కుమారు సాను విలక్షణమైన సింగర్.. ఈయన తెలుగులో దేవుడు వరమందిస్తే.., మెరిసేటి జాబిలి నువ్వే.. వంటి పలు హిట్ సాంగ్స్ ఆలపించాడు. దాదాపు 16 భాషల్లో అనేక పాటలు పాడారు. అయితే ఆయన కెరీర్ పరంగానే కాకుండా పర్సనల్ లైఫ్‌లో ఒడిదుడుకుల కారణంగానూ తరచూ వార్తల్లో ఉంటాడు.
రెండు పెళ్లిళ్లు
ఈయన రీటా భట్టాచార్యను 1986లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. అయితే భార్య ఉండగానే పలువురితో డేటింగ్ చేశాడు. వారిలో నటి కునికా సదానంద్ ఒకరు. ఈ విషయంలో గొడవలు రావడంతో కొన్నేళ్లకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆరేళ్లపాటు కునికాతో రిలేషన్‌లో ఉన్న కుమార్ తర్వాత సలోని భట్టాచార్యను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు కూతుర్లు సంతానం.
మాజీ భర్తపై ఆరోపణలు
ఇటీవల రీటా భట్టాచార్య మాజీ భర్త కుమార్ సానుపై సంచలన ఆరోపణలు చేసింది. అతడూ ఎప్పుడూ అబద్ధాలు ఆడేవాడని ఆరోపించింది. కొడుకు పెళ్లి సమయంలో కుమార్ ప్రేమకథల గురించి పుకార్లు వస్తే వాటికి ఫుల్‌స్టాప్ పెట్టమని కోరినందుకు తన నెంబర్ బ్లాక్ చేశాడంది. మూడోసారి గర్భవతిగా ఉన్నప్పుడు తిండిపెట్టకుండా టార్చర్ చేశారంది. ఆయన కుటుంం కిచెన్ స్టోరేజ్‌కు తాళం వేసుకునేవారంది. గర్భంతో ఉన్నానన్న కనికరం చూపకుండా తనను కోర్టులచుట్టూ తిప్పాడంది.
రూ.50 కోట్ల పరువు నష్టం దావా
ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుమార్ సాను కోర్టును ఆశ్రయించాడు. ఆమె వ్యాఖ్యలు తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించాయంటూ రీటాపై రూ.50 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. విడాకుల సమయంలో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోకూడదన్న అగ్రిమెంట్‌ను ఉల్లంఘించిందని పేర్కొన్నాడు. ఈ మేరకు మాజీ భార్యకు నోటీసులు పంపాడు.
దయచేసి హింసించొద్దు
దానిపై రీటా భట్టాచార్య స్పందిస్తూ.. నేను షాక్‌లో ఉన్నాను. అతడు.. తన ముగ్గురు కొడుకుల తల్లిపై కేసు వేస్తున్నానన్న విషయం మర్చిపోయాడా? పైగా రూ.50 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. నా దగ్గర అంత డబ్బు ఎలా ఉంటుందనుకుంటున్నాడు? ఇది నిజంగా బాధాకరం. నా ముగ్గురు పిల్లల తండ్రిగా, ఒక మానవత్వం ఉన్న మనిషిగా అయినా మెదులుకోమని ఆయన్ను చేతులు జోడించి అడుగుతున్నాను. మమ్మల్ని ప్రేమించకపోయినా పర్వాలేదు.. కానీ దయచేసి ఇబ్బందిపెట్టకు అని కోరింది.


