుతూ ఉంటారు. తమిళనాడు జాలర్లు చేపల వేటకు అనుసరిస్తున్న ‘బాటమ్ ట్రాలింగ్’, ‘పర్స్ సైన్’, ‘డబుల్ నెట్’ వంటి పద్ధతుల వల్ల చేపలు ఇక ఏమాత్రం లభ్యంకాని స్థితి ఏర్పడింది. శ్రీలంక వైపు వనరులు ఎక్కువ ఉండటానికి కారణం, 30 ఏళ్ళ అంతర్యుద్ధ సమయంలో, జాఫ్నా జాలర్లు దూర ప్రాంతాల్లో చేపల వేటకు సాహసించకపోవ డమే! దాంతో శ్రీలంక వైపు చేపల వేట భారతీయ జాలర్లకు ఆకర్షణీ యమైనదిగా మారింది. ఫలితంగా, వారిని శ్రీలంక నౌకా దళం అరెస్టు చేయడం, వారి బోట్లను, వలలను స్వాధీనపరచుకోవడం పరిపాటిగా మారింది. విజయ్ వ్యాఖ్యలతో మరోసారి...గంగపుత్రులకు ప్రత్యామ్నాయ జీవనోపాధులను సృష్టించవల సిందిపోయి వారి సమస్యలన్నింటికీ పరిష్కారం కచ్చతీవును స్వాధీనపరచుకోవడమే అన్న భ్రమను తమిళ నాయకులు పెంచి పోషిస్తూ వచ్చారు. ‘తమిళిగ వెట్రి కళగం’ పార్టీని ప్రారంభించిన సినీ నటుడు విజయ్ కూడా నిన్నగాక మొన్న అదే పల్లవిని అందు కున్నారు. ఇంతవరకు ఆయన నిర్వహించిన ర్యాలీలన్నింటిలోకెల్లా ఇటీవలి మదురై ర్యాలీని అతి పెద్దదిగా చెప్పాలి. రాష్ట్ర జాలర్లకు ‘చిన్న పని చేసి పెట్టండి చాలు’, ‘ఈ దీవి మనదేనని క్లయిముచేస్తే మన జాలర్లు సురక్షితంగా ఉంటారు’ అంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి, అదే భ్రమను కొనసాగించడంలో తాను కూడా ఒక చేయి వేశారు.కచ్చతీవును ‘తిరిగి’ తెచ్చుకోవాలంటూ తమిళనాడు ప్రభుత్వం ఇంతవరకు నాలుగు తీర్మానాలు చేసింది. శ్రీలంకతో కుదిరినఅంగీకారాన్ని ‘రాజ్యాంగ విరుద్ధమైనది’గా పేర్కొంటూ రద్దు చేయవలసిందని కోరుతున్న కేసులు కొన్ని సుప్రీం కోర్టు ముందు న్నాయి. కచ్చతీవును కాంగ్రెస్ ‘నిర్లక్ష్యపూరితం’గా శ్రీలంకకు అప్ప గించిందని 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించడం ద్వారా ప్రధాన మంత్రి మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అగ్నికి ఆజ్యం పోశారు. కచ్చతీవును వెనక్కి తీసుకోవడం తమిళ జాలర్ల సమస్యలను పరిష్కరిస్తుందనే మాటే నిజమైతే, తమిళ చేపల బోట్లు కచ్చాతీవును దాటి, శ్రీలంక తూర్పు కోస్తా వరకు ఎందుకు వెళ్తున్నట్లు? విజయ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హేరత్, ‘‘రాజకీయ వేదికల నుంచి చేసే ప్రసంగాలను’’ చెవికెక్కించుకోవ ద్దంటూ శ్రీలంక పౌరులను కోరారు. దిస్సనాయకెకు కలిసొచ్చింది!కచ్చతీవును సందర్శించడం స్వదేశంలో దిస్సనాయకెకు చెందిన నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) పార్టీకి సహాయపడటం ఖాయం. తమిళులు ఎక్కువగా ఉన్న జాఫ్నాలో ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాన్ని ఆయన పార్టీ కొనసాగిస్తోంది. అంతర్యుద్ధ సమయంలో, తమిళ ఉగ్ర సంస్థలకు ఉదారంగా సహాయపడిన, ఆవలి వైపునున్న తమిళ సోదరులు, ఇపుడు తమకే ఎసరు పెడుతున్నారనే భావన జాఫ్నా తమిళులలో పాదుకొంది. కచ్చతీవు దీవిలో కాలు మోపడం ద్వారా, తాను శ్రీలంక తమిళ జాలర్ల పక్షాన ఉన్నానని దిస్సనాయకె చాటుకున్నట్లు అయింది. దిస్సనాయకె ప్రతిష్ఠ కొద్ది నెలలుగా మసకబారుతూ వస్తోంది. ఆర్థిక వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తామని,కఠినంగా ఉన్న అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ షరతులలో మార్పులు కోరతామని వాగ్దానం చేయడం ద్వారా ఎన్పీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ, అది ఇంతవరకు ఉన్నపరిస్థితులు మరింత దిగజారకుండా మాత్రమే నిర్వహించగలుగుతోంది. ఈ నేపథ్యంలో, కచ్చతీవు భూభాగం తమదేనని దిస్సనాయకె చాటుకోవడం, ఆయన ప్రభుత్వానికి ప్రధాన అండగా ఉన్నసింహళ జాతీయులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. భారత్ పట్ల మరీ మెతకగా వ్యవహరిస్తున్నారని నిందిస్తున్న స్వదేశంలోని విమర్శకులకు కూడా దిస్సనాయకె సందేశం పంపినట్లయింది. భారతదేశంతో రక్షణ సహకార ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఆయన విమర్శల పాలయ్యారు. మొత్తానికి, శ్రీలంక ప్రయోజ నాలకు కట్టుబడిన వ్యక్తిగా దిస్సనాయకె తనను తాను చాటుకో గలిగారు.సముద్రంపై జీవనం సాగించేవారికి సెయింట్ ఆంటొని ఆరాధనీయుడు. ఆయన స్మారక ప్రార్థనా మందిరం కచ్చతీవులో శతాబ్దంపైగా నిలిచి ఉంది. అంతర్యుద్ధం అంతమైన తర్వాత, ప్రార్థనా మందిరం కొత్త రూపురేఖలను సంతరించుకుంది. ఇంతా చేసి, 1.6 కిలోమీటర్ల పొడవు, 300 మీటర్ల వెడల్పు కలిగిన కచ్చతీవు పర్యాటక ప్రదేశంగా పరిణమించవచ్చు. కానీ, తమిళనాడు నుంచి సన్నాయి నొక్కులు మాత్రం ఆగకపోవచ్చు. - వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ - నిరుపమా సుబ్రమణియన్ -
అది ఓట్ల రాజకీయం.. మేం పట్టించుకోం
అగ్రనటుడు, తమిళగ వెట్రి కళగం (Tamilaga Vettri Kazhagam) అధినేత విజయ్ మధురై మహనాడులో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేంద్రాన్ని, ప్రధాని మోదీని విమర్శించే క్రమంలో కచ్చతీవు ద్వీపం అంశం తెరపైకి తెచ్చారాయన. అయితే తాజాగా విజయ్ డిమాండ్‌పై శ్రీలంక(Sri Lanka Reacts Actor Vijay) స్పందించింది. కచ్చతీవును తిరిగి భారత్‌లో చేర్చాలంటూ విజయ్ మధురై టీవీకే సభలో కేంద్రాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారంటూ శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్ అభిప్రాయపడ్డారు. విజయ్ వ్యాఖ్యలను ఓ మీడియా ప్రతినిధి ఆయన వద్ద ప్రస్తావించగా.. ‘‘కచ్చతీవు ముమ్మాటికీ శ్రీలంకదే. ఇలాంటి వ్యాఖ్యలు ఓట్ల కోసం చేసే రాజకీయ ప్రకటనలు మాత్రమే. దక్షిణ భారతదేశంలో ఎన్నికల కాలంలో రాజకీయ ప్రయోజనాల ఇలాంటివెన్నో చెబుతుంటారు. భారత కేంద్ర ప్రభుత్వమో, దౌత్యాధికారులో ఈ అంశంపై ఎలాంటి అధికారిక వ్యాఖ్యలు చేయలేదు. అందువల్ల శ్రీలంక సార్వభౌమత్వం కొనసాగుతుంది. ఇలాంటి ప్రకటనలతో మేం ప్రభావితం కాబోం. శ్రీలంకకు చెందిన కచ్చతీవు విషయంలో దౌత్యస్థాయిలో జరిగే చర్చలే ముఖ్యం’’ అని అన్నారాయన. ఆగస్టు 21న మదురైలో జరిగిన సభలో విజయ్ మాట్లాడుతూ.. మత్స్యకారుల హక్కులను కాపాడడంలో కేంద్రం విఫలమైందని విమర్శలు గుప్పించారు. శ్రీలంక నౌకాదళం దాడుల వల్ల 800 మంది తమిళనాడు మత్స్యకారులు బాధపడుతున్నారని పేర్కొన్నారు. ‘‘మీరు పెద్దగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. చిన్న పని చేయండి. కచ్చతీవును తిరిగి పొందండి, అది మా మత్స్యకారుల భద్రతకు సరిపోతుంది’’ అని విజయ్ ప్రధాని మోదీని ఉద్దేశించి అన్నారు.Popular actor Thalapathi Vijay who left the Silver Screen to mount the political platform, challenges @PMOIndia to take back the Katchchateevu island to protect Tamilnadu fishermen from Sri Lanka navy attacks. pic.twitter.com/btpiP6Z0AI— LankaFiles (@lankafiles) August 26, 2025కచ్చతీవు ఒక చిన్న ద్వీపం. తమిళనాడు రామేశ్వరంకు సమీపంలో.. భారత్-శ్రీలంక మధ్య పాక్ జలసంధిలో ఉంది. ద్వీపంలో సెయింట్ ఆంటోనీ ప్రార్థన మందిరంలో ఏటా జరిగే ఉత్సవాలకు తమిళనాడు నుంచి ప్రజలు హాజరవుతుంటారు. 1974లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని అప్పటి భారత ప్రభుత్వం కచ్చతీవు భూభాగాన్ని శ్రీలంకకు అప్పగించింది. అయితే రాజ్యాంగ సవరణ లేకుండా అప్పగించడంపై వివాదం నడుస్తోంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం, ఇది రామనాథపురం జమీందారిలో భాగంగా ఉండేది. అందుకే ఇది భారత్‌దే అని వాదనలు తొలినాళ్ల నుంచే ఉన్నాయి. తమిళ మత్స్యకారులు ఈ ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే సమయంలో శ్రీలంక నౌకాదళం దాడులు, అరెస్టులు చేస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో ప్రతి ఎన్నికల సమయంలో కచ్చతీవు అంశం చర్చకు వస్తోంది. కానీ శాశ్వత పరిష్కారం మాతరం దొరకడం లేదు. -
కచ్చతీవు ఎక్కడుంది?.. దీని వెనుక అసలు కథేంటి?
ఎప్పుడో 50 ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు రాసిచ్చిన కచ్చతీవు ఇపుడు రాజకీయ వివాదం రాజేస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీలకు కచ్చతీవు ఇంధనంగా మారుతోంది. 2016 ఎన్నికల్లో రచ్చ రచ్చ రాజేసిన కచ్చతీవు ఈ ఎన్నికల్లోనూ తెరపైకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ కచ్చతీవు విషయంలో కాంగ్రెస్, డిఎంకేలపై మండి పడ్డ సంగతి తెలిసిందే. అయితే దానికి దీటుగా కాంగ్రెస్ కూడా బిజెపిపై విరుచుకు పడుతోంది. పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ కచ్చతీవును ఎందుకు స్వాధీనం చేసుకోలేదో చెప్పాలని కాంగ్రెస్ నిలదీస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ కచ్చతీవు ఎక్కడుంది? ఏమీ దీని కథ అన్నది తెలుసుకోవాలి. చరిత్ర పుటలను ఒక్కసారి వెనక్కి తిప్పాలి. భారత్-శ్రీలంకల మధ్య.. తమిళనాడుకు సమీపంలో ఉన్న ఈ దీవే కచ్చతీవి. తమిళ నాడులోని రామేశ్వరానికి.. శ్రీలంక లోని జాఫ్నాకీ మధ్యలో ఉంది ఇది. తమిళనాడుకు పది మైళ్ల దూరంలో ఇది కొలువు తీరింది. అపారమైన మత్స్య సంపదకు మారు పేరు ఇది. వేల సంవత్సరాలుగా కచ్చతీవుల్లో చేపలు పట్టి పొట్టపోసుకుంటూ వస్తున్నారు తమిళ జాలర్లు. అయితే 1974లో భారత ప్రభుత్వం తీసుకున్న ఓ అనాలోచిత నిర్ణయం కారణంగా ఈ దీవి శ్రీలంక వశమైంది. అప్పటి నుండి తమిళ మత్స్య కారులకు కష్టాలు మొదలయ్యాయి.దీవులపై పెత్తనం సంపాదించుకున్న శ్రీలంక తమ నావికాదళాలను ఇక్కడ మోహరించింది. అందుకు కారణాలూ ఉన్నాయి ఒకప్పుడు ఎల్.టి.టి.ఇ. తీవ్రవాదులకూ ఇది షెల్టర్ గా ఉండేది. అందుకే ఇటు వైపు నావికాదళాలను మోహరించి ..ఇటు వైపు ఎవరొచ్చినా వారు శత్రువులే అన్నట్లు శ్రీలంక వ్యవహరిస్తోంది. కచ్చతీవుల వైపు వచ్చే తమిళ మత్స్యకారులపై లంక నావికాదళాల దౌర్జన్యాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తమ సరిహద్దుజలాల్లోకి ప్రవేశించారన్న సాకుతో చాలా మంది జాలర్లను లంక దళాలు కాల్చి చంపేశాయి. 1983 నుంచి ఇప్పటి దాకా 500 మందికి పైగా తమిళ జాలర్లను శ్రీలంక దళాలు పొట్టన పెట్టుకున్నాయి. కనీసం మూడు వేల మందికి పైగా మత్స్యకారులు లంక ఆర్మీ దాడిలో శాస్వత వికలాంగులుగా మిగిలారు. వందలాది మంది గంగ పుత్రుల ఆచూకీ తెలీడం లేదు. వందలాది మందిని లంక ఆర్మీ తమ జైళ్లల్లో నిర్బంధించింది. మరి కొన్ని వందల మందిని అక్రమ నిర్బంధంలో ఉంచి చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నది తమిళ జాలర్ల ఆరోపణ. వేలాది సంవత్సరాలుగా తమ హక్కుగా ఉన్న దీవులను తమకి కాకుండా చేసిన భారత ప్రభుత్వం పై తమిళ గంగ పుత్రులు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఇక ఈ కచ్చ దీవి విషయానికి వస్తే.. ఈ దీవి భారత్ దే అనడానికి అన్ని రకాల సాక్ష్యాలూ ఉన్నాయి. తమిళనాడుకు చెందిన రామనాథపురం జమీందారీలో కచ్చతీవులు భాగమేనని రెవిన్యూ రికార్డులు చెబుతున్నాయి. రామనాథ పురానికి చెందిన రాజు సేతుపతి పాలనలోనూ.. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోనూ..స్వాతంత్ర్యం వచ్చాక స్వతంత్ర భారత పాలనలోనూ కూడా కచ్చతీవులు తమిళనాడు ఆధీనంలోనే ఉన్నాయి. 1605 లో రామనాథ పురాన్ని ఏలిన సేతుపతి రాజు హయాంలో 69 గ్రామాలు..ఏడు దీవులను పాలించాడు. వాటిలో కచ్చతీవులు కూడా ఉన్నాయి. రామనాథ పురం ఆస్థానంలో కచ్చదీవి ఆర్ధిక లెక్కల ఆడిటింగ్ కోసం ప్రత్యేక విభాగమే ఉంది. 1822 లో కచ్చ దీవులను ఈస్ట్ ఇండియా కంపెనీకి లీజుకు ఇచ్చినట్లు రామనాథపురం ఆస్థానంలో పత్రాలు ఉన్నాయి. అయితే వీటిని ఏ మాత్రం పట్టించుకోకుండా..1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ కచ్చ దీవులను శ్రీలంకకు రాసిచ్చేశారు. అప్పటి శ్రీలంక ప్రధాని సిరిమావో బండారి నాయకేకు స్వదేశంలో రాజకీయ ప్రయోజనాలు కల్పించేందుకే ఇందిరా గాంధీ తమ నోటికాడి ఆహారాన్ని తన్నేసి ..శ్రీలంకుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారన్నది తమిళ జాలర్ల ఆరోపణ. తమిళ మత్స్యకారులతో కనీస సంప్రదింపులు కూడా జరపకుండా కేంద్రంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వం..తమిళనాడులోని కరుణానిథి ప్రభుత్వం ఏక పక్ష నిర్ణయం తీసుకున్నారని ద్రవిడ దేశం అధ్యక్షుడు కృష్ణారావు ఆరోపిస్తున్నారు. రెండు దేశాల ప్రధానుల మధ్య కుదిరిన ఈ ఒప్పందం భారత పార్లమెంటు లో ఆమోదం పొందనే లేదు. ఇపుడు ఈ అంశాన్నే లేవనెత్తుతున్నాయి తమిళ రాజకీయ పార్టీలు. కచ్చ దీవుల విషయంలో శ్రీలంకతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పునః పరిశీలించాలని..కచ్చదీవులను తిరిగి భారత ఆధీనంలోకి తీసుకోవాలని తమిళ జాలర్లు పట్టుబడుతున్నారు. కచ్చ దీవుల పై హక్కుల కోసం ఓ సంఘాన్ని నెలకొల్పి ఏళ్ల తరబడి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. సీతయీన్ మైన్ థాన్ నాయకత్వంలో ఈ ఉద్యమం సాగుతోంది. కచ్చతీవులను శ్రీలంకకు ఇష్టారాజ్యంగా ఇచ్చేయడానికి ఇందిరాగాంధీకి ఏం హక్కు ఉందని మైన్ థాన్ నిలదీస్తున్నారు.కచ్చతీవులు మోతీ లాల్ నెహ్రూ సంపాదించుకున్న వంశపారం పర్య ఆస్తి ఏమీ కాదని ఆయన వ్యంగ్య ధోరణిలో విరుచుకుపడ్డారు. రెండు దేశాల పెద్దలూ కూడా తమ తమ రాజకీయ ప్రయోజనాలకోసమే మత్స్యకారుల జీవితాలను నాశనం చేశారని మైన్ థాన్ ఆరోపిస్తున్నారు. నిజానికి 1974 లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రెండు దేశాల పర్యాటకులు..మత్స్యకారులూ కచ్చ దీవులకు ఇష్టాను సారం రావచ్చు..పోవచ్చు. ఇందుకోసం ఎవరూ రెండో దేశపు అనుమతి పత్రాలు తీసుకోవలసిన అవసరం లేదు. అయితే ఈ వెసులుబాటును శ్రీలంక ఆర్మీ తోసి పుచ్చుతోంది. కచ్చ తీవులవైపు వచ్చే తమిళ జాలర్లను నానా హింసలూ పెడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. శ్రీలంక ఇలా ఒప్పందాన్ని ఉల్లంఘించాక భారత ప్రభుత్వం చేష్ఠలుడిగినట్లు మౌనంగా ఉండడంలో అర్ధం లేదన్నది మత్స్యకారుల ఆరోపణ. మైన్ థాన్ అనుమానం ఏంటంటే... శ్రీలంక లో పాకిస్థాన్ ఎయిర్ బేస్ ఏర్పాటుకు శ్రీలంక ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉందని తెలియడంతో...పాకిస్థాన్ ను పక్కలో బల్లెంలా శ్రీలంకలో ఎందుకు పెట్టుకోవడం అని అనుకున్న ఇందిరా గాంధీ దాన్ని బ్రేక్ చేయడానికే శ్రీలంక కోరిన విధంగా కచ్చ తీవులను వదులుకోడానికి సిద్ధమయ్యారని మైన్ థాన్ వాదన. అటు శ్రీలంకలోనూ రాజకీయంగా వెనకబడుతోన్న బండారి నాయకే..పేరు ప్రతిష్ఠలను మూట కట్టుకోడానికే నెహ్రూ కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని వాడుకుని ఇందిరా గాంధీ చేత ఒప్పందం చేయించుకున్నారని మైన్ థాన్ ఆరోపిస్తున్నారు. అయితే ఇపుడు పాకిస్థాన్ కన్నా పెద్ద ప్రమాదం చైనా రూపంలో పొంచి ఉన్న సంగతిని ఇప్పటి ప్రభుత్వం గుర్తించాలంటున్నారు మైన్ థాన్. కచ్చతీవులకు వెళ్లి వచ్చే తమిళ జాలర్లు కూడ శ్రీలంక నావికా దళాల బోట్లలో చైనా సైనికులను చూసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే శ్రీలంకలో లక్ష మందికి పైగా చైనా సైనికులు ఉన్నారని అది ఏ క్షణంలో అయినా భారత్ కు ముప్పేనని మైన్ థాన్ హెచ్చరిస్తున్నారు. మరో పక్క కొలంబో కేంద్రంగా లష్కరే తోయిబా ఉగ్రవాదులు సైతం శిక్షణ పొందుతున్నారని.. ఈ ఉగ్రవాదులు కూడ కచ్చతీవులను కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు ఆరంభిస్తే..భారత్ లో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని అంటున్నారు. వీటిని దృష్ఠిలో పెట్టుకుని కచ్చతీవుల విషయంలో శ్రీలంకతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి దీవులను స్వాధీనం చేసుకోవాలని..లేని పక్షంలో అది భారత సార్వభౌమాధికారానికే ముప్పుగా మారే ప్రమాదం ఉందని గంగపుత్రుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అవసరమైతే అంతర్జాతీయ న్యాయ స్థానాలను ఆశ్రయించాలని కూడా వారు సూచిస్తున్నారు. కచ్చ తీవుల్లో అటు హిందూ దేవాలయాలతో పాటు సెయింట్ ఆంధోనీ చర్చి కూడా ఉంది. క్రైస్తవ పండగతో పాటు హిందూ జాతరలకూ తమిళనాడు నుంచి ఏటా వేలాది మంది కచ్చ తీవులకు వెళ్తూ ఉంటారు. ఇపుడు తమిళ నాట ఎన్నికల పుణ్యమా అని కచ్చతీవుల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అదే గంగపుత్రుల్లో కోటి ఆశలు రేపుతోంది. ఇదీ చదవండి: 10 ఏళ్లగా ప్రధాని మోదీ ఏం చేశారు? కచ్చతీవుపై చిదంబరం కీలక వ్యాఖ్యలు -
‘కచ్చతీవు రచ్చ’: జైశంకర్‌కు చిదంబరం కౌంటర్
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాడులో కచ్చతీవు ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. కాంగ్రెస్, డీఎంకేలు కచ్చతీవును శ్రీలంకకు అప్పగించాయని బీజేపీ అంటుంటే..కచ్చతీవుల అప్పగింతల విషయమే తమకు తెలియదని డీఎంకే నేతలు వాదిస్తున్నారు. దీంతో ఈ కచ్చతీవు అంశం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే. అన్నమలై కచ్చతీవును 1974లో నాటి కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్, రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వాలు శ్రీలంకకు ఎలా అప్పగించాయనే అంశంపై ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరించారు. ఇదే అంశంపై ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మనదేశానికి చెందిన కచ్చతీవు ద్వీపాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిస్సంకోచంగా శ్రీలంకకు ఇచ్చిందని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ దేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను బలహీనపరిచేలా కాంగ్రెస్ పనిచేస్తుందని దుయ్యబట్టారు. ఎవరు ఏం చేశారో కాదు.. ఎవరు ఏం దాచారో తెలుసు ఈ నివేదికపై విదేశాంగశాఖ మంత్రి ఎస్.జైశంకర్ సైతం.. కాంగ్రెస్, డీఎంకే తీరును తప్పుబట్టారు. తమిళనాడు రామేశ్వరం సమీపంలో ఉన్న కచ్చతీవుకు ప్రాముఖ్యత లేదనే 1974లో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి కాంగ్రెస్ ప్రధానులు సముద్ర సరిహద్దు ఒప్పందంలో భాగంగా శ్రీలంకకు ఇచ్చారని గుర్తు చేశారు. కచ్చతీవు ద్వీవికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పూర్తి సమాచారం ఉంది. దీనిని ఎవరు చేశారనేదే కాకుండా, ఎవరు దాచారనేదీ ఇప్పుడే మాకు తెలిసింది. దీనిపై ఒక పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. శ్రీలంక ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి అని జయ శంకర్ అన్నారు. దెబ్బకు దెబ్బ వర్సెస్ ట్వీట్ ఫర్ ట్వీట్ కచ్చతీవు ద్వీప వివాదంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి .చిదంబరం మండిపడ్డారు. ఎక్స్ వేదికగా జయ్శంకర్ ఊసరవెల్లిల్లా రంగుల్లు మార్చొద్దని అన్నారు. ‘టిట్ ఫర్ టాట్’ అనేది పాతది.. ట్వీట్ ఫర్ ట్వీట్ అనేది ట్వీట్ కొత్త ఆయుధం’ అని పేర్కొన్నారు. చరిత్రలో జై శంకర్ అంతేకాదు, 2015 జనవరి 27 నాటి ఆర్టీఐ సమాధానాన్ని ఒకసారి చూడండి. కచ్చితీవును శ్రీలంకకు చెందినదిగా ఇండియా గుర్తించడాన్ని ఆర్టీఐ సమర్ధించిందని గుర్తు చేశారు. పరోక్షంగా జయ్ శంకర్‌ను ఉద్దేశిస్తూ.. ఒక ఉదారవాద అధికారి నుంచి ఆర్ఎస్ఎస్- బీజేపీ మౌత్ పీస్ వరకు ఆయన చేసిన విన్యాసాలు చరిత్రలో నిలిచిపోతాయి. ప్రజలు ఎంత వేగంగా రంగులు మారుస్తుంటారో అని చిందబరం ట్వీట్ చేశారు బీజేపీలో హయాంలోనూ జరిగింది మరో ట్వీట్లో గత 50 ఏళ్లలో భారతీయ మత్స్యకారులు శ్రీలంకలో నిర్బంధించబడ్డారని అంగీకరించారు. అయితే బీజేపీ, మోదీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అదే జరగలేదా అని ప్రశ్నించారు. ‘గత 50 ఏళ్లలో మత్స్యకారులను నిర్బంధించిన మాట వాస్తవమే. అదేవిధంగా భారతదేశం అనేక మంది మత్స్యకారులను నిర్బంధించింది. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు శ్రీలంక మత్స్యకారులను నిర్బంధించలేదా? మోదీ అధికారంలో ఉన్నప్పటి నుండి మత్స్యకారులను శ్రీలంక నిర్బంధించలేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కచ్చతీవు భారత్ తిరిగి తీసుకోవాల్సిందే ఇలా ఆయా రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే.. జాలర్ల సంఘాలు మాత్రం కచ్చతీవును భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటే తమిళ జాలర్లకు ప్రాణాలకు రక్షణ ఉంటుందని జాలర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఈ కచ్చతీవు అంశం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది.