
మాధవ్ శింగరాజు
నూట నలభై తొమ్మిది పుస్తకాలు రాశాక కూడా, ఇవాళ రాయటం మొదలు పెట్టిన కొత్త పుస్తకానికి ప్రారంభ వాక్యం కుదరటం లేదు! నెహ్రూ నుంచి ముందుకు రావటమా, లేక నరేంద్ర మోదీ నుంచి వెనక్కు వెళ్లటమా? భారత ప్రధానుల మీద నేను తలపెట్టిన మహాకావ్య యజ్ఞమిది. జనవరి 22 నుండి కోల్‌కతా బుక్ ఫెయిర్. ఆ లోగా నా బుక్ బయటికి వచ్చేయాలంటే ప్రారంభ వాక్యం ఏమిటన్నది చూసుకోకూడదు.
నిజానికి, తొలి వాక్యానికి ఇంత యోచన అక్కర్లేదు. బెంగాల్ నుంచి ఒక్క ప్రధానీ లేరు కనుక బెంగాల్‌ను అమితంగా ఇష్టపడిన నెహ్రూజీతో నా పుస్తకాన్ని మొదలు పెట్టొచ్చు.నెహ్రూ పొద్దస్తమానం ఇక్కడికి వచ్చి వెళుతుండేవారు. కవులతో, కళాకారులతో ముచ్చట్లు పెట్టేవారు. టాగూర్, సుభాష్ చంద్రబోస్‌లతో క్లోజ్‌గా ఉండేవారు. నేనూ ఆ కాలం నాటి రచయిత్రిని అయుంటే... బహుశా నెహ్రూకూ, నాకూ మధ్య కూడా స్నేహం ఏర్పడి ఉండేదా! నా పెదవులపై చిరునవ్వు.
నెహ్రూ తర్వాత, నాలో మెదిలిన వారు శ్రీమతి గాంధీ. ఇక్కడే శాంతి నికేతన్‌లో ఆమె చదువుకున్నారు. నెహ్రూకి, శ్రీమతి గాంధీకి మధ్యలో ప్రధానిగా ఉన్న శాస్త్రీజీతో కూడా పుస్తకం మొదలు పెట్టొచ్చు. బోస్ మరణం లాగే, శాస్త్రీజీ మరణం కూడా ఒక మిస్టరీ! లేదంటే, నెహ్రూకీ–శాస్త్రీజీకీ మధ్యలో, శాస్త్రీజీకీ–శ్రీమతి గాంధీకీ మధ్యలో ప్రధానిగా ఉన్న నందాజీని తీసుకోవచ్చు. కానీ ఆయన బెంగాల్‌తో అస్సలు కనెక్ట్ అయి లేరు.
మొరార్జీ దేశాయ్ ఒకసారి ఇక్కడికి వచ్చి గంగలో మునకలేసి వెళ్లారు. చరణ్ సింగ్ అసలు కలకత్తాకే వచ్చినట్లు లేరు! వీపీ సింగ్, అప్పటి బెంగాల్ సీఎంతో మాట్లాడటానికి వచ్చారు. చంద్రశేఖర్ ఒక ఇండస్ట్రియలిస్టును కలిసేందుకు కలకత్తా వచ్చి వెళ్లినట్లున్నారు. దేవెగౌడ కూడా కలకత్తా వచ్చారు. పొలిటికల్‌గా నాకు సపోర్టు ఇచ్చారు. ఐ.కె. గుజ్రాల్ సై¯Œ ్స సిటీని ప్రారంభించి వెళ్లారు.
అసలింత ఆలోచన లేకుండా నేరుగా రాజీవ్ గాంధీతో ప్రారంభ వాక్యాన్ని మొదలు పెట్టొచ్చు. నేను కలిసిన తొలి ప్రధాని ఆయన. నన్ను తన సిస్టర్‌లా చూసుకున్నారు. కెరీర్‌లో నాకు లిఫ్ట్ ఇచ్చారు. పీవీని, వాజ్‌పేయిని, మన్మోహన్‌ని కూడా నేను కలిశాను కానీ, పీవీజీ ఎప్పుడైనా కలకత్తా వచ్చారేమో నాకు గుర్తు లేదు. అటల్‌జీ కలకత్తాలో మా ఇంటికి కూడా వచ్చారు. మన్మోహన్ కలకత్తా వచ్చి నా కోసం ఎన్నికల ప్రచారం చేశారు. తొలిసారి నన్ను సీఎంను చేసిన ఎన్నికలవి! ఇక మోదీజీ అయితే ఉదయం లేస్తూనే ఇప్పుడు బెంగాల్‌లో ఉంటున్నారు. మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు!
ఇంతమంది దిగ్గజాలలో ఎవరితో పుస్తకం మొదలు పెట్టాలో నిర్ణయించుకుంటే బహుశా ఆ వెనకే ప్రారంభ వాక్యం రావచ్చా అని ఆలోచిస్తూ ఉన్నాను.
‘‘శుభేచ్ఛా పీషీ’’ అంటూ లోపలికి వచ్చాడు అభిషేక్. తను నా అన్న కొడుకు.
‘‘రా, భిపో... వచ్చి కూర్చో’’ అని దగ్గరకు పిలిచాను. కూర్చున్నాక, ‘‘పుస్తకం ఎవరితో మొదలు పెడితే బాగుంటుంది?’’ అని అడిగాను. ప్రధానుల మీద నేను పుస్తకం రాయబోతున్నట్లు అభిషేక్‌కి తెలుసు.
కాసేపు దీర్ఘంగా ఆలోచించి, ‘‘అయినా పీషీ, ప్రధాన మంత్రుల మీద పుస్తకాన్ని ప్రధాన మంత్రులతోనే ఎందుకు ప్రారంభించాలి? ప్రధానిగా అవకాశం వచ్చినా, పార్టీ నిర్ణయాన్ని గౌరవించి, ఆ అవకాశాన్ని వదులుకున్న వారితో మొదలు పెట్టొచ్చు కదా?’’ అన్నాడు!
క్షణం తర్వాత గానీ, అభిషేక్ ఎవరి గురించి చెబుతున్నాడో నాకు అర్థం కాలేదు. అర్థమయ్యాక, ‘‘ఎక్స్‌లెంట్, భిపో’’ అని మెచ్చుకోలుగా తన వైపు చూశాను. బెంగాల్‌కు 23 ఏళ్లు సీఎంగా ఉన్న జ్యోతి బసు ప్రధాని కాలేకపోవచ్చు. బెంగాల్‌లో ఆయన నా రాజకీయ ప్రత్యర్థి అయితే కావచ్చు. కానీ, నేను రాయబోయే ప్రధానుల పుస్తకానికి నిండుదనాన్నయితే తేగలిగినవారే!