రోబో సినిమా చూశారా? అందులో రోబో చిట్టి ఓ మహిళకు ప్రసవం చేస్తుంటాడు. అడ్డం తిరిగిన బిడ్డను బయటకు తీసుకురావడానికి తాను ప్రయత్నిస్తానంటే లేడీ డాక్టర్ వద్దంటుంది. తానేదో చాలా పురాతన ప్రక్రియను అమలు చేస్తానంటూ బిడ్డను సరైన రీతిలో తిప్పడం కంప్యూటర్ మీద ప్రేక్షకులకు కనిపిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనకు తెలిసేదేమిటంటే... ఓ చిన్నారి బుద్ధిగా ఈలోకంలోకి రావాలంటే... తల్లిలోంచి మొదట తలను బయటకు తేవాలి. కానీ కొంతమంది చిలిపి చిన్నారులు మొదటే లోకానికి ‘ఎదురు తిరుగుతారు’! ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు మొట్టమొదటి పనే పూర్తిగా భిన్నంగా చేస్తారు. అందుకే ఇలాంటి బిడ్డల్ని తల్లులూ, అత్తమ్మలూ, నానమ్మలూ, అమ్మమ్మలూ ‘ఎదురుకాళ్ల’తో పుట్టాడంటూ ముద్దుగా మురిపెంగా తిడుతుంటారు. వీళ్లనే ఇంగ్లిష్‌లో ‘బ్రీచ్’ బేబీస్ అంటారు. కడుపులోని బిడ్డ ఎందుకిలా అడ్డం తిరుగుతాడు. ఇలా తిరిగి΄ోయినప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు... వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.
నిజానికి ఎదురుకాళ్లు అంటారుగానీ... తల ముందుకు రావాల్సిన చోట వాస్తవంగా బిడ్డ పిరుదులు ముందుకు వస్తాయి. అలా అడ్డం తిరిగినప్పుడు ప్రసవమూ సాఫీగా జరగదు. అలాంటప్పుడు ఆ చిన్నారిని ఈ లోకంలోకి తీసుకువచ్చేందుకు చాలాసార్లు శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుంది. ప్రసవం వేళకు పిండం అడ్డం తిరిగి పుట్టేందుకు ప్రయత్నించే ఈ ‘బ్రీచ్’ బేబీ విషయంలో ఏయే ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉంటాయి. వాటి సంగతేమిటో చూద్దాం...
బిడ్డ పుట్టేవరకూ గర్భసంచిలోని ఆమ్నియాటిక్ ఫ్లుయిడ్ అనే ద్రవంలో తేలియాడుతూ ఉంటుంది. మనం ఉమ్మనీరు అని పిలిచే ఆ ద్రవంలో అన్నివైపులకూ తిరుగుతూ... తనకు అందుబాటులో ఉన్న స్పేస్‌లో తలను ఎటువైపునకైనా తిప్పుతూ తిరిగే ఆ పిండం సరిగ్గా ప్రసవం వేళకు మాత్రం తలను బయటపెడుతూ ఈలోకంలోకి రావాలి. అలా శిరస్సు ముందుగా బయటకు రావడాన్ని సంప్రదాయ భాషలో ‘శీర్షోదయం’ అని అంటుంటారు. అయితే ఇలా శీర్షోదయం కాకుండా బిడ్డ అడ్డం తిరిగే కండిషన్స్ దాదాపు 3 శాతం నుంచి 4 శాతం ప్రసవాల్లో కనిపిస్తుంటాయి.
ఇటీవల కొద్దిగా పెరిగాయి కూడా. గతంలోనైతే ఇలా బిడ్డ అడ్డం తిరిగే కండిషన్ కారణంగా దాదాపు 25 శాతం కేసుల్లో శిశుమరణాలు చోటుచేసుకుంటూ ఉండేవి. కానీ ఇటీవల దాదాపూ ప్రతి ప్రసవమూ ఆసుపత్రుల్లో (ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీస్) జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ తరహా ప్రసవం ముప్పులు చాలావరకు తగ్గాయంటూ నిశ్చయంగా చెప్పవచ్చు.
బిడ్డ అడ్డం తిరగడానికి కారణాలు...
ప్రసవం వేళకు బిడ్డ పూర్తిగా ఎదగకపోవడం (ప్రీ–మెచ్యురిటీ).
ఒక అండం మాత్రమే కాకుండా అనేక అండాల ఫలదీకరణ జరగడం (మల్టీఫీటల్ జెస్టేషన్)
(సాధారణంగా ఇలాంటి కండిషన్స్‌లోనే కవలలు (ట్విన్స్) వంటి కేసుల్లోనూ సహజ ప్రసవం జరగకపోవచ్చు).
పుట్టుకతో ఏర్పడే లోపాల వల్ల...
బిడ్డ తలకు బాగా నీరు పట్టి ఉండటం (హైడ్రోసెఫాలస్), బిడ్డ మెదడు ఎదగాల్సిన చోట చాలా సందర్భాల్లో అది లోపించి, మెదడులోని అనేక భాగాలు ఎదగక΄ోవడం (అనెన్‌సెఫాలస్).
కడుపులో బిడ్డకు పిండ దశలోనే అనేక రకాల లోపాలు ఏర్పడటం. ∙ ఎవరైనా తల్లికి వరసగా తన మూడు ప్రసవాల్లోనూ (లేదా అంతకంటే ఎక్కువగానూ) చిన్నారులు ఎదురుకాళ్లతో పుడితే... ఆ తల్లికి సాధారణంగా మరోసారి కూడా ఇలాంటి కండిషన్ ఏర్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్నే వైద్యపరిభాషలో ‘మల్టీపారా విత్ లాక్స్ అబ్డామిన్’గా చెబుతారు.
బిడ్డను అంటిపెట్టుకుని ఉండే మాయ.. గర్భాశయ ముఖద్వారంలోకి ప్రవేశించడం.
ఈసీవీ ఎవరిలో చేయవచ్చంటే...
ప్రెగ్నెన్సీ 36 – 37 వారాల వ్యవధి తర్వాత ప్రయత్నించవచ్చు.
కాబోయే తల్లికి ఎలాంటి కాంప్లికేషన్లూ లేనప్పుడు మాత్రమే ప్రయత్నించాలి.
ఉమ్మనీరు తగినంతగా ఉండాలి.
ఈసీవీ విజయవంతం అవడానికి కేవలం 50 % మాత్రమే అవకాశముంటుంది. (అయితే కొన్నిసార్లు ఈసీవీ ప్రక్రియ తర్వాత కూడా చిన్నారి తిరిగి మళ్లీ బ్రీచ్ కండిషన్‌కు వెళ్లవచ్చు... అంటే మళ్లీ చిన్నారి ఎదురు తిరిగేందుకు అవకాశముంది).
ఒకవేళ ఆ టైమ్‌లో పురిటి నొప్పులు వచ్చినప్పుడు బేబీ బ్రీచ్‌డ్ కండిషన్‌లో ఉంటే... ఆ టైమ్‌లో ఈసీవీ చేయడం సరికాదు. నేరుగా సిజేరియన్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
బ్రీచ్ బేబీస్ విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు
ఒకవేళ కాబోయే తల్లిదండ్రులు సిజేరియన్‌ను కోరుకోకపోతే అప్పుడు ‘ఎక్స్‌టర్నల్ సెఫాలిక్ వర్షన్’ (ఈసీవీ) అనే ప్రత్యామ్నాయానికి వెళ్లవచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో ఆ తల్లిదండ్రులు ఈప్రోసిజర్‌లో ఉన్న ముప్పు దీన్ని ఎప్పుడు చేస్తారన్న అంశాలు తప్పక తెలుసుకుని ఈప్రోసిజర్‌పై అవగాహన ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం.
ఎక్స్‌టర్నల్ సెఫాలిక్ వర్షన్ (ఈసీవీ) అంటే..
బిడ్డ కడుపులోంచి బయటికి రావడానికి అనువైన రీతిలో తిరగకుండా... (తలను ముందుకు తీసుకురాకుండా) ఇతరత్రా పొజిషన్స్‌లో ఉన్నప్పుడు నేరుగా శస్త్రచికిత్సతో బిడ్డను బయటకు తీసుకురావడానికి బదులుగా ప్రసవం మొదట్నుంచీ కొద్దికొద్దిగా ప్రయత్నిస్తూ... చిన్నారి తల భాగాన్ని ముందుకు తీసుకొచ్చేలా చేయడాన్ని ‘ఎక్స్‌టర్నల్ సెఫాలిక్ వర్షన్–ఈసీవీ’ అంటారు.
సాధారణంగా కడుపులోని బిడ్డ గర్భసంచిలోని ఉమ్మనీటిలో నిత్యం దొర్లుతున్నట్లుగా అటూఇటూ తిరుగుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. గర్భసంచిలో బిడ్డ ఎదుగుతున్న కొద్దీ బిడ్డ సైజు పెరుగుతూ, అది ఎటుపడితే అటు తిరగడానికి వీలుకల్పించే ఉమ్మనీటి ద్రవం తగ్గుతూ ΄ోతుంది. అయితే ప్రసవం సమయానికి బిడ్డ తల ఆటోమేటిగ్గా బయటకు రావడానికి వీలుగా కిందివైపునకు తిరుగుతుంది. కొందరిలో ఇలా తిరగకపోతే తల్లి కడుపుపై చేతులుంచి బయటినుంచే లోపలి పిండాన్ని తిరిగేలా చేస్తూ తలను కిందివైపునకు తిరిగేలా చేసే ప్రక్రియను ‘ఎక్స్‌టర్నల్ సెఫాలిక్ వర్షన్’ (ఈసీవీ) అంటారు.
బిడ్డ అడ్డం తిరగడంలో రకాలు
బిడ్డ కేవలం ఎదురు కాళ్లతోనే కాకుండా ఇంకా అనేక రకాలుగా బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇలా బిడ్డ అడ్డం తిరగడమన్నది ఎన్ని రకాలుగా జరుగుతుందో చూద్దాం...
1) ఫ్రాంక్ / ఇన్‌కంప్లీట్ బ్రీచ్...
ఇందులో బిడ్డ తన తలకు బదులుగా మొదట తన పిరుదులను బయటకు తేవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇలాంటి పొజిషన్‌లో బిడ్డ ఒక పాదం తన చెవుల దగ్గర ఉంటుంది.
2) కంప్లీట్ బ్రీచ్ / ఫ్లెక్సెడ్ బ్రీచ్... ఈ కేస్‌లోనూ బిడ్డ తలకు బదులుగా పిరుదులను తొలుత బయటకు తేవడానికి ప్రయత్నిస్తుంటుంది. అయితే ఈ పొజిషన్‌లో ‘ఫ్రాంక్ / ఇన్‌కంప్లీట్ బ్రీచ్’లోలా ఒక పాదం మాత్రమే చెవి దగ్గర ఉండదు. బిడ్డ రెండు పాదాలూ ముడుచుకుని ఉంటాయి.
3) ఫూట్లింగ్ ప్రజెంటేషన్... ఈ కండిషన్‌లో బిడ్డ పిరుదులు, మోకాళ్లు... ఇవన్నీ ముడుచుకునే ఉంటాయి. లేదా ఒక కాలు పూర్తిగా చాపి ఉంటుంది. అయితే పాదాలు పిరుదుల కంటే కింది భాగంలో ఉండి ప్రసవం కష్టమవుతుంది.
బిడ్డ అడ్డం తిరిగిన సందర్భాల్లో తల్లిదండ్రులు ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనుకుంటే మాత్రం సిజేరియన్ సెక్షన్‌కు వెళ్లడం చాలా సురక్షితమైన, మంచి ప్రత్యామ్నాయం. మొదటి ప్రెగ్నెన్సీ విషయంలో ఇది మరింత అవసరం కూడా.
ఈసీవీ చేయడానికి సాధ్యం కాని పరిస్థితులు ఏమిటంటే...
తలలో పుట్టుకతో వచ్చే లోపాలు హైడ్రోసెఫాలస్ / అనెన్‌సెఫాలీ వంటి పుట్టుకతోనే లోపాలున్న సందర్భాల్లో : కొందరు బిడ్డల్లో మెదడు ఎదగాల్సిన చోట కేవలం నీరు మాత్రమే ఉంటుంది. ఈ కండిషన్‌ను హైడ్రోసెఫాలస్ కండిషన్ అంటారు. ఇక మరికొందరు బిడ్డల్లో మెదడులోని అన్ని భాగాలూ పూర్తిగా ఎదగ కుండా ఉండి΄ోతాయి. ఈ కండిషన్స్‌ను అనెన్‌సెఫాలీ కండిషన్ అంటారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఈసీవీ చేయడం ఏమాత్రం సాధ్యం కాదు.
ఆలిగో హైడ్రామ్నియస్ (అంటే ఉమ్మనీరు చాలా తక్కువగా ఉండటం లేదా
పాలీ హైడ్రామ్నియస్ (అంటే ఉమ్మనీరు అవసరమైనదాని కంటే ఎక్కువగా ఉండటం.
యుటెరైన్ అనామలీస్ : యుటెరన్ లోపాలున్నప్పుడు.
ఫూట్లింగ్ బ్రీచ్ : అంటే పుట్టే సమయంలో కడుపులోని బిడ్డ కాళ్లు మొదట బయటకు రావడం.
ఎక్స్‌టెండెడ్ హెడ్ అండ్ కార్డ్ ఎరౌండ్ నెక్ : బిడ్డ పుట్టే సమయంలో తల బయటకు వచ్చేందుకు బర్త్ కెనాల్‌లో తగినంత స్థలం లేక΄ోవడంతో తలమీద చాలా ఒత్తిడి పడటం. ఇక కార్డ్ ఎరౌండ్ నెక్ అంటే బొడ్డుతాడు మెడ చుట్టూ బిగుసుకుపోయే కండిషన్.
ప్రీవియస్ సిజేరియన్ : గతంలో జరిగిన ప్రసవంలో సిజేరియన్‌తో బిడ్డను బయటకు తీసుకువచ్చిన కేస్ అయి ఉండటం.
ప్లాసెంటా ప్రివియా : ఈ కండిషన్‌లో గర్భధారణ జరిగినప్పుడు మాయ (ప్లాసెంటా) గర్భాశయం కింది భాగానికి అతుక్కుపోయి, గర్భాశయ ముఖద్వారాన్ని (సర్విక్స్‌ను) పాక్షికంగా గానీ, పూర్తిగాగానీ కప్పి ఉంచడం.
యాంటీరియర్ ప్లాసెంటా : గర్భధారణ సమయంలో బిడ్డకు పోషకాలు అందించే బొడ్డుతాడు (మాయ) గర్భాశయం ముందువైపు గోడకు అతుక్కుపోయి ఉండటం (ఇది చాలా సాధారణం, ఆరోగ్యకరమైన గర్భధారణకు సంకేతం).
ఈసీవీ చేయించుకోవాలని కోరేవారు అన్ని వసతులూ ఉండే మంచి ప్రసూతి ఆసుపత్రిని ఎంచుకుని అక్కడ బాగా అనుభవజ్ఞులైన ‘ఆబ్‌స్ట్రెట్రీషియన్స్’ (గర్భస్త పిండ వైద్యచికిత్స, ప్రసూతి నిపుణులు) ఉన్నారేమో ఎంక్వైరీ చేయాలి. అక్కడ ఈసీవీ జరుగుతున్నప్పుడు కడుపులోని బిడ్డను కంప్యూటర్ తెరపై ఎప్పుడూ చూసేందుకు వీలయ్యేలా ‘రియల్ టైమ్ అల్ట్రాసౌండ్ డాప్లర్’ సౌకర్యమూ ఉండాలి.
ఈ డాప్లర్ ఉండటం వల్ల ఈసీవీ చేస్తున్నప్పుడు బిడ్డ తాలూకు బొడ్డు తాడు అతడి మెడకు చుట్టుకు΄ోయి బిగుసుకుపోతుందా లేక మామూలుగానే ఉందా అని ఎప్పటికప్పుడు పరిశీలనగా చూడటానికి వీలవుతుంది. ఇలా చేస్తున్నప్పుడు ఒకవేళ తల్లికి తీవ్రమైన నొప్పి కలుగుతున్నా లేదా బిడ్డ తాలూకు గుండె స్పందనలు తగ్గుతున్నా లేదా ఈ గుండె స్పందనల్లోని లయ (రిథమ్) క్రమబద్ధంగా లేక΄ోయినా ఈ ప్రక్రియను నిలిపివేయాలి. వీలుకాక΄ోతే అప్పుడు శస్త్రచికిత్స (సిజేరియన్ సెక్షన్)కు తప్పక వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
చివరగా...
శస్త్రచికిత్స వల్ల తమకు ఒనగూరే ప్రయోజనాలూ, ఆర్థిక అంశాల కారణంగా కొందరు డాక్టర్లు శస్త్రచికిత్స (సిజేరియన్)లను ప్రోత్సహిస్తున్నారనే వాదన చాలా సందర్భాల్లో వినిపిస్తూ ఉంటుంది. చాలామందిలోనూ ఈ అ΄ోహ ఉంటుంది. ఇందులో వృత్తిలో నైతికతకు సంబంధించిన అంశాలతోపాటు శస్త్రచికిత్స చేయడం తప్ప ఇతరత్రా అవకాశాలు లేని పరిస్థితులూ ఉంటాయి.
దాంతో లోకంలో ఈ శస్త్రచికిత్సల విషయంలో చాలా వాదనలూ, భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి. ఇక మరికొందరు తల్లులు తాము ప్రసవం తాలూకు నొప్పులను భరించడానికి ఇష్టపడక΄ోవడం అనే అంశమూ శస్త్రచికిత్సలను తప్పనిసరి చేస్తోంది. కాబట్టి ఈ అంశాలన్నింటిలోనూ డాక్టరుకూ, ప్రసవమవుతున్న తల్లికీ... ఈ ఇరువురికీ ఓ స్పష్టత ఉండాలి.
తమ డాక్టరును నమ్మి, తనపై పూర్తిగా విశ్వాసం ఉంచినప్పుడే ప్రసవం విషయంలో అంతా సజావుగా జరిగిపోతుంది. అందుకే తాము నమ్మకం ఉంచిన డాక్టర్ దగ్గరే ప్రసవం జరిగేలా చూసుకోవడం ఇటు కాబోయే తల్లికీ, తన కుటుంబ సభ్యులకూ, అటు డాక్టరుకూ సౌకర్యంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి.
(చదవండి: ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..)


