
విశ్లేషణ
దోషులుగా నిర్ధరణ కాకముందే మన యువతీ యువకులు ఐదేళ్ళకు పైగా జైలులో మగ్గుతూంటే మన ప్రజా స్వామ్యం గురించి ఏమని చెప్పుకోగలం? ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్ నేడు అటు వంటి స్థితిలోనే చిక్కుకున్నారు. వారు దోషులుగా ప్రకటితులైనవారు కాదు. విచారణలో ఉన్న ఖైదీలు. నిర్దోషులుగానే ఇప్పటికీ భావించవచ్చు. అయినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యు.ఎ.పి.ఎ.) వల్ల ఢిల్లీ హైకోర్టు 2025 సెప్టెంబర్ ఆదేశం మేరకు వారు ఇప్పటికీ జైలులోనే ఉన్నారు.
వారు కుట్ర పన్నారనడానికి వారి ప్రసంగాలను, కరపత్రాలను, వాట్సాప్ గ్రూపులను సాక్ష్యాధారంగా తీసుకున్నారు. వేలాది పేజీల భారం కింద విచారణ కుంటు పడుతూ వచ్చింది. కేసులు ఏళ్ళకొద్దీ నానుతూ ఉంటే, స్వేచ్ఛను తొక్కి ఉంచడానికి లేదని సాక్షాత్తూ సుప్రీంకోర్టు కె.ఏ. నజీబ్ కేసు (2021)లో హెచ్చరించింది. ఆ హెచ్చరికను పెడచెవిన పెట్టినట్లే కనిపిస్తోంది.
విచారణ రంగస్థలమా?
విచారణ దశలో ప్రాసిక్యూషన్ చెబుతున్నదాన్నే పరిగణనలోకి తీసుకోవాల్సిందని జడ్జీలకు నిర్దేశిస్తున్న ‘వటాలీ’ తీర్పు (2019) పూర్వ ప్రమాణంపైనే హైకోర్టు ఆధారపడింది. తాను ‘మినీ విచా రణ’ను ఏమీ నిర్వహించడం లేదని కోర్టు చెబుతోంది. కానీ, ప్రబ లంగా లేని సాక్షుల ప్రకటనలను అది వేదవాక్యంగా తీసుకుంది. అహింసకు ప్రేరేపిస్తున్న ప్రసంగాలు రక్తపాతానికి ఇచ్చిన పిలుపు లయ్యాయి. అటువంటి కారణాలపై స్వేచ్ఛను నిరాకరిస్తే, ఇంక విచారణ రంగస్థలం కాక మరేమవుతుంది?
కుట్రలను పరోక్షంగా కూడా రుజువు చేయవచ్చు. కానీ, ప్రాసంగిక సాక్ష్యాధారాలైనా కనీసం ఒకదానితో ఒకటి పొసగేవిగా ఉండాలి. ఇక్కడ పౌరసత్వ సవరణ చట్టం పట్ల అసమ్మతిని ఢిల్లీని బుగ్గి చేసే బృహత్ పథకం గాటన కట్టారు. ఉమర్ ఖాలిద్ 2020 ఫిబ్రవరిలో చేసిన అమరావతి ప్రసంగాన్నే తీసుకోండి. ఆయన 24–02–2020న నిరసనలు చేపట్టవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక పర్యటన కూడా కాకతాళీయంగా, అదే రోజున చోటు చేసుకుంది.
‘‘హింసాయుత అల్లర్లను ప్రేరేపించేందుకే ఉద్దేశపూర్వ కంగా ఆ రోజును ఎంచుకొన్నారు. అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేందుకే ఆ పని చేశారు’’ అని కోర్టు పేర్కొంది. అయితే, ‘‘హింస పట్ల హింసతో మేం ప్రతిస్పందించం. ద్వేషం పట్ల ద్వేషంతో మేం ప్రతి స్పందించం. వారు ద్వేషాన్ని వ్యాప్తి చేస్తే, మేం దానిపై ప్రేమతో స్పందిస్తాం. వారు మమ్మల్ని లాఠీలతో కొడితే, మేం త్రివర్ణ పతాకా లను చేతబూనుతాం’’ అని ఆయన సభికులతో అన్నట్లుగా వాస్తవిక రాతప్రతి వెల్లడిస్తోంది.
ప్రజాస్వామ్యంలో నిరసన ఒక భాగం
శర్జీల్ ఇమామ్ విషయంలో... ఆయన జామియా, అలీగఢ్, అసన్‌సోల్, గయలలో చేసిన ప్రసంగాలను ప్రముఖంగా పేర్కొంది. ‘‘భారతదేశంలోని మిగిలిన ప్రాంతం నుంచి ఢిల్లీని శాశ్వతంగా విడ గొట్టేస్తాం’’ అని ఆయన అన్నమాటలను కోర్టు ఉదాహరించింది.
నిరసన ప్రదర్శనల్లో సాధారణ దృశ్యాలైన రోడ్డు దిగ్భంధ నాలు, బైఠాయింపులను ఉగ్రవాదానికి ప్రాథమిక సాక్ష్యాధారాలుగా ఉన్నత స్థానం కల్పించింది. అదే అలీగఢ్ ప్రసంగాన్ని విశ్లేషిస్తూ అలహాబాద్ హైకోర్టు ‘‘హింసకు పురికొల్పేది నిస్సందేహంగా ఏదీ లేదు’’ అని కనుగొన్న అంశాన్నీ, బెయిలు మంజూరు చేసిన విష యాన్నీ తీర్పు విస్మరించింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుకు రక్షణ కల్పిస్తున్న రాజ్యాంగంలోని 19వ అధికరణాన్ని తీర్పు గుర్తించకపోలేదు.
అందుకు అది మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్‌ను ఉటంకించింది. ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ కేసులో సుప్రీం కోర్టు 2025లో తీసుకున్న నిర్ణయాన్ని కూడా ప్రస్తావించింది. అయినా కూడా, పౌరసత్వ సవ రణ చట్ట వ్యతిరేక నిరసన ప్రదర్శనలు స్వభావసిద్ధంగా హింసా యుతమైనవని ప్రాసిక్యూషన్ చేసిన వాదనను అంగీకరించింది. భారతదేశంలో ఏ నిరసన ప్రదర్శన అయినా అవాంతరాలు సృష్టించేదిగానే ఉంటోంది.
దండి యాత్ర, ఎమర్జెన్సీ వ్యతిరేక ర్యాలీల నుంచి చిల్లరమల్లర నిరసనలు, యాత్రలు, బైఠాయింపులు, రోడ్డు దిగ్బంధనాలు మన ప్రజాస్వామిక సరళిలో భాగంగా ఉంటూ వస్తున్నాయి. అటువంటి చర్యలను ‘ఉగ్రవాద కార్యకలాపాలు’గా ముద్ర వేయడం ప్రజాస్వా మ్యాన్నే నేరమయం అనడం అవుతుంది.
ఈ కేసులోని పలువురు సహ నిందితులు (దేవాంగనా కలితా, నటాషా నర్వాల్, ఆసిఫ్ ఇక్బాల్ తన్హా) ఇప్పటికే బెయిలుపై బయ టకు వచ్చారు. సూత్రప్రాయంగా చూస్తే, వారి సరసన ఉన్న ఇతరులకూ అదే రకమైన ఊరట లభించాలి. కోర్టు దీన్ని కూడా పట్టించుకోలేదు. ‘‘తొలుతటి బెయిలు ఉత్తర్వులను పూర్వ ప్రమాణంగా తీసుకోవడానికి లేదు’’ అని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అది ఇందుకు వాడుకుంది.
కానీ, ఖాలిద్, ఇమామ్ పాత్ర ఇప్పటికే విడుదలైనవారి కన్నా పెద్దది ఏమీ కాదు. ఏ విధంగానో చెప్పకుండానే, వారి ప్రమేయం ‘తీవ్ర’మైనదని ప్రకటించడం ద్వారా, చట్టం ముందు అందరూ సమానులేనన్న మౌలిక సూత్రాన్ని కూడా కోర్టు పట్టించుకోలేదు.
ఈ కేసు కేవలం ఖాలిద్ లేదా ఇమామ్ గురించినది కాదు. భారతదేశంలో అసమ్మతికి ఉన్న తావు గురించినది. నిరసనను ఉగ్రవాదంగా చూస్తే, ఇక సమీకరించడానికి ఎవరు సాహసిస్తారు? వాట్సాప్ గ్రూపులు కుట్రలైతే వాటిలో చేరేందుకు ఎవరు సాహసిస్తారు? పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక నిరసన ప్రదర్శన రాజ్యాంగబద్ధంగా సమీకరించినదే. దాన్ని ఉగ్రవాద కుట్రగా చిత్రించడం ద్వారా కోర్టు ఒక మొత్తం ఉద్యమాన్ని చట్టవిరుద్ధం చేస్తోంది.
పౌర ప్రజాస్వామ్యం స్వేచ్ఛ, భద్రత రెండింటినీ కాపాడుకొని తీరాలి. దామాషాయే అసలు పరీక్ష. మాటలకు, నిరసన ప్రదర్శ నలకుగాను, విచారణకు నోచుకోకుండా ఐదేళ్ళు జైలులో గడపడం దామాషా కిందకు రాదు. దోషిగా నిరూపణ కాకుండానే శిక్ష వేయ డమవుతుంది.
పార్లమెంట్ కూడా తన బాధ్యత నుంచి తప్పించు కోలేదు. బెయిలును నిరాకరించే చట్టం ప్రజాస్వామ్యాన్ని కూడా బలహీనపరచేది అవుతుంది. ‘ఉపా’లోని సెక్షన్ 43(డి)(5) సరిగ్గా అదే పని చేస్తోంది. దాన్ని సత్వరం సంస్కరించవలసి ఉంది. ఇక్కడ పణంగా ఉన్నది ఒక్క కేసు కాదు, మొత్తం గణతంత్రం.
సంజయ్ హెగ్డే
వ్యాసకర్త సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)