టోక్యోలోని అకసక ప్యాలెస్‌లో ట్రంప్‌తో జపాన్ ప్రధాని తకాయిచి కరచాలనం
జపాన్ కోసం చేయాల్సిందంతా చేస్తా
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హామీ
నోబెల్ శాంతి బహుమతి కోసం
ట్రంప్‌ను నామినేట్ చేయనున్న జపాన్
అమెరికాలో 550 బిలియన్ డాలర్ల జపాన్ పెట్టుబడులు
ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చల్లో జపాన్ ప్రధాని తకాయిచి
టోక్యో: చైనాతో వాణిజ్య యుద్ధ భయాల వేళ.. ఆ దేశానికి చారిత్రక శత్రువు అయిన జపాన్‌కు మరింత దగ్గరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. సోమవారం నుంచి జపాన్‌లో రెండురోజుల పర్యటనలో ఉన్న ఆయన జపాన్ తొలి మహిళా ప్రధాని సనాయి తకాయిచితో అనేక అంశాలపై చర్చలు జరిపారు. మంగళవారం రోజంతా ఈ ఇద్దరు నేతలు వివిధ కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నారు. ట్రంప్‌ను ప్రసన్నం చేసుకొనేందుకు తకాయిచి ప్రయత్నించగా, జపాన్ నుంచి బలవంతంగానైనా పెట్టుబడులు రాబట్టేందుకు ట్రంప్ ప్రయత్నించారు.
పనిలో పనిగా నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్‌ను నామినేట్ చేసేందుకు తకాయిచిని ఒప్పించారు. తకాయిచితో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా జపాన్‌కు ట్రంప్ పలు హామీ ఇచ్చారు. ‘జపాన్‌కు సాయం చేసేందుకు నేను చేయాల్సిందంతా చేస్తాను. మన ద్వైపాక్షిక సంబంధాలు ఇప్పుడు చాలా బలమైన స్థాయిలో ఉన్నాయి’అని పేర్కొన్నారు. లంచ్ మీటింగ్‌లో భాగంగా ఇరువురు నేతలు అంతర్జాతీయ పరిణామాలతోపాటు వాణిజ్యం, పెట్టుబడులపై చర్చించారు. రెండు దేశాల మధ్య కీలకమైన ఖనిజా లపై వాణిజ్య సంబంధాల్లో ప్రస్తుతం స్వర్ణ యుగం నడుస్తోందని ఇద్దరు నేతలు వ్యాఖ్యానించారు.
అమెరికాలో జపాన్ భారీ పెట్టుబడులు
ట్రంప్ తన సహజ ధోరణిలో జపాన్‌కు వరాలు ప్రకటిస్తూనే నిందలు కూడా మోపారు. జపాన్ అసలు అమెరికా వాహనాలను కొనటం లేదని ఆరోపించారు. అమెరికాలో 550 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు లంచ్ మీటింగ్‌లో ఒప్పందాలు చేసుకున్నాయి. అమెరికాకు చెందిన 150 ఫోర్డ్ ట్రక్కులకు కొనుగోలు చేస్తామని తకాయిచి ప్రకటించారు.
అనంతరం టోక్యో సమీపంలోని అమెరికా సైనిక స్థావరం వద్ద ఉన్న అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ యూఎస్‌ఎస్ జార్జ్ వాషింగ్టన్‌పై కూడా ట్రంప్, తకాయిచి సమావేశమయ్యారు. మరోవైపు అమెరికా రాయబార కార్యాలయంలో అమెరికా, జపాన్ కంపెనీల సీఈవోలకు ట్రంప్ విందు ఇచ్చారు. జపాన్ కంపెనీల సీఈవోలతో అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ విందు సమావేశం నిర్వహించి భారీగా పెట్టుబడులు రాబట్టారు. వెస్టింగ్‌హౌస్, జీఈ వెర్నోవా సంస్థలు అమెరికాలో అణు విద్యుత్ ప్రాజెక్టుల్లో 100 బిలియన్ డాలర్ల చొప్పున పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి.
ట్రంప్‌కు శుభవార్త
నోబెల్ శాంతి పురస్కారం కోసం తహతహలా డుతున్న ట్రంప్‌కు జపాన్ ప్రధాని శుభవార్త చెప్పారు. వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్‌ను నామినేట్ చేస్తామని తకాయిచి హామీ ఇచ్చినట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ లీవిట్ తెలిపారు. ఈ ఏడాది పాకిస్తాన్, ఇజ్రాయెల్ సహా పలు దేశాలు, వ్యక్తులు ట్రంప్‌ను నామినేట్ చేసినా నోబెల్ కమిటీ ఆయనకు శాంతిపురస్కారం ఇవ్వలేదు. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్య సమావేశంలో పాల్గొనేందుకు ట్రంప్ బుధవారం దక్షిణకొరియాకు బయలుదేరి వెళ్లనున్నారు. గురువారం ఆయన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో చర్చలు జరుపనున్నారు.


