దేశ రాజధానిలో వాయు కాలుష్య తీవ్రత గురించి ఇప్పటికే చాలా విన్నాం. మనం పీల్చే విషపు గాలి పర్యవసానాలు, నష్టా లపై నిపుణులు అడపాదడపా హెచ్చరి స్తూనే ఉన్నారు. కోవిడ్–19 వల్ల కన్నా వాయు కాలుష్యం వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారని ‘ఎయిమ్స్’ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆయన చెప్పిన దాని ప్రకారం వాయు కాలుష్య దీర్ఘకాలిక ప్రభావాలు దగ్గులు, ఊపిరి సలపకపోవడానికి మాత్రమే పరిమితమైనవి కావు. అది హార్ట్ ఎటాక్, స్ట్రోక్, చివరకు క్యాన్సర్‌కు కూడా కారణమవుతోంది.
అయినా, మనం సంక్షోభం మూలాలలోకి వెళ్ళేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం సూచించే తాత్కాలిక పరిష్కాలతో తృప్తి పడుతున్నాం. ఎయిర్ ప్యూరిఫయర్లు కొనేందుకు, బయటకు వెళ్ళేటపుడు ఎన్ 95 మాస్కులు ధరించేందుకు అలవాటు పడుతున్నాం. కృత్రిమ వర్షాలను సాంకేతిక అద్భుతంగా మురిసిపోతూ, అవి తేగల ఊరట కోసం ఎదురు చూస్తున్నాం.
ఒక ప్రజా సమస్యకు ఆ రకమైన ప్రైవేటు పరిష్కారాలనుమించి ఆలోచించేందుకు తెగువ, రాజకీయ, నైతిక విశ్వాసం అవసరం. మనం సాధారణంగా మార్చేసిన జీవన విధానాలకు సంబంధించి ప్రపంచ దృక్కోణాన్ని ప్రశ్నించేందుకు మనమంతా ఏకం కావాల్సి ఉంది.
వినిమయ తత్వపు విషవలయం
ఢిల్లీ వాయు కాలుష్యం విస్తృతమైన వాతావరణ మార్పు సంక్షో భంతో ముడిపడి ఉన్నదనీ, అవి రెండూ అవిభాజ్యమైనవనీ నిజాయితీగా అంగీకరిద్దాం. అది ఆధునికత తెచ్చిపెడుతున్న అనర్థం. ముందు వెనుకలు ఆలోచించని సాంకేతిక ప్రగతి కోసం ప్రకృతిని జయించాలని చూస్తున్నాం. దాంతో, టెక్నో–క్యాపిటలిజం స్థిరంగా వృద్ధి చెందుతూ వచ్చింది. వస్తు వినియోగ తత్వానికి మనం క్రమంగా బానిసలమైపోయాం.
మవ చుట్టూ ఉన్న వాటిలో చెట్టు, పుట్ట, నది, పర్వతం ఏదైనా కావచ్చు– ప్రతీదీ వాటివైన స్వరూప స్వభావాలను, ప్రయోజనాన్ని కోల్పోయాయి. ప్రకృతి అంటే కొల్లగొట్టదగిన వనరు అనే భావన పాదుకుపోయింది. మరింత విద్యుచ్ఛక్తి, మరిన్ని కార్లు, మరింత వస్తు సామగ్రి, మరిన్ని దుస్తులు... వస్తు వినిమయ తత్వానికి అంతూ పొంతూ లేకుండా పోతోంది. రోడ్ల విస్తరణకు వేలాది చెట్లను నరికేసేందుకు మనం సంశయించడం లేదు. విద్యుదుత్పాదనకు నదుల సహజ ప్రవాహ గతులను మార్చేస్తున్నాం.
ఔను. ఆధునికత సంక్షోభం ఢిల్లీ వాయు కాలుష్య రూపంలో జడలు విప్పుకుని దర్శనిమిస్తోంది. ఒక్కసారి ఢిల్లీ రోడ్లను పరికిస్తే వాహనాలు వరదెత్తినట్లుగా కనిపిస్తాయి. దేశ రాజధానిలో 1.2 కోట్ల వాహనాలు రిజిస్టరయ్యాయనీ, వాటిలో 33.8 లక్షలు ప్రైవేటు కార్లేననీ ఢిల్లీ స్టాటిస్టికల్ హ్యాండ్ బుక్ (2023) సూచిస్తోంది. వేగం, చలన శక్తి ఆధునికతలో అంతర్భాగాలవడంతో మనకు మరిన్ని కార్లు, విమానాలు అవసరమవుతున్నాయి. పర్యవసానంగా శిలాజ ఇంధనాలను వెలికి తీయడం అవిశ్రాంతంగా సాగుతోంది. కర్బన ఉద్గారాలు పెరిగిపోతున్నాయి. ఆధునికత, టెక్నో–క్యాపిటలిజం విష విలయంలో చిక్కుకున్నాం.
తప్పులో మన వాటా?
ఢిల్లీలో కాలుష్యానికి ప్రాథమిక కారణం పొరుగు రాష్ట్రాలలో పంట కోతల తర్వాత గడ్డి గాదాన్ని మంటపెట్టడం వల్ల కాదని నిజాయితీగా అంగీకరించాలి. ఢిల్లీ వాయు కాలుష్యానికి వాహనాల ఉద్గారాలు ప్రధాన దోహదకారిగా ఉన్నాయనే వాస్తవాన్ని మనం ఎలా విస్మరించగలం? సూక్ష్మ ఘన, ద్రవ ధూళి కణాలు, దుమ్ము, మసి, పొగల మిశ్రమాన్ని పర్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం)గా పిలుస్తు న్నారు.
ఢిల్లీలో వార్షిక పీఎం 2.5 శాతంగా ఉంది. దానిలో వాహన ఉద్గారాల వాటాయే 10 నుంచి 30 శాతంగా ఉందని లెక్క తేలింది. అలాగే, పరిశ్రమలు, విద్యుదుత్పాదన కేంద్రాలు విడిచిపెట్టేవి, వ్యర్థ పదార్థాలను దగ్ధం చేయడం వల్ల వచ్చేవి, నిర్మాణ పనుల వల్ల రోడ్లపైకి వస్తున్న దుమ్ము నగరంలో వాయు కాలుష్య తీవ్రతకు కారణమవుతున్నాయి.
కానీ, ఈ ప్రశ్నలను లేవనెత్తడం కష్టం. ఎందుకంటే, అవి మనల్నే వేలెత్తి చూపుతాయి. మనం అనుసరిస్తున్న హైపర్ ఆధుని కత జీవన మార్గాలపై ఇంటరాగేషన్‌కు దిగుతాయి. కనుక, ఆత్మ పరిశీలనకు మనం విముఖులుగా ఉంటాం. దానికి బదులు, మన పడక గదుల్లో ఎయిర్ ప్యూరిఫయర్లను వాడితే మనం సురక్షితంగా ఉంటామని మనకు మనం సర్ది చెప్పుకోవడం తేలిక.
పెద్దగా ఆందో ళన చెందనక్కర లేకుండా టెక్నో–సైన్స్ కృత్రిమ వర్షాలను కురిపించగలదని సంతృప్తి పడటం తేలిక. ఎలక్ట్రిక్ కార్లను వాడటం ప్రారంభిస్తే సమస్య పరిష్కారమైపోతుందని నమ్మడం తేలిక. కట్టె పొయ్యిలు, బొగ్గు కుంపట్లు వంటి వాటి ద్వారా కాలుష్యానికి కారణమవుతున్నారని పేదలను నిందించడం తేలిక.
లగ్జరీ ఎస్‌యూవీలు, స్పీడుగా దూసుకుపోయే కార్లు, ఖరీదైన వస్తువుల వినియోగం కర్బన ఉద్గారాలకు గణనీయంగా తోడ్పడు తున్నాయని చెబితే ధనికులకు, అత్యంత సంపన్నులకు కోపం వస్తుంది. కాలుష్య పర్యవసానంగా ఏర్పడుతున్న ప్రతికూల అనా రోగ్య పరిస్థితుల బారిన ధనికులకన్నా పేదలు ఎక్కువ పడుతున్నా రనే వాస్తవాన్ని తేలిగ్గా పక్కన పెట్టేస్తున్నారు.
నిజంగా కావాల్సినవి!
కాలుష్య రహిత భవిష్యత్తుకు నూతన జీవన పద్ధతులు, పట్టణ ప్రణాళికలు తప్పనిసరి. న్యూరోటిక్ స్పీడు నుంచి మందగమనానికి, భారీ ఎక్స్‌ప్రెస్ వేల నుంచి నడకకు, సైకిళ్ళు తొక్కడానికి ప్రోత్సహించే రోడ్లకు, ప్రైవేటు వాహనాల నుంచి ప్రజా రవాణా వ్యవస్థ లకు మారక తప్పదు. ఆకర్షణీయంగా కనిపించే వినిమయ తత్వం నుంచి నిరాడంబర, నిలకడగా సాగించగలిగిన జీవన విధానాలకు మళ్ళాలి. అవసరం లేనివాటి కోసం వెంపర్లాడటం మానుకోవాలి.
మనం, మన సంతానం ఆరోగ్యకరంగా ఉండేందుకు సహాయ పడగల వాటిని అలవరచుకోవాలి. శుద్ధమైన తాగునీరు, గాలి, చెట్లు, నీటి వనరులు, నీలాకాశం, ఎటుచూసినా హరిత పరిసరాలు మనకు నిజమైన అవసరాలు. ప్రాధాన్యాలను ఎంచుకోవాల్సింది మనమే. మనం ఏ విధమైన అభివృద్ధిని కోరుకుంటున్నామో, ఆ దిశగా అడుగులు వేసేందుకు మనమే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలి.
-వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
-అవిజిత్ పాఠక్


