నేనెప్పుడూ ప్రసిద్ధి చెందాలని కోరుకోలేదు. పాటలు పాడి శ్రోతల్ని సంతోషపెట్టాలని మాత్రమే అనుకున్నాను. అభిరు చికి కట్టుబడి, నిజాయతీగా కష్టపడి పని చేస్తే మన ప్రతిభకు ఆశీర్వచనాలు లభిస్తాయి. నిరంతర సాధన, అభ్యాసం అనేవి కళాకారునికి శ్వాస వంటివి. – పి.సుశీల (90), నేపథ్య గాయని
దక్షిణ భారత ప్లేబ్యాక్ రంగంలో అగ్రగామి గాయకురాలు పి. సుశీల. 12 భాషల్లో వేలాది పాటలు పాడిన ఆమెను ‘గాన సరస్వతి’ అనడం అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయ నగరంలో 1935 నవంబర్ 13న ప్రసిద్ధ క్రిమినల్ న్యాయవాది,సంగీత ప్రియుడు పులపాక ముకుంద రావు – శేషావతారం దంప తుల ఐదవ సంతానంగా ఆమె జన్మించారు.
సుశీల కర్ణాటక సంగీతంలో అత్యుత్తమ వయొలిన్ విద్వాంసులైన ‘సంగీత కళానిధి’ ద్వారం వెంకటస్వామి నాయుడు, ఆయన కుమారుడు ద్వారం భావనరాయణల వద్ద ఆరు సంవత్సరాలు కఠిన శిక్షణ పొంది, గాత్ర సంగీతంలో డిప్లొమా సాధించారు. మొదట్లో వివాహ వేడుకలలో శాస్త్రీయ సంగీతం ఆలపించేవారు. సినిమా పాటలు పాడటానికి చెన్నై చేరే ముందు కొన్ని ఆలయ కచేరీలు ఇచ్చేవారని కొద్దిమందికి మాత్రమే తెలుసు. సుశీల స్వరం మూడో స్థాయిని కూడా స్పష్టంగా దాటుతుందని అందరికీ తెలుసు. ప్రముఖ వీణా విద్వాన్ ‘వీణ గాయత్రి’... సుశీల స్వరాన్ని ఒక గాత్ర వీణగా వ్యాఖ్యానించారు. ఆమె గొంతులో సూక్ష్మ గమకాలు సైతం అత్యంత స్పష్టతతో వినవచ్చు. ఈ గుణం సుశీలను శాస్త్రీయ గాయకులు కూడా భయపడే, గౌరవించే గాయనిగా చేసింది.

ఆమె 1970లో ‘ఉయర్న్‌ద మనిదన్’ (1969) చిత్రానికి ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచు కున్నారు. ఆ తర్వాత ఆమె తెలుగు, తమిళ చిత్రాలకు మరో నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. ఆ కాలంలోని ప్రముఖ గాయకులైన ఘంటసాల వేంకటేశ్వర రావుతో తెలుగులో, టి.ఎం. సౌందరరాజన్, పి.బి. శ్రీనివాస్‌లతో తమిళం, కన్నడ భాషలలో; తరువాత ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంతో తమిళం, తెలుగు, కన్నడ భాషలలో; కె.జె. ఏసుదాస్‌తో మలయాళంలో ఆమె యుగళగీతాలు పాడి దక్షిణాదిలో అగ్రగామి గాయనిగా నిలిచారు. 1991లో తమిళనాడు అత్యున్నత కళా పుర స్కారం ‘కలైమామణి’, 2004లో తెలుగు సినిమా రంగంలో ఆమె జీవితకాల కృషికి ‘రఘుపతి వెంకయ్య అవార్డు’, 2008లో 73 ఏళ్ళ వయసులో ‘పద్మభూషణ్’ పురస్కారం వంటివి వరించాయి. ఆమె సమకాలీనులైన ఎస్.జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి, బి. వసంత; ఆమె జూనియర్లు కె.ఎస్. చిత్ర, ఎస్.పి. శైలజ వంటివారందరూ ఆమె స్వర నాణ్యత, స్వాభావిక శ్రావ్యతను ఎంతో గౌరవించారు. ఆమె 1962 నుండి 1990ల చివరి వరకు 17,695 పాటలను రికార్డ్ చేయడం... పాట పట్ల ఆమె నిబద్ధతకు నిదర్శనం. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం 12 భారతీయ భాషలలో సోలోలు, డ్యూయెట్లు, కోరస్, నేపథ్య పాటలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఆమె అభిమానులు చాలా మంది ఆమెకు ’భారతరత్న’ పురస్కారం ఆమె 90వ పుట్టిన రోజు కానుకగా వస్తే బాగుండు అనుకుంటున్నారు. అందుకు ఆమె ముమ్మాటికీ అర్హురాలు.
– డా.ఎం.ఎస్. నీలోత్పల్
అసిస్టెంట్ ప్రొఫెసర్, వేలూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తమిళనాడు
(నేడు గాన సరస్వతి పి. సుశీల 90వ జన్మదినం)


