breaking news
FTII Pune
-
ఆరేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయి, ద మేకర్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్‌గా!
పుణేలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్టీఐఐ) గురించి ఇవాళ జాతీయంగానే కాదు... అంతర్జాతీయంగానూ బాగా తెలుసు. కానీ, 1961లో కేవలం రూ. 3 లక్షల వార్షిక బడ్జెట్‌తో ఆ సంస్థను ఆరంభించినప్పుడు దాన్ని ఇలాంటి ఓ వ్యవస్థగా తీర్చిదిద్దడం వెనుక ఉన్న అరుదైన వ్యక్తి గురించి కొద్దిమందికే తెలుసు. ఆయన... జగత్ మురారి (1922–2007). స్వయంగా ఫిల్మ్మేకరైన ఆయన జీవితకథ, ఆయన సారథ్యంలో సినీ సృజనాత్మక కార్యశాలగా ఎఫ్టీఐఐ అవతరించిన కీలక సమయం, సందర్భాలకు చెరగని అక్షరరూపం... ‘ద మేకర్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్’. భవిష్యత్ సినీ రూపకర్తలను తండ్రి తీర్చిదిద్దుతున్న సమయంలో ఆ సృజనాత్మక ప్రాంగణంలో పెరిగిన రాధ ఇప్పుడు ఆ పురావైభవ చరిత్రను ఆసక్తికరంగా అందించారు. పట్నాలో ఓ మామూలు కుటుంబంలో పుట్టి, ఆరేళ్ళ వయసులోనే తల్లిని కోల్పోయి, ఒంటరి తండ్రి పెంపకంలో పెరిగి, భౌతికశాస్త్రం చదువుకొన్న జగత్ అసలు సైంటిస్ట్ కావాల్సిన వ్యక్తి. అనుకోకుండా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో సినిమా చదువు చదువుకొని, ఆయన కళారంగంలోకి రావడం యాదృచ్ఛికమే అయినా, భారతీయ సినీ రంగానికి బోలెడంత మేలు చేసింది. ఫిల్మ్స్ డివిజన్లో కెరీర్‌ను మొదలుపెట్టి, 1940లు, 50లలో పలు డాక్యుమెంటరీ లతో భారతీయ ఆత్మను కెమెరాతో కోట్లాది జనం ముందుకు తెచ్చారు. తొలి రాష్ట్రపతి స్వర్ణపతకం (ఇప్పటి పరిభాషలో నేషనల్ అవార్డ్) సాధించిన ఘనత ఆయన తీసిన ‘మహాబలిపురం’ (1952) డాక్యు మెంటరీదే! అందుకే, దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం ఓ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ను పెట్టాలనుకున్నప్పుడు దాని సారథ్యానికి అన్నివిధాలా ఆయనే అర్హుడయ్యారు. 1947లో ‘మ్యాక్బెత్’ తీస్తున్న సినీ దిగ్గజం ఆర్సన్ వెల్స్ వద్ద పాఠాలు నేర్చుకున్న జగత్ ఆ తరువాత ఎందరికో పాఠాలు చెప్పే గురువయ్యారు. ఎఫ్టీఐఐకి ప్రిన్సిపాల్‌గా జగత్ దూరదృష్టి అపూర్వ పథనిర్దేశం చేసింది. జయా బచ్చన్, షబానా ఆజ్మీ, సుభాష్ ఘయ్, అదూర్ గోపాలకృష్ణన్, శత్రుఘ్నసిన్హా లాంటి ఎందరో నటులు, దర్శకులు, ఇంకా సినిమా టోగ్రాఫర్లు, ఎడిటర్లు ఆయన వదిలిన బాణాలే. భారతీయ సినీ రంగంలో ‘న్యూ వేవ్ సినిమా’కు వారే కీలక పాత్రధారులు. ముఖ్యమైన వ్యక్తిగా ఉండడం కన్నా మంచి వ్యక్తిగా ఉండడం ప్రధానం – ఇదీ జగత్ జీవన తాత్త్వికత. పుణేలోని ప్రసిద్ధ జయకర్ బంగళా (ఇప్పుడు నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫీసు)లోని నివాసంలో విద్యార్థుల్ని సొంత బిడ్డల్లా చూసిన వైనం, అలాగే ఆయన జీతం పెంపు కోసం అప్పటి సమాచార శాఖ మంత్రి ఇందిరాగాంధీ జోక్యం చేసు కోవడం లాంటివి అబ్బురపరుస్తాయి. అప్పటికే ప్రసిద్ధ సినిమాలు తీసినా, అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందుల్లో వీధిన పడ్డ ముగ్గురు చిన్నపిల్లల తండ్రి రిత్విక్ ఘటక్‌ను ఎఫ్టీఐఐలో వైస్ ప్రిన్సిపాల్‌గా తీసు కోవడానికి జగత్ పడ్డ కష్టం, అవస్థలు పడుతూనే రిత్విక్‌ను కాపాడుకొనేందుకు పడిన శ్రమ చదువుతూ గుండె చిక్కబట్టుకోవడం కష్టం. నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆరంభ, వికాసాలకు జగత్ చేసిన అపార కృషి సహా ఎన్నో సంఘటనలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.ఇదీ చదవండి: Cyclone Montha.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!జగత్ రాసుకున్న డైరీలు, దాచిపెట్టుకొన్న ఆత్మ కథ నోట్సులు ప్రధాన ఆధారమైనప్పటికీ, ఈ రచన కోసం లోతుగా పరిశోధించి, అనేక అంశాలను గుదిగుచ్చారని అర్థమవుతుంది. అదే సమయంలోఈ పుస్తకం ఒక మంచి నవలలా సాగుతూ, భారత సినీ చరిత్రలో అవిస్మరణీయ అధ్యాయాన్ని పాఠకుల ముందు ఉంచుతుంది. ఇవాళ్టికీ రికార్డు కాని ఇలాంటి తెర వెనుక కథలు, వ్యక్తుల విశేషాలెన్నో తెలుసు కోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. అరుదైన ఫొటోలు, అనుబంధ సమాచారం అదనపు హంగులు. భారతీయ డాక్యుమెంటరీ చిత్రనిర్మాణ చరిత్రలో ప్రత్యేక స్థానమున్న జగత్‌తో పాటు ఎఫ్టీఐఐ తొలి నాళ్ళను తెలుసుకోవడానికి ఈ రచన సినీ ప్రియులకు ఓ అపురూప సమాచార విందు! -రెంటాల జయదేవ(‘ద మేకర్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్’ : హౌ జగత్ మురారి అండ్ ఎఫ్.టి.ఐ.ఐ. ఛేంజ్డ్ ఇండియన్ సినిమా ఫరెవర్ రచయిత్రి – కాలమిస్ట్ : రాధా చడ్ఢా) -
ఎఫ్టీఐఐ చైర్మన్‌గా అనుపమ్ ఖేర్
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్(62)కు కీలక పదవి లభించింది. పుణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్టీఐఐ) చైర్మన్‌గా ఖేర్‌ను నియమించినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ అధికారులు తెలిపారు. ఎఫ్టీఐఐ చైర్మన్‌గా తనను ఎంపిక చేయడంపై ఖేర్ స్పందిస్తూ ‘ప్రతిష్టాత్మకమైన ఎఫ్టీఐఐకి చైర్మన్‌గా ఎంపిక కావడాన్ని గౌరవంగా భావిస్తున్నా. నాకు అప్పగించిన విధుల్ని శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తాను’ అని ట్వీటర్లో అన్నారు. ఎఫ్టీఐఐ చైర్మన్‌గా పనిచేసిన గజేంద్ర చౌహాన్ పదవీకాలం ముగిసిన 7 నెలల అనంతరం కేంద్రం అనుపమ్ ఖేర్‌ను చైర్మన్‌గా కేంద్రం నియమించింది. ఖేర్ ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(ఎన్ఎస్డీ)లో డిగ్రీ పొందారు. 500 పైచిలుకు చిత్రాల్లో నటించిన ఖేర్ సినిమా,కళల రంగానికి అందించిన సేవలకు గానూ 2004లో పద్మశ్రీ, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. -
ఎన్నికల తాయిలాలు!
సాక్షి ముంబై: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్లో రాష్ట్రానికి కొంతమేర ప్రాధాన్యతనిచ్చినట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ అనేకవర్గాల ప్రజలు, విశ్లేషకులు, ప్రతిపక్ష నేతల నుంచి పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధానిగా చెప్పుకునే ముంబైకి బడ్జెట్లో ఎటువంటి కేటాయింపు జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పుణేలోని ఎఫ్టీఐఐ సంస్థకు జాతీయ హోదా కల్పించడం, నాగపూర్‌లో ఎయిమ్స్ ఆస్పత్రి ఏర్పాటు చేయడం రాష్ట్రవాసులకు ప్రత్యక్షంగా ప్రయోజనం కలిగించే అంశాలని చెబుతున్నారు. నాణ్యమైన విద్యనందించేందుకు దేశవ్యాప్తంగా ఐదు ఐఐఎంలను స్థాపించనున్నట్లు ప్రకటించగా అందులో ఒకటి మహారాష్ట్రకు దక్కడం కూడా ఊరటగానే చెప్పవచ్చని చెబుతున్నారు. నదుల అనుసంధానం కోసం అధ్యయనం జరిపేందుకు రూ. 100 కోట్లు కేటాయించారు. అనుసంధానం జరిగితే దేశంలోని మిగతా రాష్ట్రాలకంటే ఎక్కువ ప్రయోజనం పొందేది మన రాష్ట్రమే. ఇక తీరప్రాంతాలు, ఓడరేవుల అభివృద్ధి కోసం రూ. 11,000 కోట్లను కేటాయించారు. దీంతో కేటాయించిన సొమ్ములో రాష్ట్రానికి గరిష్ట వాటా ఉంటుందనేది ఆర్థిక నిపుణుల విశ్లేషణ. చౌక ధరల ఇళ్లు, మురికివాడల అభివృద్ధి వంటి నిర్ణయాలతో నగరంలోని ధారవి వంటి ప్రాంతాలు అభివృద్ధి చెందు తాయని చెబుతున్నారు. పుణేలో పారిశ్రామి క కారిడార్ల ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. ఇందుకోసం రూ. 100 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి అరున్ జైట్లీ ప్రకటించారు.


