ఆరేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయి, ద మేకర్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌గా! | Jagat Murari: The Visionary Who Shaped FTII and Indian New Wave Cinema | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయి, ద మేకర్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌గా!

Oct 29 2025 11:32 AM | Updated on Oct 29 2025 12:46 PM

The Maker of Filmmaker book  review by rentala jayadeva

పుస్తక ప్రపంచం ఒక స్వాప్నికుడి సినీ యజ్ఞం 

పుణేలోని ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్టీఐఐ) గురించి ఇవాళ జాతీయంగానే కాదు... అంతర్జాతీయంగానూ బాగా తెలుసు. కానీ, 1961లో కేవలం రూ. 3 లక్షల వార్షిక బడ్జెట్‌తో ఆ సంస్థను ఆరంభించినప్పుడు దాన్ని ఇలాంటి ఓ వ్యవస్థగా తీర్చిదిద్దడం వెనుక ఉన్న అరుదైన వ్యక్తి గురించి కొద్దిమందికే తెలుసు. ఆయన... జగత్‌ మురారి (1922–2007). స్వయంగా ఫిల్మ్‌మేకరైన ఆయన జీవితకథ, ఆయన సారథ్యంలో సినీ సృజనాత్మక కార్యశాలగా ఎఫ్టీఐఐ అవతరించిన కీలక సమయం, సందర్భాలకు చెరగని అక్షరరూపం... ‘ద మేకర్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌’. భవిష్యత్‌ సినీ రూపకర్తలను తండ్రి తీర్చిదిద్దుతున్న సమయంలో ఆ సృజనాత్మక ప్రాంగణంలో పెరిగిన రాధ ఇప్పుడు ఆ పురావైభవ చరిత్రను ఆసక్తికరంగా అందించారు. 

పట్నాలో ఓ మామూలు కుటుంబంలో పుట్టి, ఆరేళ్ళ వయసులోనే తల్లిని కోల్పోయి, ఒంటరి తండ్రి పెంపకంలో పెరిగి, భౌతికశాస్త్రం చదువుకొన్న జగత్‌ అసలు సైంటిస్ట్‌ కావాల్సిన వ్యక్తి. అనుకోకుండా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో సినిమా చదువు చదువుకొని, ఆయన కళారంగంలోకి రావడం యాదృచ్ఛికమే అయినా, భారతీయ సినీ రంగానికి బోలెడంత మేలు చేసింది. ఫిల్మ్స్‌ డివిజన్‌లో కెరీర్‌ను మొదలుపెట్టి, 1940లు, 50లలో పలు డాక్యుమెంటరీ లతో భారతీయ ఆత్మను కెమెరాతో కోట్లాది జనం ముందుకు తెచ్చారు. తొలి రాష్ట్రపతి స్వర్ణపతకం (ఇప్పటి పరిభాషలో నేషనల్‌ అవార్డ్‌) సాధించిన ఘనత ఆయన తీసిన ‘మహాబలిపురం’ (1952) డాక్యు మెంటరీదే! అందుకే, దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం ఓ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను పెట్టాలనుకున్నప్పుడు దాని సారథ్యానికి అన్నివిధాలా ఆయనే అర్హుడయ్యారు.   

1947లో ‘మ్యాక్‌బెత్‌’ తీస్తున్న సినీ దిగ్గజం ఆర్సన్‌ వెల్స్‌ వద్ద పాఠాలు నేర్చుకున్న జగత్‌ ఆ తరువాత ఎందరికో పాఠాలు చెప్పే గురువయ్యారు. ఎఫ్టీఐఐకి ప్రిన్సిపాల్‌గా జగత్‌ దూరదృష్టి అపూర్వ పథనిర్దేశం చేసింది. జయా బచ్చన్, షబానా ఆజ్మీ, సుభాష్‌ ఘయ్, అదూర్‌ గోపాలకృష్ణన్, శత్రుఘ్నసిన్హా  లాంటి ఎందరో నటులు, దర్శకులు, ఇంకా సినిమా టోగ్రాఫర్లు, ఎడిటర్లు ఆయన వదిలిన బాణాలే. భారతీయ సినీ రంగంలో ‘న్యూ వేవ్‌ సినిమా’కు వారే కీలక పాత్రధారులు. ముఖ్యమైన వ్యక్తిగా ఉండడం కన్నా మంచి వ్యక్తిగా ఉండడం ప్రధానం – ఇదీ జగత్‌ జీవన తాత్త్వికత.  పుణేలోని ప్రసిద్ధ జయకర్‌ బంగళా (ఇప్పుడు నేషనల్‌ ఫిల్మ్‌ ఆర్కైవ్స్‌ ఆఫీసు)లోని నివాసంలో విద్యార్థుల్ని సొంత బిడ్డల్లా చూసిన వైనం, అలాగే ఆయన జీతం పెంపు కోసం అప్పటి సమాచార శాఖ మంత్రి ఇందిరాగాంధీ జోక్యం చేసు కోవడం లాంటివి అబ్బురపరుస్తాయి. అప్పటికే ప్రసిద్ధ సినిమాలు తీసినా, అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందుల్లో వీధిన పడ్డ ముగ్గురు చిన్నపిల్లల తండ్రి రిత్విక్‌ ఘటక్‌ను ఎఫ్టీఐఐలో వైస్‌ ప్రిన్సిపాల్‌గా తీసు కోవడానికి జగత్‌ పడ్డ కష్టం, అవస్థలు పడుతూనే రిత్విక్‌ను కాపాడుకొనేందుకు పడిన శ్రమ చదువుతూ గుండె చిక్కబట్టుకోవడం కష్టం. నేషనల్‌ ఫిల్మ్‌ ఆర్కైవ్‌ ఆరంభ, వికాసాలకు జగత్‌ చేసిన అపార కృషి సహా ఎన్నో సంఘటనలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.

ఇదీ చదవండి: Cyclone Montha.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

జగత్‌ రాసుకున్న డైరీలు, దాచిపెట్టుకొన్న ఆత్మ కథ నోట్సులు ప్రధాన ఆధారమైనప్పటికీ, ఈ రచన కోసం లోతుగా పరిశోధించి, అనేక అంశాలను గుదిగుచ్చారని అర్థమవుతుంది. అదే సమయంలోఈ పుస్తకం ఒక మంచి నవలలా సాగుతూ, భారత సినీ చరిత్రలో అవిస్మరణీయ అధ్యాయాన్ని పాఠకుల ముందు ఉంచుతుంది. ఇవాళ్టికీ రికార్డు కాని ఇలాంటి తెర వెనుక కథలు, వ్యక్తుల విశేషాలెన్నో తెలుసు కోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. అరుదైన ఫొటోలు, అనుబంధ సమాచారం అదనపు హంగులు. భారతీయ డాక్యుమెంటరీ చిత్రనిర్మాణ చరిత్రలో ప్రత్యేక స్థానమున్న జగత్‌తో పాటు ఎఫ్టీఐఐ తొలి నాళ్ళను తెలుసుకోవడానికి ఈ రచన సినీ ప్రియులకు ఓ అపురూప సమాచార విందు!

 -రెంటాల జయదేవ

(‘ద మేకర్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌’ : హౌ జగత్‌ మురారి అండ్‌ ఎఫ్‌.టి.ఐ.ఐ. ఛేంజ్డ్‌ ఇండియన్‌ సినిమా ఫరెవర్‌ రచయిత్రి – కాలమిస్ట్‌ : రాధా చడ్ఢా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement