
రచయిత, సీనియర్ జర్నలిస్టు, ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది అవార్డు గ్రహీత అయిన డాక్టర్ రెంటాల జయదేవను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక గద్దర్ ఫిల్మ్ అవార్డు వరించింది. మరుగున పడిపోయిన మన సినీ చరిత్రలోని అనేక అంశాలపై ఆయన రచించిన 'మన సినిమా... ఫస్ట్ రీల్' అనే పుస్తకం ఉత్తమ సినీ గ్రంథంగా ఎంపికైంది. 2024లో వచ్చిన ఉత్తమ చిత్రాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డులలో జయదేవ రచనకు అవార్డ్ లభించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల జ్యూరీ ఈ విషయాన్ని ప్రకటించింది.
దక్షిణ భారతీయ భాషా చిత్రాల తొలి అడుగుల చరిత్రపై జయదేవ పాతికేళ్ల పరిశోధనా పరిశ్రమకు ప్రతిఫలం ఈ మన సినిమా... ఫస్ట్ రీల్ పుస్తకం. ఇప్పటికీ మన సినీ చరిత్రలో నమోదు కాకుండా మిగిలిపోయిన అనేక అంశాలను తవ్వి తీసిన అరుదైన రచన ఇది. మూకీ సినిమాల రోజుల నుంచి తెర మీద బొమ్మ మాటలు నేర్చి.. భాషల వారీగా ప్రత్యేక శాఖలుగా విడివడిన టాకీల తొలి రోజుల దాకా మన భారతీయ సినిమాలో, ముఖ్యంగా మన తెలుగు సినిమాలో జరిగిన మనకు తెలియని అనేక పరిణామాలను సాక్ష్యాలతో, సవిశ్లేషణాత్మకంగా రాసిన గ్రంథం ఇది. రచయిత జయదేవ శ్రమించి సేకరించిన దాదాపు వందేళ్ల క్రితం అలనాటి పత్రికా సమాచారం, ఫోటోల లాంటి ప్రామాణిక ఆధారాలతో... అరుదైన సమాచారంతో... ఈ సినీ చరిత్ర రచన సాగింది.
తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ చిత్రం కాళిదాస్(1931)పై అనేక కొత్త సంగతులను రెంటాల జయదేవ ఇందులో తవ్వితీశారు. నిజానికి, అది ఒక సినిమా కాదనీ.. మూడు చిన్న నిడివి చిత్రాల సమాహారమనీ, అందులో ప్రధాన భాగమైన ‘కాళిదాస్’ కథాచిత్రం మాత్రం 4 రీళ్ల నిడివిలో పూర్తిగా తెలుగులోనే తీసిన లఘుచిత్రమని తెలిపారు. అలనాటి సాక్ష్యాధారాలతో ఈ విషయాన్ని నిరూపించారు. తమిళులు దాన్ని తమ తొలి టాకీగా చెప్పుకుంటూ తమ చరిత్రలో కలిపేసుకుంటూ ఉంటే... పూర్తి తెలుగు డైలాగులు ఆ సినిమాను తెలుగువాళ్లం మన సినీ చరిత్ర లెక్కల్లో చేర్చుకోకుండా వదిలేశామని గుర్తుచేశారు. అలా మనం విస్మరిస్తున్న మన తొలినాళ్ల తెలుగు సినీచరిత్రను అక్షరబద్ధం చేశారు.
హిందీతో సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీసీమల్లో వచ్చిన మొట్టమొదటి టాకీలకు సంబంధించిన అనేక చారిత్రక సత్యాలను ఈ రచనలో జయదేవ అందించారు. అత్యంత అరుదైన దాదాపు 2 వేల పత్రికా ప్రకటనలు, ఫోటోలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. 90 ఏళ్ల చరిత్ర గల ప్రతిష్ఠాత్మక పుస్తక ప్రచురణ సంస్థ ఎమెస్కో 566 పేజీల ఈ బృహత్ రచనను ప్రచురించింది. ఈ పుస్తకం పండిత, పామరుల ప్రశంసలందుకొని, ప్రామాణిక చరిత్ర గ్రంథంగా పాఠక లోకంలో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ సినీ గ్రంథంగా ఎంపికైంది.

ఆనాటి నుంచి ఈనాటి వరకు పలువురు ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడమే కాకుండా.. అలనాటి వారు గతంలో వచ్చిన ఇంటర్వ్యూల నుంచి కూడా ఎంతో విలువైన సమాచారాన్ని జయదేవ సేకరించి మన సినిమా... ఫస్ట్ రీల్ అనే పుస్తకంలో పొందుపరిచారు. పైపైన వివరాలకు పరిమితం కాకుండా సినిమాల రూపకల్పన, అందుకు జరిగిన కసరత్తు, నటీనటుల ఎంపిక, వాటి విడుదలకు నిర్మాతలు పడిన పాట్లు, అనేక పరిమితుల మధ్యనే ఆనాటి దర్శకులు చూపిన సృజనశీలత, అప్పటి సినిమా నిర్మాణ, పంపిణీ, ప్రదర్శక రంగాల తీరు, సినిమా వ్యాపారం జరిగే పద్ధతులు, కాలానుగుణంగా వచ్చిన పరిణామాలు... అన్నీ ఈ రచనలో కళ్లకు కట్టినట్లు వివరించారు.
తెలుగునాట రచయితగా, పరిశోధకుడిగా, పత్రికా రంగంలో ఫీచర్స్ రచయితగా, సినీ విశ్లేషకుడిగా, విలేఖరిగా ప్రసిద్ధమైన పేరు డాక్టర్ రెంటాల జయదేవ. ఇప్పటికి మూడున్నర దశాబ్దాల పైగా నిరంతరాయంగా ఆయన తన రచనలతో ప్రత్యేక కృషి చేస్తున్నారు. తండ్రి గారైన ప్రముఖ అభ్యుదయ కవి, దాదాపు 200 పుస్తకాలు రాసిన గ్రంథకర్త, జర్నలిస్టు, కీర్తిశేషులు రెంటాల గోపాలకృష్ణ సాహితీ, పత్రికా వారసత్వాన్ని జయదేవ పుణికిపుచ్చుకున్నారు. పాత తరం పత్రికా విలువల జెండాను కొత్త తరంలో ముందుకు తీసుకువెళుతున్న అతి కొద్దిమంది నిఖార్సయిన జర్నలిస్టుల్లో ఒకరిగా నిలిచారు. జయదేవ పత్రికా సంపాదకీయాలు, ప్రత్యేక వ్యాసాలు, సినిమా సమీక్షలు, ప్రత్యేక వార్తా కథనాలు, విశ్లేషణలు, ప్రముఖులతో లోతైన టీవీ, పత్రికా ఇంటర్వ్యూలు ప్రజలకూ, పరిశ్రమ వారికీ సుపరిచితం. ఆపకుండా చదివించే ఆయన రచనలు పాఠకుల్ని ఆకట్టుకోవడమే కాక, పలుమార్లు చర్చనీయాంశం అవుతుంటాయి.
తొలి పూర్తి నిడివి పది రీళ్ల తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ సరైన విడుదల తేదీని కూడా గతంలో రెంటాల జయదేవే తన పరిశోధనలో వెలికితీశారు. తెలుగు సినిమా దినోత్సవం విషయంలో అనేక దశాబ్దాలుగా ప్రచారంలో ఉన్న తప్పులను ఆయన సాక్ష్యాధారాలు చూపి సరిదిద్దారు. తెలుగు సినీరంగ చరిత్రను మార్చేసిన ప్రామాణికమైన ఆయన పరిశోధనను ప్రముఖ చరిత్రకారులు, సినీ పెద్దలు బాహాటంగా ఆమోదించారు. ప్రపంచ వ్యాప్తంగా జయదేవ పరిశోధన అంగీకారం పొందడంతో, ఇవాళ తెలుగు సినీ పరిశ్రమ మన తెలుగు సినిమా దినోత్సవాన్ని సవరించుకొని, ఆయన చెప్పిన ఫిబ్రవరి 6నే అధికారికంగా తెలుగు సినిమా డేను జరుపుకొంటూ ఉండడం విశేషం.
ఇది చదవండి: తెలుగు సినిమా పండగ రోజు
రెంటాల జయదేవ విశిష్ట కృషిని గుర్తించి.. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డుకు ఎంపిక చేసింది. 2011కి గాను ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది పురస్కారాన్ని ప్రకటించింది. తెలుగు సినిమా చరిత్రను కొత్త మలుపు తిప్పిన ఈ పరిశోధనాత్మక గ్రంథంతో తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డ్ వరించింది. తొలినాళ్ల తెలుగు సినిమా చరిత్రపై కనివిని ఎరుగని పరిశోధన చేస్తూ, ఎన్నో కొత్త సంగతులు బయటపెట్టిన రెంటాల జయదేవ (Rentala Jayadeva) నిరంతర అపూర్వ కృషిని తెలుగు సినీ పరిశ్రమ మొత్తానికీ ప్రాతినిధ్య సంస్థ అయిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైతం గుర్తించింది. భక్త ప్రహ్లాద సరైన విడుదల తేదీని పురస్కరించుకొని ఆయనను ఇటీవల ప్రత్యేకంగా సత్కరించడం విశేషం.