
అగ్రనటుడు, తమిళగ వెట్రి కళగం (Tamilaga Vettri Kazhagam) అధినేత విజయ్ మధురై మహనాడులో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేంద్రాన్ని, ప్రధాని మోదీని విమర్శించే క్రమంలో కచ్చతీవు ద్వీపం అంశం తెరపైకి తెచ్చారాయన. అయితే తాజాగా విజయ్ డిమాండ్‌పై శ్రీలంక(Sri Lanka Reacts Actor Vijay) స్పందించింది.
కచ్చతీవును తిరిగి భారత్‌లో చేర్చాలంటూ విజయ్ మధురై టీవీకే సభలో కేంద్రాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇస్తున్నారంటూ శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్ అభిప్రాయపడ్డారు. విజయ్ వ్యాఖ్యలను ఓ మీడియా ప్రతినిధి ఆయన వద్ద ప్రస్తావించగా.. ‘‘కచ్చతీవు ముమ్మాటికీ శ్రీలంకదే. ఇలాంటి వ్యాఖ్యలు ఓట్ల కోసం చేసే రాజకీయ ప్రకటనలు మాత్రమే. దక్షిణ భారతదేశంలో ఎన్నికల కాలంలో రాజకీయ ప్రయోజనాల ఇలాంటివెన్నో చెబుతుంటారు. భారత కేంద్ర ప్రభుత్వమో, దౌత్యాధికారులో ఈ అంశంపై ఎలాంటి అధికారిక వ్యాఖ్యలు చేయలేదు. అందువల్ల శ్రీలంక సార్వభౌమత్వం కొనసాగుతుంది. ఇలాంటి ప్రకటనలతో మేం ప్రభావితం కాబోం. శ్రీలంకకు చెందిన కచ్చతీవు విషయంలో దౌత్యస్థాయిలో జరిగే చర్చలే ముఖ్యం’’ అని అన్నారాయన.
ఆగస్టు 21న మదురైలో జరిగిన సభలో విజయ్ మాట్లాడుతూ.. మత్స్యకారుల హక్కులను కాపాడడంలో కేంద్రం విఫలమైందని విమర్శలు గుప్పించారు. శ్రీలంక నౌకాదళం దాడుల వల్ల 800 మంది తమిళనాడు మత్స్యకారులు బాధపడుతున్నారని పేర్కొన్నారు. ‘‘మీరు పెద్దగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. చిన్న పని చేయండి. కచ్చతీవును తిరిగి పొందండి, అది మా మత్స్యకారుల భద్రతకు సరిపోతుంది’’ అని విజయ్ ప్రధాని మోదీని ఉద్దేశించి అన్నారు.
Popular actor Thalapathi Vijay who left the Silver Screen to mount the political platform, challenges @PMOIndia to take back the Katchchateevu island to protect Tamilnadu fishermen from Sri Lanka navy attacks. pic.twitter.com/btpiP6Z0AI
— LankaFiles (@lankafiles) August 26, 2025
కచ్చతీవు ఒక చిన్న ద్వీపం. తమిళనాడు రామేశ్వరంకు సమీపంలో.. భారత్-శ్రీలంక మధ్య పాక్ జలసంధిలో ఉంది. ద్వీపంలో సెయింట్ ఆంటోనీ ప్రార్థన మందిరంలో ఏటా జరిగే ఉత్సవాలకు తమిళనాడు నుంచి ప్రజలు హాజరవుతుంటారు. 1974లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని అప్పటి భారత ప్రభుత్వం కచ్చతీవు భూభాగాన్ని శ్రీలంకకు అప్పగించింది. అయితే రాజ్యాంగ సవరణ లేకుండా అప్పగించడంపై వివాదం నడుస్తోంది.
రెవెన్యూ రికార్డుల ప్రకారం, ఇది రామనాథపురం జమీందారిలో భాగంగా ఉండేది. అందుకే ఇది భారత్‌దే అని వాదనలు తొలినాళ్ల నుంచే ఉన్నాయి. తమిళ మత్స్యకారులు ఈ ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే సమయంలో శ్రీలంక నౌకాదళం దాడులు, అరెస్టులు చేస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో ప్రతి ఎన్నికల సమయంలో కచ్చతీవు అంశం చర్చకు వస్తోంది. కానీ శాశ్వత పరిష్కారం మాతరం దొరకడం లేదు.