బంగ్లాదేశ్ మొండిపట్టు వీడటం లేదు. భారత్‌లో టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్‌లో ఆడే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేసింది. తమ ఆటగాళ్ల భద్రతకు కట్టుబడి ఉన్నామని.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఒత్తిళ్లకు తలొగ్గమంటూ మరోసారి ఓవరాక్షన్ చేసింది.
బంగ్లా బదులు ఆ జట్టు
ఫలితంగా వరల్డ్‌కప్ టోర్నీలో బంగ్లాదేశ్ ఆడే అవకాశాలు సన్నగిల్లాయి. ఇప్పటికే షెడ్యూల్, వేదికలు ఖరారు కావడం.. అందుకు అనుగుణంగా ఆయా జట్ల విమానాల టికెట్లు బుక్ చేసుకోవడం కూడా జరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ మ్యాచ్‌లను ఐసీసీ శ్రీలంకకు మార్చే అవకాశం లేనట్లే కనిపిస్తోంది.
ఒకవేళ బంగ్లాదేశ్ ఇలాగే పట్టుదలకు పోతే.. ఆ జట్టుకు బదులు ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ ప్రపంచకప్ టోర్నీలో అడుగుపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ టీ20 జట్టు కెప్టెన్ లిటన్ దాస్ (Litton Das) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వివాదంలో తలదూరిస్తే తాను చిక్కుల్లో పడతానని ఆందోళన వ్యక్తం చేశాడు.
దయచేసి అడగవద్దు
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌తో బిజీగా ఉన్న లిటన్ దాస్ మీడియాతో మాట్లాడగా.. ‘‘మీరు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆడతారా? లేదా?’’ అన్న ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నా వరకైతే ఈ విషయంపై స్పష్టత లేదు. జట్టులోని ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే.
ప్రస్తుతం బంగ్లాదేశ్ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది. ఈ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. తదుపరి మీరు ఏ ప్రశ్న అడుగబోతున్నారో నాకు తెలుసు. అది నాకు అంత సురక్షితమైనది కాదు. కాబట్టి సమాధానం చెప్పలేను’’ అని లిటన్ దాస్ పేర్కొన్నాడు. కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.
బీసీబీ వైఖరితో కష్టాల్లోకి ఆటగాళ్లు
ఈ నేపథ్యంలోనే భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు భద్రత అనే సాకు చూపి బంగ్లాదేశ్ నిరాకరిస్తోంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) వైఖరి కారణంగా ఆటగాళ్లకు ఇప్పటికే కష్టాలు మొదలైనట్లు తెలుస్తోంది. బంగ్లా ప్లేయర్లలో చాలా మందికి బ్యాట్ స్పాన్సర్లుగా భారత కంపెనీలు ఉన్నాయి. బీసీబీ వైఖరితో ఆ కంపెనీలు తమ కాంట్రాక్టులు రద్దు చేసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
మరోవైపు.. బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్- 2026 టోర్నీలో ఆడకపోతే దేశానికి వచ్చే నష్టమేమీలేదని.. ఆటగాళ్లే నష్టపోతారంటూ బీసీబీ అధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు.. ఐసీసీ నుంచే ప్రధాన ఆదాయం వస్తున్నందున ఈ విషయంలో బీసీబీ ఆచితూచి వ్యవహరించాలని కోరినందుకు మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌పై బీసీబీ అధికారి నజ్ముల్ ఇస్లాం ‘భారత ఏజెంట్’ అనే ముద్ర వేశాడు.
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బంగ్లాదేశ్ క్రికెటర్ల వెల్ఫేర్ అసోసియేషన్ నజ్ముల్‌ను సస్పెండ్ చేసేదాకా వదిలిపెట్టలేదు. ఇలా బోర్డు తీరుతో ఆటగాళ్లు వ్యక్తిగతంగా మాటలు పడుతూ.. ఆర్థికంగానూ నష్టపోయే ప్రమాదంలో పడ్డారు. అందుకే లిటన్ దాస్ సైతం ప్రపంచకప్ టోర్నీ ఆడే విషయమై స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేశాడు.
చదవండి: న్యూజిలాండ్‌తో తొలి టీ20.. మూడో స్థానంలో వచ్చేది అతడే..!


