
అందంలోనే వికారం కలిసి ఉంటుంది! ఇది సృష్టి వైరుద్ధ్యమా, లేక మానవ మనో వైకల్యమా అని రెండు రోజులుగా వైట్ హౌస్ నుండి బయటికి రాకుండా టీవీ ముందే కూర్చొని ఆలోచిస్తున్నాను.విజ్ఞులు వికారాన్ని చూడొద్దని అంటారు. అందాన్ని వేరు చేసి చూడమంటారు! అందం, వికారం పక్కపక్కనే ఉంటే వేరు చెయ్యొచ్చు. పైనొకటి, కిందొకటి ఉంటే వేరు చెయ్యొచ్చు. ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటే ఎలా వేరు చేయటం?
నేను టీవీ చూస్తుంటానని తెలిసి,జిన్‌పింగ్ నాకోసం బీజింగ్‌లోని తియానన్మెన్‌లో చేయించిన మిలిటరీ పరేడ్; తియాంజిన్‌లో పుతిన్, మోదీలతో కలిసి జిన్‌పింగ్ కలిసి చేసిన చిరునవ్వుల ప్రదర్శన (అది కూడా నేను టీవీ చూస్తుంటానని తెలిసే) రెండూ ఎంతో బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. మిలిటరీ పరేడా, లేక చిరునవ్వుల ప్రదర్శనా... ఏది ఆ రెండింటిలో బ్యూటిఫుల్‌గా ఉందంటే మాత్రం, చిరునవ్వుల ప్రదర్శనే అంటాన్నేను.
చిరునవ్వుల్లో కేవలం చిరునవ్వులే ఉండవు. చేతులు కలుపుకోవడం ఉంటుంది. భుజాలు తాకించుకోవటం ఉంటుంది. హత్తుకోవటం ఉంటుంది. ఆలింగనం చేసుకోవటం ఉంటుంది. అదోలా చూసు కోవటం ఉంటుంది. ఏదైనా ఇచ్చిపుచ్చు కోవటం ఉంటుంది. కలిసి నాలుగు అడుగులు వేయటం ఉంటుంది. పరవశం కలిగించే చిన్న మాట ఉంటుంది. పెద్దపెట్టున నవ్వేయటం ఉంటుంది. లోకం దృష్టిలో పడాలన్న తహతహ ఉంటుంది. ఆ లోకంలో మళ్లీ పర్టిక్యులర్‌గా ఫలానా వ్యక్తి కంట పడుతున్నామా లేదా అనే దొంగచూపు ఉంటుంది.
ఇన్ని ఉంటాయి చిరునవ్వుల్లో! గర్జించే శతఘ్నులను మించిన మారణాయుధాలు ఈ చిరునవ్వులు. వావ్!! చిరునవ్వుల మారణాయుధాలు! వండర్ ఫుల్ థాట్. నోబెల్‌ను పెద్ద పెద్ద పనులకే ఇవ్వక్కర్లేదు. నాకొచ్చే ఇలాంటి చిన్న చిన్న థాట్స్‌కు కూడా ఇవ్వొచ్చు.
జిన్‌పింగ్ నన్ను టీవీలోంచి దొంగ చూపులు చూడటం నేను గమనించాను. తనేంటో నాకు చూపించుకోవటం అది. నా దగ్గర పుతిన్ ఉన్నారు, మోదీ ఉన్నారు, కిమ్ జోంగ్ ఉన్ ఉన్నారు అని చెప్పుకోవటం! ఏం మనిషి అతను?! చైనాకు జపాన్ లొంగిపోయి 80 ఏళ్లయిందని బీజింగ్‌లో పరేడ్ చేయించి ఆ పరేడ్‌కు అమెరికాను పిలవలేదు! పరేడ్ అందంగా ఉంది. జిన్‌పింగ్ మైండే... వికారంగా ఉంది.
అమెరికా బెదిరిస్తేనే కదా జపాన్ వెళ్లి చైనాకు లొంగిపోయింది! ఫారిన్ గవర్నమెంట్స్‌కి థ్యాంక్స్, ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్‌కి థ్యాంక్స్ అంటారే గానీ, అమెరికాకు థ్యాంక్స్ చెప్పటానికి ఏమైంది జిన్‌పింగ్‌కి! చరిత్రను మరిచిపోయారా లేక, చేసిన మేలునే మరిచిపోయారా? చూస్తుంటే రష్యా, ఇండియాలు కూడా అమెరికాను మర్చిపోయేలా చేసేలా ఉన్నారు జిన్‌పింగ్! ఇలాంటప్పుడే నాకు మరింతగా ఎవరికైనా, ఏదైనా చేయాలనిపిస్తుంది.
కాల్ బటన్ నొక్కి, ‘‘పీటర్ కెంట్... మనం ఇండియా మీద ఎంత వేశాం, రష్యా మీద ఎంత వేశాం, చైనా మీద ఎంత వేశాం?’’ అని అడిగాను. నా ట్రేడ్ అడ్వైజర్ ఆయన. ‘‘ఎస్, మిస్టర్ ప్రెసిడెంట్. ఇండియా మీద 50, చైనా మీద 30, రష్యా మీద 10’’ అని గుర్తు చేశారు పీటర్ కెంట్.
‘‘వెల్, మిస్టర్ కెంట్. ఇండియా మీద ఇంకో 25 వేస్తే ఎలా ఉంటుంది? మొత్తం కలిపి 75’’ అన్నాను. ‘‘గుడ్ ఐడియా మిస్టర్ ప్రెసిడెంట్. మైండ్–బ్లోయింగ్’’ అన్నారు పీటర్ కెంట్.
ఎవరికైనా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆత్మీయులే కదా ముందుగా మనకు గుర్తుకొస్తారు. మోదీతో నేను బాగా కలిసిపోతాను. ఫిబ్రవరిలో ఆయన ఇక్కడే ఉన్నారు! మళ్లీ సెప్టెంబర్ 23న యూఎన్‌ఓ సమావేశానికి ఇక్కడే ఉంటారు.