breaking news
Kumar Sanu
-
విలక్షణం, విశిష్టం 'కుమార్ సాను' గాత్రం!
(అక్టోబర్ 20 ప్రముఖ గాయకుడు 'కుమార్ సాను'(Kumar Sanu) పుట్టినరోజు)“సాంసోం కీ జరూరత్ హై జైసే జిందగీ కే లియేబస్ ఎక్ సనమ్ చాహియే ఆషికీ కే లియే!”80s కిడ్స్‌కి పరిచయం అక్కర్లేని పాట ఇది. ఈ పాట పాడినవారికి కూడా పరిచయం అక్కర్లేదనుకోండి! దశాబ్దానికి పైగా బాలీవుడ్ సినీ సంగీతాన్ని ఏలిన మెలోడీ కింగ్ కేదార్ నాథ్ భట్టాచార్య ఉరఫ్ కుమార్ సాను పాడిన పాట ఇది.నదీమ్-శ్రవణ్‌తో స్వర ప్రయాణం:నదీమ్-శ్రవణ్ జోడీతో కలిసి 'కుమార్ సాను'(Kumar Sanu) పాటలు పాడిన కాలాన్ని బాలీవుడ్ కి స్వర్ణ యుగంగా చెప్పకోవచ్చు. ‘ఆషికీ’లో ప్రతి పాటా ఎన్ని వందలసార్లు విన్నా ఎప్పటికీ పాతబడదు. ‘సాంసోంకీ జరూరత్’, ‘తూ మేరీ జిందగీ హై’, ‘నజర్ కే సామ్ నే’ ఎంత మెలోడీయస్ గా ఉంటాయో ‘అబ్ తేరే బిన్’ అంత ఆవేశపరుస్తుంది. కాబట్టే ఈ పాట కుమార్ సానుకి ఫిలింఫేర్ అవార్డు తెచ్చి పెట్టింది. 1991లో ఈ పాటకుగాను మొదటిసారి ఫిలింఫేర్ అవార్డు అందుకున్న కుమార్ సాను వరసగా ఐదేళ్ళు, అంటే 1995 వరకు ఈ అవార్డు అందుకుంటూనే ఉన్నారు. ‘సాజన్’లోని ‘మేరా దిల్ భీ కిత్నా పాగల్ హై’ కుమార్ సాను ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్న పాటల్లో ఒకటి. గొంతులో ఒక రకమైన జీరతో, నాసల్ వాయస్లో పాడే కుమార్ సాను మెలోడీస్ వింటే చాలు అప్పట్లో సంగీత ప్రియుల గుండెలు విలవిల్లాడిపోయేవి. ‘దిల్ హై కె మాన్తా నహీ’ టైటిల్ సాంగ్, ‘తుమ్హే అప్నా బనానే కీ కసమ్’ (సడక్), ‘ధీరే ధీరే ప్యార్ కో బఢానా హై’ (ఫూల్ ఔర్ కాంటే), ‘గవా హై చాంద్ తారే’ (దామిని), ‘సోచేంగే తుమ్హే ప్యార్ కర్కే నహీ’ (దీవానా), ‘ఘూంఘట్ కీ ఆడ్ సే’ (హమ్ హై రాహీ ప్యార్ కే), ‘పర్ దేసీ జానా నహీ’ (రాజా హిందూస్తానీ), ‘దో దిల్ మిల్ రహే హై’, ‘మేరీ మెహబూబా’ (పర్ దేస్)- ఇలా నదీమ్-శ్రవణ్ స్వరపరిచిన పాటలను కుమార్ సాను తన గొంతుకతో ఎవర్ గ్రీన్ హిట్స్ గా మలిచారు. మొత్తమ్మీద ఈ జోడీ కాంబినేషన్ లో కుమార్ సాను 300 దాకా పాటలు పాడారు. అను మల్లిక్‌తో :నదీమ్ శ్రవణ్ తర్వాత కుమార్ సాను ఎక్కువగా పని చేసింది అను మల్లిక్ కే. ‘బాజీగర్’ కోసం కుమార్ సాను పాడిన ‘యే కాలీ కాలీ ఆంఖే’ ఫిలింఫేర్ సాధించుకుంది. అనుమల్లిక్ స్వర కల్పనలో కుమార్ సాను ‘చురాకే దిల్ మేరా’ లాంటి ఎన్నో హిట్ నంబర్స్ పాడారు. ‘దిల్ జలే’ లోని ‘జిస్కే ఆనే సే’ అనే పాట లిరిక్స్, కంపోజిషన్ పరంగా ‘ఎక్ లడ్కీ కో దేఖా తో’ పాటను పోలి ఉన్నా దానికి వచ్చినంత గుర్తింపు అయితే రాలేదు. కానీ కుమార్ సాను పాడిన క్లాసిక్ సాంగ్స్ లో ఇదీ ఒకటి. 1990ల నాటి బ్యాక్ గ్రౌండ్ తో ఆయుష్మాన్ ఖురానా, భూమి పడ్నేకర్ హీరో హీరోయిన్లుగా 2015లో వచ్చిన సినిమా ‘దమ్ లగాకే హైషా’. 90ల నాటి సినిమా గనక నేచరల్ గానే ఇందులోని హీరో హీరోయిన్లకు కుమార్ సాను పాటలంటే పిచ్చి అన్నట్లు చూపిస్తారు. ఈ సినిమాలో అను మల్లిక్, కుమార్ సానుతో రెండు పాటలు పాడించారు. ఒక పాటలో ఆయన కేమియో అప్పియరెన్స్ కూడా ఇచ్చారు. జతిన్-లలిత్‌తో:జతిన్-లలిత్ కాంబినేషన్ లో కుమార్ సాను పాడిన మెలొడీలు శ్రోతలను తన్మయత్వంలో ఓలలాడిస్తాయి. "దిల్ వాలే దుల్హనియా లేజేయేంగే" కోసం కుమార్ సాను లతా మంగేష్కర్ తో కలిసి పాడిన ‘తుఝే దేఖా తో యే జానా సనమ్’ ఇప్పటికైనా ఎప్పటికైనా మర్చిపోగలమా? ‘సీనే మే దిల్ హై’, ‘తు మేరే సాథ్ సాథ్’ (రాజు బన్ గయా జంటిల్ మ్యాన్), ‘ఐ కాష్ కే హమ్’(కభీ హా కభీ నా), ‘మై కోయీ ఐసా గీత్ గావూ’, ‘ఏక్ దిన్ ఆప్’(యస్ బాస్),‘దుష్మన్’ కోసం లతా మంగేష్కర్తో కలిసి పాడిన ‘ప్యార్ కో హో జానే దో’ లాంటి పాటలు షారుఖ్ ఖాన్ కెరీర్ లో మైలురాళ్ళ లాంటివి. కానీ జతిన్ లలిత్ కాంబినేషన్ లో కుమార్ సాను పాడిన ‘జబ్ కిసీ కీ తరఫ్’ (ప్యార్ తో హోనా హీ థా) వీటన్నింటినీ మించిన ఆల్ టైం హిట్. ఇక ‘ఖూబ్ సూరత్’సినిమా కోసం కవితా కృష్ణమూర్తితో కలిసి కుమార్ సాను పాడిన‘మేరా ఎక్ సప్నా హై’వింటే కలల్లో తేలిపోవడం ఖాయం. రాజేశ్ రోషన్‌తో:‘జబ్ కోయి బాత్ బిగడ్ జాయే’ – జుర్మ్ సినిమా కోసం రాజేశ్ రోషన్ మ్యూజిక్ డైరెక్షన్ లో కుమార్ సాను పాడిన ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో ‘కరణ్ అర్జున్’, ‘సబ్సే బడా ఖిలాడీ’, ‘కోయ్ లా’, ‘క్యా కెహ్ నా’ లాంటి సినిమాలు వచ్చాయి. 1996లో వచ్చిన ‘పాపా కెహ్తే హై’ అట్టర్ ఫ్లాప్ సినిమా. కానీ రాజేశ్ రోషన్ పాటలు మాత్రం సూపర్ హిట్. ఇందులో ఉదిత్ నారాయణ్ పాడిన ‘ఘర్ సే నికల్తే హీ’తో పాటు కుమార్ సాను పాడిన ‘యే జో థోడే సే హై పైసే’, ‘ప్యార్ మే హోతా హై క్యా జాదూ’ పాటలు చాలా కాలం పాటు గుర్తుండిపోతాయి. ఇక ‘కహో నా ప్యార్ హై’లో కుమార్ సాను పాడిన ‘చాంద్ సితారే’ చాలా ఎలిగెంట్ గా అనిపిస్తుంది. ఆర్డీ బర్మన్తో: 1995కిగాను ‘ఎక్ లడ్కీ కో దేఖా తో’ (1942 ఎ లవ్ స్టోరీ) అనే పాట కుమార్ సానుకి ఫిలింఫేర్ సాధించింది. ఆర్డీ బర్మన్ చివరిసారిగా కంపోజ్ చేసిన ఈ పాట కుమార్ సాను జర్నీకి ఒక క్లాసిక్ టచ్ ఇచ్చింది. సంగీతం, స్వరం, విధు వినోద్ చోప్రా పిక్చరైజేషన్తో పాటు జావేద్ అఖ్తర్ లిరిక్స్ వల్ల ఈ పాట అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఇదే సినిమాలో కుమార్ సాను పాడిన ‘కుఛ్ నా కహో’ చాలా హాయిగా అనిపిస్తుంది. ఎ. ఆర్. రెహమాన్‌తో సింగిల్ సాంగ్! ఎందుకంటే...:ఉదిత్ నారాయణ్ లాంటి సింగర్స్ తో ఎన్నో పాటలు పాడించిన రెహమాన్, కుమార్ సానుతో ఒకే ఒక్క పాట పాడించడం జీర్ణం కాదు. ‘కభీ న కభీ’ లో ‘మిల్ గయీ మిల్ గయీ’ అనే ఈ పాట ‘అంజలి అంజలి పుష్పాంజలి’ అనే పాట ట్యూన్ లో సాగుతుంది. ఒక ఇంటర్ వ్యూలో రహమాన్ని అసలు మ్యూజిక్ డైరెక్టర్ గానే గుర్తించను అని కుమార్ సాను చెప్పారు. ఎందుకని అడిగితే ఆయన నన్ను సింగర్ గా గుర్తించలేదు కాబట్టి అని సమాధానమిచ్చారు. ఈ మాటలు వింటే ఇద్దరికీ ఎక్కడో కుదరలేదని అర్థమవుతుంది.బెస్ట్ కో-సింగర్ ఎవరంటే...: కుమార్ సాను లతా మంగేష్కర్, అనురాధా పౌడ్వాల్, సాధనా సర్గమ్ లాంటి సింగర్స్ తో కలిసి ఎన్ని పాటలు పాడినా అల్కా యాగ్నిక్ తో పాడిన పాటలు వింటే మాత్రం తేనెలో ముంచి తేల్చినట్లే అనిపిస్తుంది. ‘ముఝ్ సే మొహబ్బత్ కా’, ‘యే ఇష్క్ హై క్యా’, ‘తేరీ మొహబ్బత్ నే’, ‘హమ్ కో సిర్ఫ్ తుమ్ సే ప్యార్ హై’, ‘జాదూ హై తేరా హీ జాదూ’, ‘జో హాల్ దిల్ కా’ లాంటి పాటలు ఈ కాంబినేషన్‌కి గొప్ప ఉదాహరణలు. కుమార్ సాను పేరు వెనక కథ:కుమార్ సానుకి లెజెండరీ సింగర్ కిశోర్ కుమార్ అంటే గొప్ప గౌరవం. 1983లో సాను భట్టాచార్యగా బెంగాలీలో సింగింగ్ కెరీర్ ఆరంభించిన కేదార్ నాథ్ భట్టాచార్య, 1988లో ‘హీరో హీరాలాల్’ అనే హిందీ సినిమాలో తొలిసారి పాడారు. 1989లో జగ్ జీత్ సింగ్ ఆయన్ను కల్యాణ్ జీ-ఆనంద్ జీ జోడీలోని కల్యాణ్ జీకి పరిచయం చేశారు. వాళ్ళ సూచనతో కిశోర్ కుమార్ పేరులోని కుమార్ కి ‘సాను’ కలిపి కుమార్ సాను గా తన పేరు మార్చుకున్నారు. అంతే కాదు ‘కిశోర్ కుమార్ కీ యాదే’ పేరుతో కిశోర్ దా పాపులర్ సాంగ్స్ పాడుతూ ఒక ఆల్బమ్ కూడా రిలీజ్ చేశారు.కుమార్ సాను తెలుగులో ఏ పాటలు పాడారంటే...:మన తెలుగులోనూ కుమార్ సాను ‘దేవుడు వరమందిస్తే’, ‘మెరిసేటి జాబిలి నువ్వే’, ‘ఒక్కసారి చెప్పలేవా’, 'నీ నవ్వులే వెన్నలని' లాంటి హిట్ సాంగ్స్ పాడారు. ఆయన విలక్షణమైన గొంతుక తెలుగువారికి బాగా నచ్చేసింది. కుమార్ సాను సెకండ్ ఇన్నింగ్స్:2004లో పాలిటిక్స్ లోకి వెళ్ళిన కుమార్ సాను ఎనిమిదేళ్ళ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి తిరిగి వచ్చారు. ‘రౌడీ రాథోడ్’, ‘గన్స్ & గులాబ్స్’ లాంటి సినిమాల్లో పాడారు. అక్టోబర్ 20, 1957లో పుట్టిన కుమార్ సానుకి ఇప్పుడు 68 ఏళ్ళు. ఈ వయసులోనూ ఆయన గొంతు ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఈ మధ్యనే ‘కుమార్ సాను అఫీషియల్’ పేరుతో యూట్యూబ్‌లో ఆయన సొంత మ్యూజిక్ లేబుల్ ఒకటి ప్రారంభించారు. అందులోని పాటలు వింటే ఈ విషయం అర్థమవుతుంది.మొత్తం ఎన్ని పాటలు పాడారంటే...:కుమార్ సాను మాతృభాష అయిన బెంగాలీతో పాటు హిందీ, తెలుగు సహా 16కి పైగా భాషల్లో పాటలు పాడారు. ఒకే రోజు 28 పాటలు పాడిన గాయకుడిగా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నారు. బీబీసీ రూపొందించిన ‘ఆల్ టైం 40 సాంగ్స్ ఆఫ్ బాలీవుడ్’లో కుమార్ సాను పాటలే ఎక్కువగా కనిపిస్తాయి. 2009లో పద్మశ్రీ అందుకున్నారు. మెలోడీ కింగ్ అని శ్రోతలతో పిలిపించుకున్న కుమార్ సాను ఇప్పుడు ఎక్కువగా పాడలేకపోతుండవచ్చు. కానీ ఆయన పాడిన ప్రతి పాటా ఇప్పటికీ అభిమానుల గుండెల్లో మార్మోగుతూనే ఉంటుంది.-శాంతి ఇషాన్ (Shanti Ishan) -
ఆ హీరోయిన్ను ఇద్దరు ప్రేమించారు, కానీ!
జబ్ కోయీ బాత్ బిగడ్ జాయే.. జబ్ కోయీ ముశ్కిల్ పడ్ జాయే.. తుమ్ దేనా సాథ్ మేరా.. ఓ హమ్‌నవా.. (అనుకున్నది జరక్కపోయినా.. అవాంతరాలు ఎదురైనా నా తోడు వీడొద్దు నేస్తమా!) ఈ పాట జుర్మ్ (1990) సినిమాలోనిది. పాడింది కుమార్ సాను, నటించింది మీనాక్షి శేషాద్రి. జీవితంలోనూ మీనాక్షి తోడు కావాలనుకున్నాడు... కానీ కష్టకాలంలో ఆ ఇద్దరూ ఒకరికొకరు తోడు కాలేకపోయారు. అసలు ఆ ప్రేమ ఎలా మొదలైంది... ఆ కష్టకాలం ఏంటి? వివరాలు.. జుర్మ్ సినిమా ప్రీమియర్ షోలో మీనాక్షిని చూశాడు కుమార్ సాను. ఆమె అందానికి అతని మనసు చెదిరింది. ఆమె నవ్వు అతనికి నిద్రలేకుండా చేసింది కొన్ని వారాలు. ఆమె ఇంటి ఫోన్ నంబర్ సంపాదించాడు. సంభాషణ కలిపాడు. ఒంటరిగా కలుసుకునే ప్రయత్నమూ చేశాడు. ఫలించింది. మీనాక్షి .. కుమార్‌ను కలిసింది. ఆమె అంటే తనకెంత ప్రేమో వివరించాడు. ఎప్పటిలాగే నవ్వింది మీనాక్షి. ‘నిజం’ అన్నాడు ఆ వివాహితుడు. ఆ స్నేహాన్ని స్వీకరించింది మీనాక్షి. ఏ కాస్త వెసులుబాటు దొరికినా కుమార్ సానుతో గడపడానికి ఆసక్తి చూపించసాగింది ఆమె. అతనూ అంతే మీనాక్షి ఏ కొంచెం టైమ్ ఇచ్చినా రెక్కలు కట్టుకొని చెప్పిన చోటికి వాలిపోయేందుకు సిద్ధమయ్యాడు. పెరిగిన చనువుతో ఆమెకూ కుమార్ అంటే ఇష్టం ఏర్పడింది. డేటింగ్ మొదలైంది. ఆ సమయంలోనే మీనాక్షి నటించిన ఘాయల్ (హీరో సన్నీ డియోల్ )సూపర్ డూపర్ హిట్ అయింది. సన్నీ డియోల్, మీనాక్షి జంటతోనే ఇంకో సినిమా ప్లాన్ చేశాడు ఘాయల్ దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి. అదే దామిని (1993). అదీ బంపర్ హిట్. సన్నీ, మీనాక్షి, రాజ్‌కుమార్ సంతోషి త్రయానికి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. మీనాక్షి పట్ల రాజ్‌కుమార్ సంతోషీకీ ప్రేమ మొదలైంది. ఇటు .. కుమార్ సాను, మీనాక్షి తమ ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచారు. అలా మూడేళ్లు గడిచాయి. రాజ్‌కుమార్‌కు మీనాక్షి పట్ల ఆరాధన అంతకంతకూ పెరిగిపోతోంది. ఒకరోజు ధైర్యం చేసి మీనాక్షి వాళ్లింటికి వెళ్లి ‘నువ్వంటే ఇష్టం.. నీకూ ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాను’ అని తన మనసులో మాట ఆమెకు వినిపించాడు. సున్నితంగా తిరస్కరించింది మీనాక్షి. కుంగిపోయాడు అతను. డిప్రెషన్‌లోకీ వెళ్లాడు. మరోవైపు.. తమ ప్రేమను ఎంత గుట్టుగా దాచినా ఆ పొగ ఇండస్ట్రీ మిత్రుల ద్వారా కుమార్ సాను భార్య రీటా భట్టాచార్యకు చేరింది. ఆమెలో అనుమానం మొదలైంది. ఈ లోపే మీడియా కుమార్ సాను సెక్రటరీని ఇంటర్వ్యూ చేసింది. అందులో ఆమె ‘కుమార్‌కి చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు మాత్రం మీనాక్షితో డేటింగ్ చేస్తున్నాడు’ అని చెప్పింది. ఆ రాతప్రతి రీటా కంట్లోనూ పడింది. కుమార్ సానును నిలదీసింది. అదంతా రూమర్ అని కొట్టిపారేశాడు. దాంతో రీటా సమాధానపడలేదు. పదేపదే ప్రశ్నించించడంతో నిజమే అని ఒప్పుకోక తప్పలేదు కుమార్ సానుకు. విడాకుల దావా వేసింది రీటా. ‘భర్త తన సంపాదనంతా మీనాక్షి కోసమే ఖర్చుచేస్తున్నాడు’ అనే అపవాదునూ జతపర్చింది. ఈ సీన్‌కి మనస్తాపం చెందింది మీనాక్షి. అంతేకాదు నెంబర్ వన్‌గా, అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా సాగుతున్న తన కెరీర్‌ను, ఇమేజ్ను దెబ్బతీసేలా ఉందనీ భావించింది. పైగా కుమార్ సాను నుంచీ తనకు అనుకూలంగా ఎలాంటి స్పందన రాలేదు. విడాకుల వ్యవహారంతో కుమార్ సాను కూడా అభాసుపాలయ్యాడు. విడాకులు మంజూరయ్యాయి. మీనాక్షితో రిలేషన్ కూడా బ్రేక్ అయింది. న కోయీ హై, నా కోయీ థా.. జిందగీ మే తుమ్హారే సివా.. తుమ్ దేనా సాథ్ మేరా.. ఓ హమ్‌నవా.. (నాకప్పుడూ ఎవరూ లేరు.. ఇప్పుడూ లేరు.. నువ్వు నాకు తోడు ఉండవా నేస్తమా) అనే పంక్తులు మిగిలాయి కుమార్ సానుకు పాడుకోవడానికి. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ రీటా, కుమార్ సాను ఒక్కటయ్యారు. ఘాతక్.. డిప్రెషన్ నుంచి బయటపడ్డా మీనాక్షి మీద ప్రేమను చంపుకోలేకపోయాడు రాజ్‌కుమార్ సంతోషి. మళ్లీ ఆమెతో కలసి పనిచేయాలని నిశ్చయించుకున్నాడు. ఆమెను అడిగాడు. ఒప్పుకుంది. ’ఘాతక్’ సినిమా వచ్చింది. ఆ తర్వాత మీనాక్షి శేషాద్రి అమెరికాలో స్థిరపడ్డ హరీష్ మైసూర్ అనే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌ను పెళ్లి చేసుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. భారతీయ శాస్త్రీయ నృత్యశాలను నిర్వహిస్తోంది. రాజ్‌కుమార్ సంతోషి కూడా మిలన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అలా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏ ఇద్దరి ప్రేమకూ శుభం కార్డ్ వేయలేదు. - ఎస్సార్ -
నాన్న మమ్మల్ని పట్టించుకోలేదు: బిగ్‌బాస్ కంటెస్టెంట్
న్యూ ఢిల్లీ: ప్రముఖ గాయకుడు కుమార్ సాను కొడుకు జాన్ కుమార్ సాను ఈ వారం బిగ్‌బాస్ 14 నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఈ సందర్భంగా జాన్ మాట్లాడుతూ.. ‘నాన్న మమ్మల్ని పట్టించుకోలేదు. అమ్మ ఒంటి చేత్తో మమ్మల్ని పెంచి పెద్ద చేసింది’ అని తెలిపాడు. ఈ వ్యాఖ్యలపై కుమార్ సాను స్పందించాడు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుమార్ సాను మాట్లాడుతూ.. ‘జాన్ నా గురించి చేసిన వ్యాఖ్యలు నన్ను ఎంతో బాధపెట్టాయి. నేను నా మొదటి భార్య, జాన్ తల్లి రీటా భట్టాచార్య నుంచి విడాకులు తీసుకున్నాను. ఆ సమయంలో రీటా జీ అడిగిన వాటిని నేను ఆమెకు ఇచ్చాను. వాటిల్లో నేను మొదటి సారి కొనుకున్న బంగ్లా కూడా ఉంది. నేను వారికి ఏం ఇవ్వలేదనడం పూర్తిగా అబద్దం’ అన్నారు . (బిగ్‌బాస్: ఈ షోకు నువ్వు అనర్హురాలివి) కుమార్ సాను మాట్లాడుతూ.. ‘విడాకుల సమయానికి నా ముగ్గురు పిల్లలు చిన్న వారు కాబట్లి వారు తల్లి దగ్గరే ఉండాలని కోర్టు తీర్పునిచ్చింది. ఒంటరిగా వారిని పెంచినందుకు రీటాజీని ప్రశంసిస్తున్నాను. విడాకుల అనంతరం కూడా నేను పిల్లల్ని కలిసేవాడిని. అయితే నిబంధనల వల్ల ఎక్కువ సమయం వారితో గడపలేకపోయాను. రీటాతో విడాకుల అనంతరం నేను మరో పెళ్లి చేసుకున్నాను. ఇండియా నుంచి వెళ్లిపోయాను. ఎందుకంటే అప్పుడు ఇక్కడ ముంబైలో నాకు ఎక్కువ పని దొరికేది కాదు. కానీ, ఇండియాకి వస్తే జెస్సీ, జీకో, జానూలను కలిసేవాడిని.. వారితో కలిసి డిన్నర్‌కు వెళ్లేవాడిని. ఇక ఎదుగుతున్న కొద్ది వారు కూడా బిజీ అయ్యారు. కలవడం తగ్గిపోయింది. కానీ నాతో అవసరం ఉంది అని చెప్తే.. ఒకవేళ అప్పుడు నేను ముంబైలో ఉంటే తప్పక వారిని కలిసేవాడిని. అయితే ఎక్కువగా ఫోన్లో మట్లాడుకునే వాళ్లం’ అని తెలిపారు కుమార్ సాను. ఇక వృత్తిరీత్యా ప్రపంచం అంతా తిరుగుతుండటంతో కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయానన్నారు ఆయన. రెండో భార్య సలోని, ఇద్దరు కుమార్తెలతో కూడా తాను ఎక్కువ సమయం గడపలేకపోయానని తెలిపారు. -
ప్రముఖ బాలీవుడ్ సింగర్‌కు కరోనా
ముంబై: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కుమార్ సాను(63) కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా గురువారం రాత్రి వెల్లడించారు. ‘దురదృష్టవశాత్తు సనుడా కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దయచేసి నా ఆరోగ్యం కుదుటపడాలని దేవుడిని ప్రార్థించండి. థ్యాంక్యూ మై టీమ్’ అంటూ పోస్ట్ చేశారు. కాగా ఈ నెల 20న సాను పుట్టినరోజు. దీంతో లాస్ ఏంజెల్స్‌లో కుటుంబంతో సరదాగా బర్త్‌డే పార్టీ జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు అక్టోబర్ 14న అక్కడకు వెళ్లాలని అనుకున్నారు.కానీ ప్రస్తుతం తన ఆరోగ్యం సరిగా లేనందున నవంబర్‌కు వాయిదా వేసుకున్నారు, సనూకు భార్య సలోని, కూతుళ్లు షానూన్, అన్నాబెల్ ఉన్నారు. చదవండి: మీ ప్రేమను తిరిగి ఇస్తా! ఇక కుమార్ సాను 1990లో బాలీవుడ్లో అద్భుత పాటలను అలపించారు. బీబీసీ టాప్ 40 బాలీవుడ్ సౌండ్‌ట్రాక్స్‌లో కుమార్ పాటలు దాదాపు 25 ఉన్నాయి. అతను 30 భాషల్లో 21 వేల పాటలను పాడి రికార్డు సృష్టించారు. అంతేగాక కేవలం ఒకే రోజులో 28 పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు. ప్రస్తుతం కుమార్ సాను కుమారుడు జాన్ బిగ్‌బాస్ 14లో కంటెస్టెంటుగా ఉన్నారు. 2009లో పద్మ శ్రీ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. -
'హిందీ పాట సాహిత్య విలువలు కోల్పోతోంది'
ప్రముఖ గాయకుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కుమార్ సోను బాలీవుడ్ పాటలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ' ఈ మధ్య వస్తున్న హిందీ సినిమా పాటల్లో సాహిత్య విలువలు కనిపించటం లేదు. 90ల పాటలను అప్పటి సాహిత్యం, మెలోడీ కారణంగా ఇప్పటికీ మనం గుర్తుకు చేసుకుంటున్నాం. కానీ ప్రస్తుత పాటలకు అలాంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పటికీ ప్రాంతీయ భాషా చిత్రాల్లో కాస్త విలువలు కనిపిస్తున్నాయి. మార్పు అవసరమే, సంగీతంలో కూడా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నాం. అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్నాం. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది.. పాటలు ఎప్పుడు సాహిత్యం కారణంగానే ఎక్కువగా కాలం నిలిచి ఉంటాయి. ఈ జనరేషన్ మంచి పాటలు అందించటం లేదని కాదు.. కానీ గతంలో పది లో తొమ్మిది పాటలు బాగుంటే ఇప్పుడు రెండే బాగుంటున్నాయి'. అంటూ ఈ జనరేషన్ హిందీ పాటలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. -
బీజేపీ గూటికి కుమార్ సాను
న్యూఢిల్లీ: ప్రముఖ నేపథ్య గాయకుడు కుమార్ సాను మంగళవారం మళ్లీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఓ దేశభక్తి గీతంలోని కొంత భాగాన్ని సాను పాడారు. తర్వాత మాట్లాడుతూ.. ‘నేను మోదీకి పెద్ద అభిమానిని. మోదీ మాత్రమే భారత్‌ను రక్షించగలరు. మనల్ని ముందుకు తీసుకుపోగలరు’ అని అన్నారు. పేదలకు సేవ చేయాలని భావించి బీజేపీలో చేరానని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎంతో సేవ చేయవచ్చన్నారు. ప్రస్తుతం బీజేపీ పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న పశ్చిమ బెంగాల్లో పార్టీ వల్ల మార్పు తీసుకురావచ్చని భావిస్తున్నట్లు తెలిపారు.


