
మాధవ్ శింగరాజు
తెలిసిన పదాలకే అర్థాలు వెతుక్కుంటున్నాను నేను! రాహుల్ గురించి నాకేం తెలియదని?!
ఆయన నాతో ఒక్క నవ్వును మించి ఎక్కువ మాట్లాడరు. ఆ నవ్వుకు ‘‘నమస్తే ఖర్గేజీ’’ అని అర్థం; ఎక్కడికి వెళుతున్నదీ చెప్పరు.
‘‘నా కోసం చూడకండి’’ అని అర్థం; ఎందుకు వెళుతున్నదీ చెప్పరు. ‘‘ఎక్కువగా ఆలోచించ కండి’’ అని అర్థం; ఎప్పుడు వచ్చేదీ చెప్పరు. ‘‘రావాలని నాకూ ఉంటుంది’’ అని అర్థం;
ఏం చేయబోయేది చెప్పరు. ‘‘నాకైనా ఎలా తెలుస్తుంది?’’ అని అర్థం; ఎవరి గురించి,ఏం మాట్లాడబోయేదీ చెప్పరు. ‘‘మాటలు మనకు చెప్పి వస్తాయా ఖర్గేజీ?!’’ అని అర్థం.
రాహుల్ మళ్లీ ఇవాళ కొన్ని గంటలుగా కనిపించటం లేదు! ఆయన కనిపించక పోవటానికి – కనిపించకపోవటానికి మధ్య ఆయన కనిపించే నిడివి ఈ మధ్య కాస్త ఎక్కువగా తగ్గుతున్నట్లు నాకు అనిపిస్తోంది!
‘‘మీకేమైనా సమాచారం ఉందా వేణుగోపాల్?’’ అని అడిగాను. పార్టీ ఆఫీస్‌లో నేను, వేణుగోపాల్ మాత్రమే ఉన్నాం. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ఆయన.
‘మీకు తెలియకుండా నాకు తెలుస్తుందా ఖర్గేజీ!’ అన్నట్లుగా... నిస్సహాయంగా నా వైపు చూశారు వేణుగోపాల్. ఆయన్నిక ఎక్కువ సంఘర్షణకు గురి చేయదలచుకోలేదు నేను.
‘‘సరే! తాళం వేసుకుని మీరు వెళ్లండి’’ అని పైకి లేచాను. నాతో పాటే వేణుగోపాల్ కూడా పైకి లేచి, ‘‘ఖర్గేజీ! మీతో ఒక మాట’’ అన్నారు!!
‘చెప్పండి వేణు...’’ అన్నాను.
‘‘ఖర్గేజీ! మీరీ మధ్య ఒకే మాటను రెండు అర్థాలు వచ్చేలా మాట్లాడుతున్నారు. లేదా, మీరు మాట్లాడుతున్న ఒకే మాట రెండు అర్థాలు వచ్చేలా ఉంటోంది...’’ అన్నారు వేణుగోపాల్.
‘‘ఏమిటా ‘ఒక మాట – రెండర్థాలు’ వేణుగోపాల్?!’’ అన్నాను.
‘‘ఖర్గేజీ! జునాగఢ్‌లో మీరు – ‘‘మొత్తం పెట్టె కుళ్లిపోక ముందే, చెడిపోయిన మామిడి
పండ్లను తొలగించాలి...’’ అని అన్నారు.
వెంటనే టీవీ ఛానెళ్ల వాళ్లు, ‘కాంగ్రెస్‌లో ఎవరా చెడిపోయిన మామిడి పండ్లు?!’ అని డిబేట్ మొదలు పెట్టేశారు. ఇప్పుడేమో, ‘తాళం వేసుకుని మీరు వెళ్లండి’ అని నాతో అన్నారు. అదృష్టవశాత్తూ ఇది టీవీ వాళ్లకు తెలిసే అవకాశం లేదు కనుక – ‘తాళం వేయమంటే ఏమిటర్థం? పార్టీ ఆఫీస్‌కు తాళం వేసేద్దాం అనేనా ఖర్గే అంటున్నది...’ అని డిబేట్ పెట్టే ప్రమాదం తప్పిపోయింది...’’ అన్నారు వేణు!
‘‘నిజమే కానీ వేణుగోపాల్, ఒక మాటను పది మంది పది రకాలుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని చెప్పి, ఆ పది మందికీ ఒకే రకంగా అర్థం అయ్యేలా మాట్లాడాలంటే... ఒక్క మౌనంతో మాత్రమే కదా అది సాధ్యం అవుతుంది?’’ అన్నాను.
అలా అంటున్నప్పుడు నాకు రాహుల్ గుర్తొచ్చారు. బహుశా అందుకేనా రాహుల్ నాతో గానీ, పార్టీలో మరొకరితో కానీ తక్కువ మాట్లాడి, ఎక్కువ మౌనంగా ఉంటారు?!
‘‘సీఆర్పీఎఫ్ వాళ్లు లెటర్ పంపించారు వేణుగోపాల్. సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ చేయకుండా రాహుల్ బయట తిరుగు తున్నారని కంప్లైంట్. ఈ తొమ్మిది నెలల్లోనే ఇటలీ, వియత్నాం, ఖతార్, లండన్, దుబాయ్ మలేసియా ట్రిప్పులు వేశారట! ‘హై రిస్క్ కేటగిరీలో ఉన్న వీఐపీలు ప్రోటోకాల్‌ని వయలేట్ చేస్తే ఎలా?’ అంటున్నారు’’ అన్నాను.
వేణుగోపాల్ మౌనంగా ఉన్నారు! బహుశా అది, వివేచనతో కూడిన మౌనం కావచ్చు.
‘‘మీరు వెళ్లండి వేణుగోపాల్! నేను కాసేపు ఉండి వస్తాను‘ అన్నాను, తిరిగి కూర్చుంటూ.
ఆయన వెళ్లిపోయారు. నా చేతిలో సీఆర్పీఎఫ్ వాళ్లు పంపిన లెటర్ ఉంది.
‘‘మీ అబ్బాయి మాట వినటం లేదు’’ అని స్కూల్ హెడ్ మాస్టర్, పేరెంట్స్‌కి లెటర్ రాయగలరు. ‘‘మా అబ్బాయి మాట వినటం లేదు...’’ అని పేరెంట్స్ ఎవరికి లెటర్ రాయగలరు?!
రాహుల్ సీఆర్పీఎఫ్‌కే కాదు, సీడబ్ల్యూసీకీ చెప్పి వెళ్లటం లేదని నేనెవరితో చెప్పుకోగలను?! ఎవరికి లెటర్ రాయగలను?