భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రేపు (జనవరి 21) నాగ్‌పూర్ వేదికగా తొలి టీ20 జరుగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో టీమిండియాకు సంబంధించి ఓ బిగ్ అప్‌డేట్ అందుతుంది. ఈ మ్యాచ్‌లో పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ వన్‌డౌన్‌లో బరిలోకి దిగుతాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రకటించాడు.
ISHAN KISHAN LOCKED 🔐
- Ishan will bat at 3 tomorrow for India. 🇮🇳pic.twitter.com/rHXco5dmLN— Johns. (@CricCrazyJohns) January 20, 2026
రెండు సంవత్సరాల తర్వాత జాతీయ జట్టులోకి తిరిగి వచ్చిన ఇషాన్‌పై మేనేజ్‌మెంట్ పూర్తి నమ్మకంతో ఉందని పేర్కొన్నాడు. స్కై చేసిన ఈ ప్రకటనలో తొలి టీ20లో భారత తుది జట్టుపై క్లారిటీ వచ్చేసింది. ఇషాన్ జట్టులోకి వస్తే, శ్రేయస్ అయ్యర్ బెంచ్‌కు పరిమితం కాక తప్పదు.

తిలక్ వర్మ స్థానాన్ని అతనిలాగే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన ఇషాన్ భర్తీ చేయగలడని మేనేజ్‌మెంట్ నమ్ముతున్నట్లుంది. అందుకే శ్రేయస్ కంటే ఇషాన్‌కే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు సూర్యకుమార్ మాటల ద్వారా స్పష్టమవుతుంది.
ఇషాన్ చివరిగా 2023లో భారత్ తరఫున ఆడాడు. ఆతర్వాత స్వతాహాగా విరామం తీసుకొని బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా కోల్పోయాడు. గత కొంతకాలంగా దేశవాలీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తుండటంతో తిరిగి టీమిండియా తలుపులు తట్టాడు. ప్రపంచకప్‌కు ఇషాన్ ఎంపిక అనూహ్యంగా జరిగింది. ఇషాన్‌ను జట్టులోకి తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన జట్టే న్యూజిలాండ్ సిరీస్‌కు కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
జట్టులోకి వచ్చినా తిలక్ గాయపడకుంటే, ఇషాన్‌కు అవకాశం వచ్చేది కాదు. తిలక్ గాయం ఇషాన్‌కు కొత్త లైఫ్ ఇచ్చినట్లైంది.
వరల్డ్ కప్‌కు ముందు కీలక సిరీస్
స్వదేశంలో న్యూజిలాండ్‌తో రేపటి నుంచి ప్రారంభమయ్యే సిరీస్ ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు చాలా కీలకమైంది. అందుకోసమే ప్రపంచకప్ జట్టునే ఈ సిరీస్‌కు కూడా కొనసాగించారు. ఈ సిరీస్‌కు ముందు భారత్ న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది (1-2). టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన వారిలో తిలక్ వర్మతో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా గాయపడ్డాడు. తిలక్ స్థానాన్ని శ్రేయస్ అయ్యర్, సుందర్ స్థానాన్ని రవి బిష్ణోయ్ భర్తీ చేశారు. అయితే వీరిద్దరికి తుది జట్టులో అవకాశం రాకపోవచ్చు.
తొలి టీ20లో భారత తుది జట్టు కూర్పు ఇలా ఉండవచ్చు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్, ఆతర్వాతి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి రావచ్చు.
షెడ్యూల్..
తొలి టీ20- నాగ్‌పూర్
రెండో టీ20- రాయ్‌పూర్
మూడో టీ20- గౌహతి
నాలుగో టీ20- విశాఖపట్నం
ఐదో టీ20- తిరువనంతపురం


