breaking news
rentala jayadeva
-
తెలంగాణ గద్దర్ అవార్డులు.. ఉత్తమ సినీ గ్రంథంగా రెంటాల జయదేవ పుస్తకం
రచయిత, సీనియర్ జర్నలిస్టు, ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది అవార్డు గ్రహీత అయిన డాక్టర్ రెంటాల జయదేవను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక గద్దర్ ఫిల్మ్ అవార్డు వరించింది. మరుగున పడిపోయిన మన సినీ చరిత్రలోని అనేక అంశాలపై ఆయన రచించిన 'మన సినిమా... ఫస్ట్ రీల్' అనే పుస్తకం ఉత్తమ సినీ గ్రంథంగా ఎంపికైంది. 2024లో వచ్చిన ఉత్తమ చిత్రాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డులలో జయదేవ రచనకు అవార్డ్ లభించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల జ్యూరీ ఈ విషయాన్ని ప్రకటించింది.దక్షిణ భారతీయ భాషా చిత్రాల తొలి అడుగుల చరిత్రపై జయదేవ పాతికేళ్ల పరిశోధనా పరిశ్రమకు ప్రతిఫలం ఈ మన సినిమా... ఫస్ట్ రీల్ పుస్తకం. ఇప్పటికీ మన సినీ చరిత్రలో నమోదు కాకుండా మిగిలిపోయిన అనేక అంశాలను తవ్వి తీసిన అరుదైన రచన ఇది. మూకీ సినిమాల రోజుల నుంచి తెర మీద బొమ్మ మాటలు నేర్చి.. భాషల వారీగా ప్రత్యేక శాఖలుగా విడివడిన టాకీల తొలి రోజుల దాకా మన భారతీయ సినిమాలో, ముఖ్యంగా మన తెలుగు సినిమాలో జరిగిన మనకు తెలియని అనేక పరిణామాలను సాక్ష్యాలతో, సవిశ్లేషణాత్మకంగా రాసిన గ్రంథం ఇది. రచయిత జయదేవ శ్రమించి సేకరించిన దాదాపు వందేళ్ల క్రితం అలనాటి పత్రికా సమాచారం, ఫోటోల లాంటి ప్రామాణిక ఆధారాలతో... అరుదైన సమాచారంతో... ఈ సినీ చరిత్ర రచన సాగింది.తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ చిత్రం కాళిదాస్(1931)పై అనేక కొత్త సంగతులను రెంటాల జయదేవ ఇందులో తవ్వితీశారు. నిజానికి, అది ఒక సినిమా కాదనీ.. మూడు చిన్న నిడివి చిత్రాల సమాహారమనీ, అందులో ప్రధాన భాగమైన ‘కాళిదాస్’ కథాచిత్రం మాత్రం 4 రీళ్ల నిడివిలో పూర్తిగా తెలుగులోనే తీసిన లఘుచిత్రమని తెలిపారు. అలనాటి సాక్ష్యాధారాలతో ఈ విషయాన్ని నిరూపించారు. తమిళులు దాన్ని తమ తొలి టాకీగా చెప్పుకుంటూ తమ చరిత్రలో కలిపేసుకుంటూ ఉంటే... పూర్తి తెలుగు డైలాగులు ఆ సినిమాను తెలుగువాళ్లం మన సినీ చరిత్ర లెక్కల్లో చేర్చుకోకుండా వదిలేశామని గుర్తుచేశారు. అలా మనం విస్మరిస్తున్న మన తొలినాళ్ల తెలుగు సినీచరిత్రను అక్షరబద్ధం చేశారు.హిందీతో సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీసీమల్లో వచ్చిన మొట్టమొదటి టాకీలకు సంబంధించిన అనేక చారిత్రక సత్యాలను ఈ రచనలో జయదేవ అందించారు. అత్యంత అరుదైన దాదాపు 2 వేల పత్రికా ప్రకటనలు, ఫోటోలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. 90 ఏళ్ల చరిత్ర గల ప్రతిష్ఠాత్మక పుస్తక ప్రచురణ సంస్థ ఎమెస్కో 566 పేజీల ఈ బృహత్ రచనను ప్రచురించింది. ఈ పుస్తకం పండిత, పామరుల ప్రశంసలందుకొని, ప్రామాణిక చరిత్ర గ్రంథంగా పాఠక లోకంలో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ సినీ గ్రంథంగా ఎంపికైంది.ఆనాటి నుంచి ఈనాటి వరకు పలువురు ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడమే కాకుండా.. అలనాటి వారు గతంలో వచ్చిన ఇంటర్వ్యూల నుంచి కూడా ఎంతో విలువైన సమాచారాన్ని జయదేవ సేకరించి మన సినిమా... ఫస్ట్ రీల్ అనే పుస్తకంలో పొందుపరిచారు. పైపైన వివరాలకు పరిమితం కాకుండా సినిమాల రూపకల్పన, అందుకు జరిగిన కసరత్తు, నటీనటుల ఎంపిక, వాటి విడుదలకు నిర్మాతలు పడిన పాట్లు, అనేక పరిమితుల మధ్యనే ఆనాటి దర్శకులు చూపిన సృజనశీలత, అప్పటి సినిమా నిర్మాణ, పంపిణీ, ప్రదర్శక రంగాల తీరు, సినిమా వ్యాపారం జరిగే పద్ధతులు, కాలానుగుణంగా వచ్చిన పరిణామాలు... అన్నీ ఈ రచనలో కళ్లకు కట్టినట్లు వివరించారు.తెలుగునాట రచయితగా, పరిశోధకుడిగా, పత్రికా రంగంలో ఫీచర్స్ రచయితగా, సినీ విశ్లేషకుడిగా, విలేఖరిగా ప్రసిద్ధమైన పేరు డాక్టర్ రెంటాల జయదేవ. ఇప్పటికి మూడున్నర దశాబ్దాల పైగా నిరంతరాయంగా ఆయన తన రచనలతో ప్రత్యేక కృషి చేస్తున్నారు. తండ్రి గారైన ప్రముఖ అభ్యుదయ కవి, దాదాపు 200 పుస్తకాలు రాసిన గ్రంథకర్త, జర్నలిస్టు, కీర్తిశేషులు రెంటాల గోపాలకృష్ణ సాహితీ, పత్రికా వారసత్వాన్ని జయదేవ పుణికిపుచ్చుకున్నారు. పాత తరం పత్రికా విలువల జెండాను కొత్త తరంలో ముందుకు తీసుకువెళుతున్న అతి కొద్దిమంది నిఖార్సయిన జర్నలిస్టుల్లో ఒకరిగా నిలిచారు. జయదేవ పత్రికా సంపాదకీయాలు, ప్రత్యేక వ్యాసాలు, సినిమా సమీక్షలు, ప్రత్యేక వార్తా కథనాలు, విశ్లేషణలు, ప్రముఖులతో లోతైన టీవీ, పత్రికా ఇంటర్వ్యూలు ప్రజలకూ, పరిశ్రమ వారికీ సుపరిచితం. ఆపకుండా చదివించే ఆయన రచనలు పాఠకుల్ని ఆకట్టుకోవడమే కాక, పలుమార్లు చర్చనీయాంశం అవుతుంటాయి.తొలి పూర్తి నిడివి పది రీళ్ల తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ సరైన విడుదల తేదీని కూడా గతంలో రెంటాల జయదేవే తన పరిశోధనలో వెలికితీశారు. తెలుగు సినిమా దినోత్సవం విషయంలో అనేక దశాబ్దాలుగా ప్రచారంలో ఉన్న తప్పులను ఆయన సాక్ష్యాధారాలు చూపి సరిదిద్దారు. తెలుగు సినీరంగ చరిత్రను మార్చేసిన ప్రామాణికమైన ఆయన పరిశోధనను ప్రముఖ చరిత్రకారులు, సినీ పెద్దలు బాహాటంగా ఆమోదించారు. ప్రపంచ వ్యాప్తంగా జయదేవ పరిశోధన అంగీకారం పొందడంతో, ఇవాళ తెలుగు సినీ పరిశ్రమ మన తెలుగు సినిమా దినోత్సవాన్ని సవరించుకొని, ఆయన చెప్పిన ఫిబ్రవరి 6నే అధికారికంగా తెలుగు సినిమా డేను జరుపుకొంటూ ఉండడం విశేషం.ఇది చదవండి: తెలుగు సినిమా పండగ రోజురెంటాల జయదేవ విశిష్ట కృషిని గుర్తించి.. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డుకు ఎంపిక చేసింది. 2011కి గాను ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది పురస్కారాన్ని ప్రకటించింది. తెలుగు సినిమా చరిత్రను కొత్త మలుపు తిప్పిన ఈ పరిశోధనాత్మక గ్రంథంతో తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డ్ వరించింది. తొలినాళ్ల తెలుగు సినిమా చరిత్రపై కనివిని ఎరుగని పరిశోధన చేస్తూ, ఎన్నో కొత్త సంగతులు బయటపెట్టిన రెంటాల జయదేవ (Rentala Jayadeva) నిరంతర అపూర్వ కృషిని తెలుగు సినీ పరిశ్రమ మొత్తానికీ ప్రాతినిధ్య సంస్థ అయిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైతం గుర్తించింది. భక్త ప్రహ్లాద సరైన విడుదల తేదీని పురస్కరించుకొని ఆయనను ఇటీవల ప్రత్యేకంగా సత్కరించడం విశేషం. -
సంపదలిచ్చే కల్పవల్లి... మోక్షమిచ్చే తల్లి
నేడు... క్షీరాబ్ధి ద్వాదశి ఈ రోజు తులసి దగ్గర దీపదానం చేస్తే, సమస్త పాపాలూ నశిస్తాయి. వంద దీపాలను దానం చేసినవారు భగవత్ సాన్నిధ్యం చేరతారు. ఒక వత్తితో దీపం దానమిస్తే, విజ్ఞాని అవుతారు. రెండు వత్తులతో ఇస్తే, రాజు అవుతారు. పది వత్తులతో ఇస్తే, దైవసాక్షాత్కారం లభిస్తుంది. వెయ్యి వత్తులతో దీపదానం చేస్తే, తుదిశ్వాసతో ఆ దైవంలో లీనమవుతారని వ్యాసుడి మాట. శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన మాసం కార్తిక మాసం. పున్నమి చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ప్రవేశించినప్పుడు వచ్చే మాసం కాబట్టి, దీని పేరు ‘కార్తికం’. ఈ నెలలో రోజూ పుణ్యప్రదమే. కొన్ని ప్రత్యేకదినాలు మరింత పుణ్యప్రదం. వాటిలో ఒకటి - కార్తిక శుక్ల ద్వాదశి. కార్తికంలో 12వ రోజైన ద్వాదశిని ‘క్షీరాబ్ధి ద్వాదశి’ అంటారు. దీనికే ‘మథన ద్వాదశి’, ‘చిలుకు ద్వాదశి’, ‘చినుకు ద్వాదశి’, ‘తీర్థన ద్వాదశి’, ‘తులసి ద్వాదశి’, ‘యోగేశ్వర ద్వాదశి’, ‘హరిబోధిని ద్వాదశి’ - ఇలా రకరకాల పేర్లు. విష్ణుమూర్తి నిద్ర లేచిన నాడు... ఈ ‘క్షీరాబ్ధి ద్వాదశి’కి ముందు రోజు ‘ఉత్థాన ఏకాదశి’. ప్రతీ పక్షానికీ, అంటే పదిహేను రోజులకూ ఏకాదశులు వస్తూనే ఉంటాయి. అలా వచ్చే ఏకాదశులు అన్నింటిలోనూ ఆషాఢ శుద్ధ ఏకాదశి, కార్తిక శుద్ధ ఏకాదశి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే, ఆషాఢ శుద్ధ ఏకాదశికి శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. కాబట్టి అది ‘శయన ఏకాదశి’. అలా శయనించిన విష్ణుమూర్తి నాలుగు మాసాల తరువాత ఈ కార్తిక శుద్ధ ఏకాదశికి నిద్ర నుంచి మేల్కొంటాడు. ఉత్థానమంటే లేవడమని అర్థం. కాబట్టి, దీనికి ‘ఉత్థాన ఏకాదశి’ అని పేరు. దీన్నే ‘ప్రబోధిన్యేకాదశి’ అని కూడా అంటారు. పాలకడలిని చిలికింది ఈ రోజే! ఆ మరునాడైన ద్వాదశి నాడే అమృతం కోసం దేవతలు, రాక్షసులు పాలకడలిని మథించడం మొదలైందని కథనం. క్షీరసాగర మథనం ప్రారంభమైంది కాబట్టి, అది ‘క్షీరాబ్ధి ద్వాదశి’. పాల కడలిని మథించారు. అంటే చిలికారు కాబట్టి, ఇది ‘మథన ద్వాదశి’. మామూలు మాటల్లో ‘చిలుకు ద్వాదశి’. ద్వాదశి ముందు రోజైన ఏకాదశి నాడు పండరీపురంలోని విఠలేశ్వర ఆలయంలో పెద్ద ఉత్సవం చేస్తారు. ఆ రోజు ఉపవాసం ఉండాలి. కాయధాన్యాల ఆహారం తినకుండా, ఫలహారం చేయాలి. రాత్రి జాగారం చేయాలి. ద్వాదశి ఉదయాన్నే తలంటు స్నానం చేసి, వ్రతం ఆచరించాలి. శ్రీహరికి నైవేద్యం పెట్టాలి. కనీసం ఒక్కరికైనా అన్నదానం చేయాలి. ఈ అన్నదానం అనంత పుణ్యాన్నిస్తుంది. సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగాతీరంలో కోటిమందికి అన్నదానం చేస్తే వచ్చేంత పుణ్యం ఈ రోజు అన్నదానంతో వస్తుందంటారు. తెలుగు నాట... తులసి, ఉసిరికల పూజ భారతీయ సంప్రదాయంలో తులసి పరమ పవిత్రం, శుభకరం. అందుకనే, స్త్రీలు ప్రతిరోజూ తులసి చెట్టును పూజించి, తులసి చెట్లన్నిటినీ పెంచే ‘బృందావనం’ (తులసి కోట)లో నీళ్ళు పోస్తారు. ఇక, క్షీరాబ్ధి ద్వాదశి నాడు తులసి చెట్టును సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మిగా భావించి, పూజిస్తారు. ఈ ద్వాదశి నాటి తులసీ పూజ వెనుక ఒక కారణం ఉంది. అప్పటి దాకా పాలకడలిపై శయనించి ఉన్న విష్ణువు ‘ఉత్థాన ఏకాదశి’ నాడు శ్రీమహాలక్ష్మితో కలసి, బ్రహ్మాది దేవతలు వెంట రాగా, తులసి బృందావనంలోకి ప్రవేశిస్తాడని పెద్దల మాట. అందుకే, ‘క్షీరాబ్ధి ద్వాదశి’ నాడు ఇలా భూలోకానికి వచ్చిన విష్ణుమూర్తికి ప్రతీకగా తులసి చెట్టునూ, ఉసిరిక చెట్టునూ పూజించడం సంప్రదాయం. విష్ణువు, లక్ష్మీదేవి సహితంగా ఈ రెండు చెట్లకూ ఆవు నెయ్యితో తడిపిన 360 వత్తులతో నీరాజనమిస్తారు. ఇంట్లో ఉసిరిక చెట్టు ఉండకపోవచ్చు కాబట్టి, తులసి చెట్టు పక్కనే, ఉసిరి కాయతో ఉన్న ఉసిరి చెట్టు కొమ్మ పాతి, పూజ చేయడం ఆచారం. అందుకే, ‘క్షీరాబ్ధిశయన వ్రతకల్పం’లో ‘తులసీ సహిత ధాత్రీ లక్ష్మీనారాయణ’, ‘తులసీ ధాత్రీ సహిత లక్ష్మీనారాయణ’ లాంటి మాటలు కనిపిస్తాయి. ‘ధాత్రి’ అంటే ఉసిరిక అనీ అర్థం. ఈ ద్వాదశికి ఉసిరికాయల్లో పూజా సమయంలో దీపారాధన చేయడం తెలుగు నాట ఆచారం! తులసి, ఉసిరిక ఒకేచోట, ఒకేసారి పుట్టినట్లు ‘శివపురాణ’ కథ. ఈ ‘క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం’ చేస్తే కోర్కెలన్నీ నెరవేరతాయని ధర్మరాజుకు వ్యాసుడు చెప్పాడు. ఎలా పూజించాలి? ద్వాదశి నాటి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కలన్నిటినీ పెంచే తులసి కోట దగ్గర స్త్రీలు శుభ్రం చేసి, ముగ్గులు తీర్చాలి. తులసి కోటను అలంకరించాలి. తులసికి కుంకుమ పెట్టాలి. కోట చుట్టూ దీపాలు వెలిగించాలి. దీపారాధనకు ఆవు నూనె కానీ, నువ్వుల నూనె కానీ శ్రేష్ఠం. ధూప, దీప, నైవేద్యాలతో తులసిని పూజించి, విష్ణు స్తోత్రం, లక్ష్మీ స్తుతి చేస్తారు. ఇది కాక కొందరికి తులసి చెట్టును చీరతో అలంకరించి, పువ్వులు, ఎర్ర గాజులు పెట్టి, తాంబూలం కూడా సమర్పించే ఆచారం ఉంది. ‘క్షీరాబ్ధి ద్వాదశి’ నాడు ఇలా శ్రద్ధాసక్తులతో శ్రీమహావిష్ణువునూ, తులసినీ పూజిస్తే సమస్త పాపాలూ నశిస్తాయి. విష్ణువు సంతుష్టుడవుతాడు. ఆయురారోగ్యాలు, సిరిసంపదలు సిద్ధిస్తాయని నమ్మకం. మహారాష్ట్రలో... తులసీ కల్యాణం మహారాష్ర్ట, మాళవ ప్రాంతాల్లో ఈ రోజున శ్రీమహావిష్ణువు అవతారమైన కృష్ణుడికీ, తులసికీ కల్యాణం చేసే సంప్రదాయం ఉంది. పాలకడలిని చిలుకుతుంటే కల్పవృక్షం, కామధేనువు పుట్టాయి. లక్ష్మీదేవి కూడా అలా పాలకడలి నుంచి పుట్టినదే. ఆమెను క్షీరాబ్ధి ద్వాదశి నాడే విష్ణుమూర్తి వివాహం చేసుకున్నట్లు మరో కథనం. దానికి గుర్తుగా ఏటా ఆనాటి సాయంత్ర వేళ లక్ష్మీదేవిని పూజించడంతో పాటు విష్ణువు అవతారమైన కృష్ణుడికీ, లక్ష్మికి ప్రతిరూపమైన తులసికీ కల్యాణం చేస్తారు. తెలుగునాట ఈ తులసి వివాహతంతు లేదు కానీ, తులసి పూజ ఎక్కువ. కార్తికంలో నిత్య దీపారాధన శ్రేష్ఠం. రోజూ చేయలేకపోయినా, కనీసం శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమినాడైనా దీపారాధన మంచిది. తులసి వద్ద దీపారాధన చేసినంతనే అమితపుణ్యమిచ్చే రోజు కాబట్టే, ‘క్షీరాబ్ధి ద్వాదశి’కి అంత విశిష్టత. నమ స్తులసి కల్యాణి... నమో విష్ణుప్రియే శుభే, నమో మోక్షప్రదే దేవి... నమః సంపత్ ప్రదాయికే. - రెంటాల జయదేవ