కర్తవ్యపథ్‌లో ఘనంగా వేడుకలు ∙ప్రధాన ఆకర్షణగా సిందూర్ శకటం
బ్రహ్మోస్ నుంచి సూర్యాస్త్ర దాకా అలరించిన ఆయుధ వ్యవస్థలు
అమేయ సైనిక శక్తికి, యుద్ధ సన్నద్ధతకు అద్దం పట్టిన కవాతు
సాంస్కృతిక వైవిధ్యానికి తార్కాణంగా నిలిచిన శకటాలు
ముఖ్య అతిథులుగా ఈయూ సారథులు ఉర్సులా, కోస్టా
వారిని సంప్రదాయ బగ్గీలో తోడ్కొని వచ్చిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ శకటం, ఆ పోరాటంలో పాక్ పీచమణచిన అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు, అతి శక్తిమంతమైన క్షిపణులు, కొత్త తరం యుద్ధ విమానాలు, సరికొత్త సైనిక విభాగాలు... ఇలా అమేయమైన భారత సైనిక శక్తిని 77వ గణతంత్ర దిన వేడుకలు కళ్లకు కట్టాయి. సిందూర్ థీమ్‌తో రూపొందిన భారత సైన్య శకటం అందరినీ ఆకట్టుకుంది.
ఇక దేశీయంగా రూపొందించిన పలు ప్రళయ భీకర ఆయుధాలు ఆహూతులను ఆద్యంతం అలరించాయి. ముఖ్యంగా 150 ఏళ్ల వందేమాతరం థీమ్ ఉర్రూతలూగించింది. సోమవారం ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకలు ఇందుకు వేదికగా నిలిచాయి. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాండెర్ లెయన్ ఈసారి గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వారిని వెంటబెట్టుకుని సంప్రదాయ గుర్రపు బగ్గీలో వేడుకలకు విచ్చేశారు. అనంతరం త్రివిధ దళాధిపతి హోదాలో సైనిక వందనం అందుకున్నారు. ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, త్రివిధ దళాధిపతులు, సైనిక, ప్రభుత్వ ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొన్నారు.
పలు రంగాల ప్రముఖులతో పాటు మొత్తం 10 వేల మందికి పైగా వేడుకలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ‘సారే జహా సె అచ్ఛా’, ‘కదం కదం బఢాయె జా’వంటి దేశభక్తి గీతాలతో పాటు వందేమాతరం అందరిలోనూ స్ఫూర్తి నింపాయి. 90 నిమిషాల పాటు జరిగిన వేడుకలో 18 సైనిక దళాలు, 13 సైనిక బ్యాండ్లు అలరించాయి. వేడుక అనంతరం రాష్ట్రపతి ప్రత్యేక అతిథులతో పాటుగా గుర్రపు బగ్గీలోనే వెనుదిరగడం విశేషం.
సాయుధ పాటవం సాహో...
త్రివిధ దళాల సైనిక పాటవ ప్రదర్శనకు గణతంత్ర వేడుకలు వేదికగా నిలిచాయి. గణతంత్ర పరేడ్‌కు పరేడ్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ భవనీశ్ కుమార్ సారథ్యం వహించారు...
→ బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్షిపణులు, ఆకాశ్ ఆయుధ వ్యవస్థలు, సూర్యాస్త్ర యూనివర్సల్ రాకెట్ లాంచింగ్ వ్యవస్థ, అర్జున్ యుద్ధ ట్యాంకు, ధనుష్ ఆర్లిటరీ గన్స్, దివ్యాస్త్ర బ్యాటరీ వంటివి అందరినీ అలరించాయి. 
→ 100 మందికి పైగా కళాకారులు ప్రదర్శించిన స్ఫూర్తిదాయకమైన ‘భిన్నత్వంలో ఏకత్వం’థీమ్ ఆకట్టుకుంది.
→ స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారిగా సైన్యం ‘యుద్ధ వ్యూహ అమరిక’ద్వారా తన పాటవాన్ని పూర్తిస్థాయిలో ప్రదర్శించడం విశేషం.
→ ఆ క్రమంలో, గత మేలో పాక్ పీచమణచిన ఆపరేషన్ సిందూర్‌లో కీలకపాత్ర పోషించిన క్షిపణులు, యుద్ధ విమానాలు, ఆయుధ వ్యవస్థలను కళ్లకు కడుతూ రూపొందించిన త్రివిధ దళాల శకటం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
→ ఇంటిగ్రేటెడ్ ఆపరేషనల్ సెంటర్, ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో శకటం ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. సిందూర్ ఆపరేషన్ వేళ బ్రహ్మోస్ క్షిపణులు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర వ్యవస్థలతో పాటు పాక్‌లోని కీలక నగరాల్లో ఎయిర్ బేస్‌లను నేలమట్టం చేయడం, ఎస్–400 డిఫెన్స్ వ్యవస్థలు పాక్‌దాడులను పూర్తిస్థాయిలో అడ్డుకోవడం తెలిసిందే.
→ టీ–90 భీష్మ, అర్జున్ యుద్ధట్యాంకులు, బీఎంపీ–2 పదాతి దళ వాహనం, నాగ్ క్షిపణి వ్యవస్థ ముందు నడుస్తుండగా తేలికరకం అత్యాధునిక ధ్రువ్, అపాచీ ఏహెచ్–64ఈ, ప్రచండ్ హెలికాప్టర్లు వాటికి రక్షణగా సాగాయి. రోబోటిక్ శునకాలు, మానవరహిత యుద్ధ వాహనాలు వాటిని అనుసరించాయి.
→ భారీ వాహనాలపై తరలివచ్చిన శక్తిబాణ్, దివ్యాస్త్ర తర్వాత తరపు అత్యాధునిక యుద్ధ సామర్థ్యానికి అద్దం పట్టాయి.
→ కొత్తగా ఏర్పడిన భైరవ్ పదాతి దళ బెటాలియన్ కవాతు ఆకట్టుకుంది. సంప్రదాయ పదాతి దళం, ప్రత్యేక దళాల మేలుకలయికగా దీన్ని రూపొందించారు.
→ నేవీ, వాయు సేన నుంచి 144 మంది చొప్పున యువ సిబ్బందితో జరిగిన కవాతులు అలరించాయి.
→ క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దికి చెందిన నావ థీమ్‌తో రూపొందించిన నావిక దళ శకటం ప్రధానాకర్షణగా నిలిచింది. 
→ డీఆర్‌డీఓ రూపొందించిన అత్యాధునిక హైపర్‌సోనిక్ గ్లైడ్ మిసైల్ ఎల్‌ఆర్–ఏఎస్‌హెచ్‌ఎంను అంతా ఆసక్తిగా తిలకించారు.
→ సీఆర్పీఎఫ్, సశస్త్ర సీమాబల్ డేర్‌డెవిల్ మోటార్‌సైకిల్ రైడర్ బృందాల సంయుక్త విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
→ ఇక ఆహూతులంతా ఆసక్తిగా ఎదురు చూసిన ఏరియల్ ఫ్లైపాస్ట్ విన్యాసాలు ఉర్రూతలూగించాయి. 29 విమానాలు ఇందులో పాల్గొన్నాయి. వాటిలో 16 యుద్ధ విమానాలు కాగా నాలుగు రవాణా విమానాలు, 9 హెలికాప్టర్లు.
→ రాఫెల్, మిగ్–29, సెఖోయ్–30 జాగ్వార్ యుద్ధ విమానాలు ఆపరేషన్ సిందూర్‌ను తలపించేలా స్పియర్‌హెడ్ ఆకృతిలో ఒళ్లు గగ్గుర్పొడిచే విన్యాసాలు ప్రదర్శించాయి. 
→ కర్తవ్య పథ్‌లో కవాతు చేసిన 30 శకటాలు దేశ సాంస్కృతిక ఘనతకు, వైవిధ్యానికి అద్దం పట్టాయి. వీటిలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి 17 కాగా, 19 కేంద్ర ప్రభుత్వ శాఖలు, త్రివిధ దళాలకు చెందినవి.
రక్షణ పాటవానికి అద్దం: మోదీ
గణతంత్ర వేడుకలు భారత రక్షణ పాటవానికి అద్దం పట్టాయని మోదీ పేర్కొన్నారు. మన సన్నద్ధతకు, సాంకేతిక సామర్థ్యానికి, పౌరుల భద్రత పట్ల తిరుగులేని చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచాయని ఎక్స్ పోస్టులో ఆయన హర్షం వెలిబుచ్చారు.
‘‘ఈ వేడుకల్లో ఈయూ అధినేతలకు ఆతిథ్యమివ్వడం భారత్‌కు గొప్ప గౌరవం. నానాటికీ బలపడుతున్న భారత్, ఈయూ బంధానికి ఇది అద్దం పట్టింది’’అన్నారు.
ఎన్నెన్నో ‘తొలి’ఘనతలు!
ఈ గణతంత్ర వేడుకలు పలు ‘తొలిసారి’ఘనతలకు వేదికగా నిలిచాయి...
→ కొత్తగా ఏర్పాటైన పదాతి దళ భైరవ్ లైట్ కమెండో బెటాలియన్, శక్తిబాణ్ రెజిమెంట్, సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ వ్యవస్థ వంటివెన్నో వీటిలో ఉన్నాయి. శక్తిబాణ్‌ను డ్రోన్, కౌంటర్ డ్రోన్ రెజిమెంట్‌గా తీర్చిదిద్దారు.
→ రెండు మూపురాల బ్యాక్ట్రియన్ ఒంటెలు, జన్‌స్కార్ అశ్వాలు తొలిసారి పరేడ్‌లో పాలుపంచుకున్నాయి.
→ 61వ అశ్వికదళ సభ్యులు కూడా తొలిసారి కవాతులో పాల్గొన్నారు.
→ లద్దాఖ్, డోగ్రా, అరుణాచల్, కుమాయూన్, ఘడ్వాల్, సిక్కిం స్కౌట్స్ సభ్యులతో కూడిన మిశ్రమ స్కౌట్స్ దళం కూడా సైనిక దుస్తుల్లో తొలిసారిగా అలరించింది. 
→ డీఆర్‌డీవో రూపొందించిన నౌకా విధ్వంసక హైపర్‌సోనిక్ క్షిపణి ఎల్‌ఆర్–ఏఎస్‌హెచ్‌ఎం కూడా తొలిసారి పరేడ్‌లో పాల్గొంది.
→ రీమౌంట్ వెటర్నరీ కార్ప్స్ తరఫున సైనిక శునకాలు, డేగలు కూడా ఈసారి పరేడ్‌లో భాగస్వాములు కావడం విశేషం.
→ సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో సాగిన కవాతుకు మహిళా సైనికాధికారి సారథ్యం వహించారు.
ఈయూ సైనిక దళాలు
ఈసారి గణతంత్ర కవాతులో యూరోపియన్ యూనియన్‌కు చెందిన సైనిక దళాలు కూడా పాల్గొనడం విశేషం. ఈయూ సైనిక పతాకతో పాటు ఆపరేషన్ అట్లాంటా, ఆస్పిడెస్ నేవీ ఆపరేషన్ల తాలూకు పతకాలతో అలరించాయి. యూరప్ బయట ఇలాంటి వేడుకల్లో ఈయూ దళాలు పాల్గొనడం ఇదే తొలిసారి!
నారీ శక్తిని చాటిన సిమ్రన్
సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రన్ బాల ఈసారి గణతంత్ర పరేడ్‌లో నారీ శక్తికి ప్రతీకగా నిలిచారు. పూర్తిగా పురుషులతో కూడిన 147 మంది సభ్యుల సీఆర్పీఎఫ్ దళానికి ఆమె సారథ్యం వహించి చరిత్ర సృష్టించారు. ‘దేశ్ కే హమ్ రక్షక్’గీతం నేపథ్యంలో విని్పస్తుండగా ఆమె నాయకత్వంలో సీఆర్పీఎఫ్ దళం కవాతు సాగింది. గణతంత్ర వేడుకల్లో పూర్తిగా పురుషులతో కూడిన సైనిక దళానికి మహిళా ఆఫీసర్ నాయకత్వం వహించడం ఇదే తొలిసారి. జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాకు చెందిన 26 ఏళ్ల సిమ్రన్ గతేడాదే సీఆరీ్పఎఫ్‌లో చేరారు. ఆ జిల్లా నుంచి ఆఫీసర్ హోదాలో అందులో చేరిన తొలి మహిళ కూడా ఆమే కావడం విశేషం. సిమ్రన్ స్వగ్రామం నౌషేరా నియంత్రణ రేఖకు కేవలం 11 కి.మీ. దూరంలోనే ఉంటుంది. ఆమె తాత కూడా సైన్యంలో పని చేశారు.
ఆకట్టుకున్న మోదీ తలపాగా
గణతంత్ర వేడుకల్లో ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఆకర్షణీయమైన తలపాగా అందరినీ ఆకట్టుకుంది. ఈసారి ఆయన బంగారు జరీతో నేసిన నెమలీక ముద్రలతో కూడిన ముదురు ఎరుపు రంగు, పసుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన తలపాగా ధరించారు. ముదురు నీలం, తెలుపు రంగుల కుర్తా పైజామా, తేల నీలం రంగు హాఫ్ జాకెట్ ధరించారు. పదేళ్లకు పైగా పంద్రాగస్టు, గణతంత్ర వేడుకల్లో మోదీ రంగుల తలపాగాలు ధరిస్తూ వస్తుండటం తెలిసిందే. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయన్ కూడా భారత సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయారు. సాధారణ ప్యాంటు, సూటుకు బదులుగా ఆమె ముదురు ఎరుపు, బంగారు రంగులతో కూడిన పట్టు బంద్‌గలా ధరించారు.
నదుల పేర్లు
ఈసారి గణతంత్ర వేడుకల్లో ఆహూతుల కోసం ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్లకు ఈసారి వీవీఐపీ, వీఐపీ వంటి పేర్లకు బదులుగా నదుల పేర్లు పెట్టడం విశేషం. బియాస్, బ్రహ్మపుత్ర, చంబల్, చీనాబ్, గండక్, గంగా, ఘగ్రా, గోదావరి, సింధు, జీలం, కావేరి, కోసీ, కృష్ణ, మహానది, నర్మద, పెన్నా, పెరియార్, రావి, సోన్, సట్లెజ్, తీస్థా, వైగై, యమున పేర్లతో ఎన్‌క్లోజర్లను రూపొందించారు. జనవరి 29న రాష్ట్రపతి కార్యాలయంలో జరిగే బీటింగ్ రిట్రీట్ వేడుకకు కూడా ఆహూతుల ఎన్‌క్లోజర్లకు వినూత్నంగా వేణువు, డమరుకం, ఎక్‌తారా, మృదంగం, నగాడా, పఖావజ్, సంతూర్, సారంగి, సరోద్, షెహనాయ్, సితార్, తబలా, వీణ వంటి భారత సంప్రదాయ సంగీత వాయిద్యాల పేర్లు పెట్టనున్నారు.
వందేమాతరం స్ఫూర్తి
ఈసారి వేడుకల్లో వందేమాతరం థీమ్ ప్రధానాకర్షణగా నిలిచింది. ఆ గేయంలోని తొలి చరణాలకు అద్దం పట్టే తేజేంద్రకుమార్ మిత్రా వంటి కళాకారుల పురాతన పెయింటింగుల నమూ నాలను ఆహూతుల ఎన్‌క్లోజర్లపై ప్రద ర్శించారు. జాతీయోద్యమంలో దేశమంతటా స్ఫూర్తి నింపిన ఈ గేయ రచనకు ఈ సంవత్సరమే 150 ఏళ్లు నిండటం తెలిసిందే. ఆ సందర్భంగా ‘150 ఏళ్ల వందేమాతరం’థీమ్‌కు గణతంత్ర వేడు కల్లో ప్రాధాన్యం దక్కింది. ఆహ్వానపత్రికల నుంచి పరేడ్ల దాకా అన్నింట్లోనూ వందేమాతరం లోగో దర్శనమిచ్చింది.


