భారత్‌లో టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్‌లను ఆడబోమని బంగ్లాదేశ్ మరోసారి తెలిపింది. టోర్నీలో ఆడే విషయమై బుధవారం లోగా నిర్ణయాన్ని ప్రకటించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) గడువు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని బంగ్లాదేశ్ ప్రభుత్వ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ (Asif Nazrul) మంగళవారం వెల్లడించారు. ఒక వేళ భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరిస్తే... ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్‌ను వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేసే అవకాశాలున్నాయి.
మా బదులు స్కాట్లాండ్ ఆడుతుందా?
‘మా స్థానాన్ని స్కాట్లాండ్ భర్తీ చేస్తుందని తెలియదు. భారత క్రికెట్ బోర్డు ఒత్తిడికి తలొగ్గి... ఐసీసీ మాపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తే మేము అంగీకరించము. గతంలో భారత్‌లో ఆడేందుకు పాకిస్తాన్ నిరాకరిస్తే... వారి మ్యాచ్‌ల వేదికలను మార్చారు. మేం కూడా అదే కోరుతున్నాం’ అని ఆసిఫ్ అన్నారు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుతం రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో... భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు ఆ జట్టు నిరాకరిస్తోంది. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ జట్టు గ్రూప్ దశ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబైలో ఆడాల్సి ఉంది. ఇటీవల ఐసీసీతో జరిగిన భేటీలో తమ మ్యాచ్‌లను మార్చాలని బీసీబీ కోరింది.
స్పందించని ఐసీసీ
గ్రూప్ ‘బి’లో ఉన్న ఐర్లాండ్ జట్టు లీగ్ దశలోని మ్యాచ్‌లన్నీ శ్రీలంక వేదికగానే ఆడనుండగా... తమ జట్టును గ్రూప్ ‘బి’లో వేసి తమ స్థానంలో ఐర్లాండ్‌కు అవకాశం ఇవ్వాలని కోరింది. అయితే దీనిపై ఐసీసీ స్పందించలేదు. వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లండ్, నేపాల్‌తో కలిసి బంగ్లాదేశ్ గ్రూప్ ‘సి’లో ఉండగా... శ్రీలంక, ఆస్ట్రేలియా, ఓమన్, జింబాబ్వేతో కలిసి ఐర్లాండ్ గ్రూప్ ‘బి’లో ఉంది.
చదవండి: న్యూజిలాండ్‌తో తొలి టీ20.. మూడో స్థానంలో వచ్చేది అతడే..!


