breaking news
Antonio Costa
-
భారత్, ఈయూ చారిత్రక వాణిజ్య డీల్
న్యూఢిల్లీ: ఐరోపా దేశాల ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు చవగ్గా అందించే లక్ష్యంతో యూరోపియన్ యూనియన్‌తో భారత్ చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదుర్చుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాలతో ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం భేటీ తర్వాత అధికారికంగా ఎఫ్‌టీఏ ఒప్పందాన్ని ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఒప్పందానికి సంబంధించి ఉన్నతాధికారుల స్థాయి చర్చలు సోమవారం ముగిశాయని భారత వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ ప్రకటించారు. అయితే చర్చలు విజయవంతమయ్యాయని మంగళవారం అధికారికంగా భారత్–ఈయూ సదస్సులో అగ్రనేతలు ప్రకటించనున్నారు. ఉర్సులా, యూరోపియన్ యూనియన్ వాణిజ్య, ఆర్థిక భద్రతా విభాగ కమిషనర్ మారోస్ సెకోవిక్‌లతో ప్రధాని మోదీ విస్తృతస్థాయి చర్చల తర్వాత ఒప్పంద వివరాలను బహిర్గతం చేయనున్నట్లు తెలుస్తోంది. ముడి వ్రస్తాలు, తోలు, దుస్తులు, పాదరక్షలు, రత్నాలు, వజ్రాభరణాలు, కార్లు, వైన్ తయారీ పరిశ్రమల ఉత్పత్తులపై ఈయూ టారిఫ్‌లను పూర్తిగా తొలగించాలని భారత్ మొదట్నుంచీ డిమాండ్చేస్తోంది. ఈ మేరకు ఈయూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాణిజ్యం, రక్షణ, భద్రత, వాతావరణ మార్పులు, భూఅయస్కాంతాల వెలికితీత సంబంధ సంక్లిష్టమైన సాంకేతికతలు సహా పలు అంశాలపై ఒప్పందం కుదిరినట్లు సమాచారం. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈయూలోని 27 సభ్యదేశాలతో భారత్ మరింత విస్తృతమైన రక్షణ, భద్రత సహకారం ఉండేలా భద్రత, రక్షణ ఒప్పందం(ఎస్డీపీ) కుదుర్చుకోనున్నారు. ఎఫ్‌టీఏను ప్రకటించక ముందే రక్షణ ప్రణాళికా చట్రం, వ్యూహాత్మక ఎజెండాలను ఆవిష్కరించనున్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) ఒప్పందం కుదిరాక యూరోపియన్ యూనియన్‌లోని ‘సెక్యూరిటీ యాక్షన్ ఫర్ యూరప్(సేఫ్) కార్యక్రమంలో భారతీయ సంస్థలు చేరతాయి. తద్వారా యూరప్ మార్కెట్లోకి భారతీయ కంపెనీలు అడుగుపెడతాయి. దీంతోపాటు పారిశ్రామిక రక్షణ సహకారం బలోపేతం లక్ష్యంగా సెక్యూరిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్(ఎస్‌ఓఐఏ)ను కుదుర్చుకోనున్నారు. భారతీయ కారి్మకులను యూరప్‌లో అవకాశాలు పెంచేలా అవగాహన ఒప్పందం(ఎంఓయూ) చేసుకోనున్నారు. లగ్జరీ కార్లపై టారిఫ్ తగ్గే చాన్స్.. తమ విలాసవంత కార్లపై టారిఫ్‌ను భారత్ తగ్గించాలని ఈయూ దేశాలు కోరుతున్నాయి. దీంతో ఇరువైపులా డిమాండ్లు ఏమేరకు నెరవేరనున్నాయో మంగళవారంతో తేలిపోనుంది. మరోవైపు సేవారంగంలోనూ ఉదారవాద నిర్ణయాలను తీసుకోనున్నారు. అయితే యూరప్‌కు చెందిన లగ్జరీ కార్లపై దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించాలని భారత్ భావిస్తోందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం లగ్జరీ కార్లపై 110 శాతం టారిఫ్ విధిస్తుండగా ఇకపై కేవలం 40 శాతం టారిఫ్ విధించనున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్‌లో లగ్జరీ కార్ల సెగ్మెంట్ విపరీతంగా విస్తరించనుంది. ప్రసుత్తం కార్ల మార్కెట్లో విలాసవంత కార్ల మార్కెట్ కేవలం ఒక శాతం ఉండటం గమనార్హం. ఈ సెగ్మెంట్ వృద్ధికి విపరీతమైన అవకాశాలు ఉన్నాయి. 15 వేల యూరోల(రూ.16 లక్షలు) కంటే ధర ఎక్కువుండే కార్లకే ఈ తగ్గింపు వర్తింపజేయాలని యోచిస్తున్నారు. దీంతో ఫోక్స్‌వ్యాగన్, మెర్సిడెజ్‌బెంజ్, బీఎండబ్ల్యూ కార్ల మార్కెట్ మరింత విస్తృతంకానుంది. భవిష్యత్తులో ఈ 40 శాతం టారిఫ్‌లను 10 శాతం స్థాయికి తగ్గిస్తారని తెలుస్తోంది. 136.53 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం.. ప్రస్తుతం ఈయూ మద్యం ఉత్పత్తులపై భారత్ 100–125 శాతం టారిఫ్ విధిస్తోంది. ఈయూ ఆటోమొబైల్ విడిభాగాలపై భారత్ 35.5 శాతం, ప్లాస్టిక్‌లపై 10.4 శాతం, రసాయనాలు, ఫార్మాసూటికల్స్‌పై 9.9 శాతం టారిఫ్ విధిస్తోంది. ఎఫ్‌టీఏ అమల్లోకి వచ్చాక ఇన్నాళ్లూ ఇరువైపులా వాణిజ్యం జరిగే వస్తూత్పత్తుల్లో 90 శాతం ఉత్పత్తులపై టారిఫ్‌ను భారీగా తగ్గించడమో లేదా పూర్తిగా తొలగించడమో చేయాలి. అయితే తమ బీఫ్, చక్కెర, బియ్యం మార్కెట్ల రక్షణకు ఈయూ ప్రాధాన్యతనిస్తోంది. భారత్ తమ పాడి ఉత్పత్తులు, రైతుల ప్రయోజనాల పరిరక్షణకు భారత్ పాటుపడుతోంది. ప్రస్తుతం ఈయూ దేశాలతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 2024–25 ఆర్థికసంవత్సరంలో 136.53 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇందులో భారత్ నుంచి 75.85 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమ తులు ఉండగా భారత్‌కు 60.68 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు ఉన్నాయి. 2024–25లో భారత్ 15.17 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులును సాధించింది. భారత ఎగుమతుల్లో ఈయూ దేశాలకు 17 శాతం వస్తూత్పత్తులు వెళ్తున్నాయి. -
సందడిగా ‘ఎట్ హోం’
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోం’కార్యక్రమం సోమవారం సందడిగా జరిగింది. గణతంత్ర వేడుకల్లో విశిష్ట అతిథులుగా పాల్గొన్న యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాండెర్ లెయన్ తదితరులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘనంగా విందు ఇచ్చారు. ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ తదితరులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విందులో ఈశాన్య భారతానికి చెందిన రకరకాల వంటకాలు ఆహూతులను అలరించాయి. ఈశాన్య సంప్రదాయానికి అద్దం పట్టే పలు సాంస్కృతిక కళారూపాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. వాటిని అతిథులు ఎంతగానో ఆస్వాదించినట్టు రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ముఖ్య అతిథులతో కలిసి ఈశాన్య కళాకారులతో ముర్ము, రాధాకృష్ణన్, మోదీ ఈ సందర్భంగా ఫొటోలకు పోజులిచ్చారు. -
గణతంత్ర వేడుకల్లో ‘సిందూర’ స్ఫూర్తి!
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ శకటం, ఆ పోరాటంలో పాక్ పీచమణచిన అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు, అతి శక్తిమంతమైన క్షిపణులు, కొత్త తరం యుద్ధ విమానాలు, సరికొత్త సైనిక విభాగాలు... ఇలా అమేయమైన భారత సైనిక శక్తిని 77వ గణతంత్ర దిన వేడుకలు కళ్లకు కట్టాయి. సిందూర్ థీమ్‌తో రూపొందిన భారత సైన్య శకటం అందరినీ ఆకట్టుకుంది. ఇక దేశీయంగా రూపొందించిన పలు ప్రళయ భీకర ఆయుధాలు ఆహూతులను ఆద్యంతం అలరించాయి. ముఖ్యంగా 150 ఏళ్ల వందేమాతరం థీమ్ ఉర్రూతలూగించింది. సోమవారం ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకలు ఇందుకు వేదికగా నిలిచాయి. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాండెర్ లెయన్ ఈసారి గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వారిని వెంటబెట్టుకుని సంప్రదాయ గుర్రపు బగ్గీలో వేడుకలకు విచ్చేశారు. అనంతరం త్రివిధ దళాధిపతి హోదాలో సైనిక వందనం అందుకున్నారు. ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, త్రివిధ దళాధిపతులు, సైనిక, ప్రభుత్వ ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. పలు రంగాల ప్రముఖులతో పాటు మొత్తం 10 వేల మందికి పైగా వేడుకలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ‘సారే జహా సె అచ్ఛా’, ‘కదం కదం బఢాయె జా’వంటి దేశభక్తి గీతాలతో పాటు వందేమాతరం అందరిలోనూ స్ఫూర్తి నింపాయి. 90 నిమిషాల పాటు జరిగిన వేడుకలో 18 సైనిక దళాలు, 13 సైనిక బ్యాండ్లు అలరించాయి. వేడుక అనంతరం రాష్ట్రపతి ప్రత్యేక అతిథులతో పాటుగా గుర్రపు బగ్గీలోనే వెనుదిరగడం విశేషం. సాయుధ పాటవం సాహో... త్రివిధ దళాల సైనిక పాటవ ప్రదర్శనకు గణతంత్ర వేడుకలు వేదికగా నిలిచాయి. గణతంత్ర పరేడ్‌కు పరేడ్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ భవనీశ్ కుమార్ సారథ్యం వహించారు... → బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్షిపణులు, ఆకాశ్ ఆయుధ వ్యవస్థలు, సూర్యాస్త్ర యూనివర్సల్ రాకెట్ లాంచింగ్ వ్యవస్థ, అర్జున్ యుద్ధ ట్యాంకు, ధనుష్ ఆర్లిటరీ గన్స్, దివ్యాస్త్ర బ్యాటరీ వంటివి అందరినీ అలరించాయి. → 100 మందికి పైగా కళాకారులు ప్రదర్శించిన స్ఫూర్తిదాయకమైన ‘భిన్నత్వంలో ఏకత్వం’థీమ్ ఆకట్టుకుంది. → స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారిగా సైన్యం ‘యుద్ధ వ్యూహ అమరిక’ద్వారా తన పాటవాన్ని పూర్తిస్థాయిలో ప్రదర్శించడం విశేషం. → ఆ క్రమంలో, గత మేలో పాక్ పీచమణచిన ఆపరేషన్ సిందూర్‌లో కీలకపాత్ర పోషించిన క్షిపణులు, యుద్ధ విమానాలు, ఆయుధ వ్యవస్థలను కళ్లకు కడుతూ రూపొందించిన త్రివిధ దళాల శకటం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. → ఇంటిగ్రేటెడ్ ఆపరేషనల్ సెంటర్, ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో శకటం ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. సిందూర్ ఆపరేషన్ వేళ బ్రహ్మోస్ క్షిపణులు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర వ్యవస్థలతో పాటు పాక్‌లోని కీలక నగరాల్లో ఎయిర్ బేస్‌లను నేలమట్టం చేయడం, ఎస్–400 డిఫెన్స్ వ్యవస్థలు పాక్దాడులను పూర్తిస్థాయిలో అడ్డుకోవడం తెలిసిందే. → టీ–90 భీష్మ, అర్జున్ యుద్ధట్యాంకులు, బీఎంపీ–2 పదాతి దళ వాహనం, నాగ్ క్షిపణి వ్యవస్థ ముందు నడుస్తుండగా తేలికరకం అత్యాధునిక ధ్రువ్, అపాచీ ఏహెచ్–64ఈ, ప్రచండ్ హెలికాప్టర్లు వాటికి రక్షణగా సాగాయి. రోబోటిక్ శునకాలు, మానవరహిత యుద్ధ వాహనాలు వాటిని అనుసరించాయి. → భారీ వాహనాలపై తరలివచ్చిన శక్తిబాణ్, దివ్యాస్త్ర తర్వాత తరపు అత్యాధునిక యుద్ధ సామర్థ్యానికి అద్దం పట్టాయి. → కొత్తగా ఏర్పడిన భైరవ్ పదాతి దళ బెటాలియన్ కవాతు ఆకట్టుకుంది. సంప్రదాయ పదాతి దళం, ప్రత్యేక దళాల మేలుకలయికగా దీన్ని రూపొందించారు. → నేవీ, వాయు సేన నుంచి 144 మంది చొప్పున యువ సిబ్బందితో జరిగిన కవాతులు అలరించాయి. → క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దికి చెందిన నావ థీమ్‌తో రూపొందించిన నావిక దళ శకటం ప్రధానాకర్షణగా నిలిచింది. → డీఆర్డీఓ రూపొందించిన అత్యాధునిక హైపర్సోనిక్ గ్లైడ్ మిసైల్ ఎల్ఆర్–ఏఎస్హెచ్ఎంను అంతా ఆసక్తిగా తిలకించారు. → సీఆర్పీఎఫ్, సశస్త్ర సీమాబల్ డేర్‌డెవిల్ మోటార్‌సైకిల్ రైడర్ బృందాల సంయుక్త విన్యాసాలు ఆకట్టుకున్నాయి. → ఇక ఆహూతులంతా ఆసక్తిగా ఎదురు చూసిన ఏరియల్ ఫ్లైపాస్ట్ విన్యాసాలు ఉర్రూతలూగించాయి. 29 విమానాలు ఇందులో పాల్గొన్నాయి. వాటిలో 16 యుద్ధ విమానాలు కాగా నాలుగు రవాణా విమానాలు, 9 హెలికాప్టర్లు. → రాఫెల్, మిగ్–29, సెఖోయ్–30 జాగ్వార్ యుద్ధ విమానాలు ఆపరేషన్ సిందూర్‌ను తలపించేలా స్పియర్‌హెడ్ ఆకృతిలో ఒళ్లు గగ్గుర్పొడిచే విన్యాసాలు ప్రదర్శించాయి. → కర్తవ్య పథ్‌లో కవాతు చేసిన 30 శకటాలు దేశ సాంస్కృతిక ఘనతకు, వైవిధ్యానికి అద్దం పట్టాయి. వీటిలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి 17 కాగా, 19 కేంద్ర ప్రభుత్వ శాఖలు, త్రివిధ దళాలకు చెందినవి. రక్షణ పాటవానికి అద్దం: మోదీ గణతంత్ర వేడుకలు భారత రక్షణ పాటవానికి అద్దం పట్టాయని మోదీ పేర్కొన్నారు. మన సన్నద్ధతకు, సాంకేతిక సామర్థ్యానికి, పౌరుల భద్రత పట్ల తిరుగులేని చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచాయని ఎక్స్ పోస్టులో ఆయన హర్షం వెలిబుచ్చారు. ‘‘ఈ వేడుకల్లో ఈయూ అధినేతలకు ఆతిథ్యమివ్వడం భారత్‌కు గొప్ప గౌరవం. నానాటికీ బలపడుతున్న భారత్, ఈయూ బంధానికి ఇది అద్దం పట్టింది’’అన్నారు.ఎన్నెన్నో ‘తొలి’ఘనతలు! ఈ గణతంత్ర వేడుకలు పలు ‘తొలిసారి’ఘనతలకు వేదికగా నిలిచాయి... → కొత్తగా ఏర్పాటైన పదాతి దళ భైరవ్ లైట్ కమెండో బెటాలియన్, శక్తిబాణ్ రెజిమెంట్, సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ వ్యవస్థ వంటివెన్నో వీటిలో ఉన్నాయి. శక్తిబాణ్ను డ్రోన్, కౌంటర్ డ్రోన్ రెజిమెంట్‌గా తీర్చిదిద్దారు. → రెండు మూపురాల బ్యాక్ట్రియన్ ఒంటెలు, జన్స్కార్ అశ్వాలు తొలిసారి పరేడ్‌లో పాలుపంచుకున్నాయి. → 61వ అశ్వికదళ సభ్యులు కూడా తొలిసారి కవాతులో పాల్గొన్నారు. → లద్దాఖ్, డోగ్రా, అరుణాచల్, కుమాయూన్, ఘడ్వాల్, సిక్కిం స్కౌట్స్ సభ్యులతో కూడిన మిశ్రమ స్కౌట్స్ దళం కూడా సైనిక దుస్తుల్లో తొలిసారిగా అలరించింది. → డీఆర్డీవో రూపొందించిన నౌకా విధ్వంసక హైపర్సోనిక్ క్షిపణి ఎల్ఆర్–ఏఎస్హెచ్ఎం కూడా తొలిసారి పరేడ్‌లో పాల్గొంది. → రీమౌంట్ వెటర్నరీ కార్ప్స్ తరఫున సైనిక శునకాలు, డేగలు కూడా ఈసారి పరేడ్‌లో భాగస్వాములు కావడం విశేషం. → సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో సాగిన కవాతుకు మహిళా సైనికాధికారి సారథ్యం వహించారు. ఈయూ సైనిక దళాలు ఈసారి గణతంత్ర కవాతులో యూరోపియన్ యూనియన్‌కు చెందిన సైనిక దళాలు కూడా పాల్గొనడం విశేషం. ఈయూ సైనిక పతాకతో పాటు ఆపరేషన్ అట్లాంటా, ఆస్పిడెస్ నేవీ ఆపరేషన్ల తాలూకు పతకాలతో అలరించాయి. యూరప్ బయట ఇలాంటి వేడుకల్లో ఈయూ దళాలు పాల్గొనడం ఇదే తొలిసారి!నారీ శక్తిని చాటిన సిమ్రన్ సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రన్ బాల ఈసారి గణతంత్ర పరేడ్‌లో నారీ శక్తికి ప్రతీకగా నిలిచారు. పూర్తిగా పురుషులతో కూడిన 147 మంది సభ్యుల సీఆర్పీఎఫ్ దళానికి ఆమె సారథ్యం వహించి చరిత్ర సృష్టించారు. ‘దేశ్ కే హమ్ రక్షక్’గీతం నేపథ్యంలో విని్పస్తుండగా ఆమె నాయకత్వంలో సీఆర్పీఎఫ్ దళం కవాతు సాగింది. గణతంత్ర వేడుకల్లో పూర్తిగా పురుషులతో కూడిన సైనిక దళానికి మహిళా ఆఫీసర్ నాయకత్వం వహించడం ఇదే తొలిసారి. జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాకు చెందిన 26 ఏళ్ల సిమ్రన్ గతేడాదే సీఆరీ్పఎఫ్లో చేరారు. ఆ జిల్లా నుంచి ఆఫీసర్ హోదాలో అందులో చేరిన తొలి మహిళ కూడా ఆమే కావడం విశేషం. సిమ్రన్ స్వగ్రామం నౌషేరా నియంత్రణ రేఖకు కేవలం 11 కి.మీ. దూరంలోనే ఉంటుంది. ఆమె తాత కూడా సైన్యంలో పని చేశారు.ఆకట్టుకున్న మోదీ తలపాగా గణతంత్ర వేడుకల్లో ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఆకర్షణీయమైన తలపాగా అందరినీ ఆకట్టుకుంది. ఈసారి ఆయన బంగారు జరీతో నేసిన నెమలీక ముద్రలతో కూడిన ముదురు ఎరుపు రంగు, పసుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన తలపాగా ధరించారు. ముదురు నీలం, తెలుపు రంగుల కుర్తా పైజామా, తేల నీలం రంగు హాఫ్ జాకెట్ ధరించారు. పదేళ్లకు పైగా పంద్రాగస్టు, గణతంత్ర వేడుకల్లో మోదీ రంగుల తలపాగాలు ధరిస్తూ వస్తుండటం తెలిసిందే. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయన్ కూడా భారత సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయారు. సాధారణ ప్యాంటు, సూటుకు బదులుగా ఆమె ముదురు ఎరుపు, బంగారు రంగులతో కూడిన పట్టు బంద్గలా ధరించారు. నదుల పేర్లు ఈసారి గణతంత్ర వేడుకల్లో ఆహూతుల కోసం ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లకు ఈసారి వీవీఐపీ, వీఐపీ వంటి పేర్లకు బదులుగా నదుల పేర్లు పెట్టడం విశేషం. బియాస్, బ్రహ్మపుత్ర, చంబల్, చీనాబ్, గండక్, గంగా, ఘగ్రా, గోదావరి, సింధు, జీలం, కావేరి, కోసీ, కృష్ణ, మహానది, నర్మద, పెన్నా, పెరియార్, రావి, సోన్, సట్లెజ్, తీస్థా, వైగై, యమున పేర్లతో ఎన్క్లోజర్లను రూపొందించారు. జనవరి 29న రాష్ట్రపతి కార్యాలయంలో జరిగే బీటింగ్ రిట్రీట్ వేడుకకు కూడా ఆహూతుల ఎన్క్లోజర్లకు వినూత్నంగా వేణువు, డమరుకం, ఎక్తారా, మృదంగం, నగాడా, పఖావజ్, సంతూర్, సారంగి, సరోద్, షెహనాయ్, సితార్, తబలా, వీణ వంటి భారత సంప్రదాయ సంగీత వాయిద్యాల పేర్లు పెట్టనున్నారు.వందేమాతరం స్ఫూర్తి ఈసారి వేడుకల్లో వందేమాతరం థీమ్ ప్రధానాకర్షణగా నిలిచింది. ఆ గేయంలోని తొలి చరణాలకు అద్దం పట్టే తేజేంద్రకుమార్ మిత్రా వంటి కళాకారుల పురాతన పెయింటింగుల నమూ నాలను ఆహూతుల ఎన్క్లోజర్లపై ప్రద ర్శించారు. జాతీయోద్యమంలో దేశమంతటా స్ఫూర్తి నింపిన ఈ గేయ రచనకు ఈ సంవత్సరమే 150 ఏళ్లు నిండటం తెలిసిందే. ఆ సందర్భంగా ‘150 ఏళ్ల వందేమాతరం’థీమ్‌కు గణతంత్ర వేడు కల్లో ప్రాధాన్యం దక్కింది. ఆహ్వానపత్రికల నుంచి పరేడ్ల దాకా అన్నింట్లోనూ వందేమాతరం లోగో దర్శనమిచ్చింది. -
మన తక్షణ కర్తవ్యమేంటి?
బ్రస్సెల్స్: గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ మొండిపట్టు పట్టడంతో తమ తదుపరి కార్యాచరణపై సమాలోచనలు జరిపేందుకు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అత్యవసరంగా సమావేశమయ్యాయి. గురువారం బ్రస్సెల్స్‌లో యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా సారథ్యంలో ఐరోపా మండలి సమావేశాలు ఆరంభమయ్యాయి. డెన్మార్క్ విషయంలో తమకు మద్దతివ్వని ఏడు యూరోపియన్ దేశాలపై 10 శాతం అదనపు సుంకాలను విధిస్తానన్న తన నిర్ణయం నుంచి ట్రంప్ అనూహ్యంగా వెనక్కి తగ్గడంతో ఆయా దేశాలు కాస్తంత ఊపిరిపీల్చుకున్న తరుణంలో ఈ సమావేశాలు జరగడం గమనార్హం. ట్రంప్ శాంతి మండలిలో చేరేందుకు కొన్ని యూరప్‌దేశాలు విముఖత వ్యక్తంచేశాయి. గ్రీన్లాండ్ విషయంలోనూ ట్రంప్‌తో విబేధించాయి. ఈ నేపథ్యంలో ఇకమీదట అమెరికాతో ఏదైనా తేల్చుకునేందుకు ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవాలని, ఐక్యంగానే ముందడుగు వేయాలని యూరోపియన్ కౌన్సిల్ సమావేశంలో సభ్యదేశాలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. -
పోర్చుగల్‌లో సోషలిస్టుల గెలుపు
లిస్బన్: పోర్చుగల్‌లోని లెఫ్టిస్టు ఆలోచనాధోరణితో కూడిన సోషలిస్ట్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోమారు విజయం సాధించింది. కోవిడ్‌తో కునారిల్లిన పోర్చుగల్ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు యూరోపియన్ యూనియన్ వందల కోట్ల యూరోల సాయాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సోషలిస్టుపార్టీ మరోమారు విజయదుందుభి మోగించింది. కరోనా వైరస్ కేసుల పెరుగుదల సమయంలో జరిగిన ఈ ఎన్నికలలో 230 సీట్ల పార్లమెంటులో సోషలిస్టులు 106 సీట్లు గెలుచుకున్నారు. ఆదివారానికి ఎన్నికల్లో 98.5 శాతం ఓట్లను లెక్కించగా ఇందులో సోషలిస్టులు 41 శాతం ఓట్లను పొందారు. సోషలిస్టుల ప్రధాన ప్రత్యర్థి సెంటర్–రైట్ సోషల్ డెమోక్రటిక్ పార్టీకి 28 శాతం ఓట్లు వచ్చాయి. ఈ పార్టీ 65 పార్లమెంటరీ స్థానాలను గెలుచుకుంది. దేశంలోని 1.08 కోట్ల అర్హులైన ఓటర్లలో ఈ దఫా విదేశాల్లో నివసిస్తూ మెయిల్ ద్వారా ఓటు వేసే 15 లక్షల మంది ఓట్లను పరిగణనలోకి తీసుకోలేదు. మరోదఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న ప్రధాని ఆంటినో కోస్టాకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పోర్చుగల్‌తో బలమైన బంధాన్ని కోరుకుంటున్నామన్నారు. 116 సీట్ల మెజార్టీ.. పార్లమెంట్లో మెజార్టీకి అవసరమైన 116 సీట్లను సోషలిస్టులు గెలుచుకుంటారా? లేక చిన్న పార్టీల మద్దతు అవసరంపడుతుందా అనే విషయమై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. పోర్చుగీస్ టెలివిజన్ చానెళ్ల ప్రత్యేక ఎగ్జిట్ పోల్స్ మాత్రం సోషలిస్టులకు పూర్తి మెజార్టీ రావచ్చని అంచనా వేశాయి. పోర్చుగల్‌లో కొత్త ప్రభుత్వంపై అంచనాలు అధికంగా ఉన్నాయి. పశ్చిమ యూరప్‌లో పేదదైన ఈ దేశానికి ఈయూ 5000 కోట్ల డాలర్ల సాయం అందించనుంది. ఈ మొత్తంలో మూడింట రెండు వంతులు ప్రధాన మౌలిక సదుపాయాలు కోసం ఉద్దేశించారు. మిగిలిన మొత్తాన్ని ప్రైవేట్ కంపెనీలకు అందిస్తారు. పార్లమెంట్లో పూర్తి మెజార్టీ ఉన్న ప్రభుత్వం ఏర్పడితే ఈ నిధుల కేటాయింపు, వ్యయం సజావుగా సాగుతాయని నిపుణులు భావిస్తున్నారు. 2022 కోసం అప్పటి మైనారిటీ సోషలిస్ట్ ప్రభుత్వం రూపొందించిన వ్యయ ప్రణాళికను పార్లమెంటు గత నవంబర్‌లో తిరస్కరించింది. దీంతో నూతన వ్యయప్రణాళిక అమలుకు స్థిర ప్రభుత్వ అవసరం ఉంది. 2015లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి, వార్షిక బడ్జెట్‌ను ఆమోదానికి ప్రతిసారీ మిత్రపక్షాలైన లెఫ్ట్ బ్లాక్, పోర్చుగీస్ కమ్యూనిస్ట్ పార్టీల మద్దతుపై సోషలిస్టు పార్టీ ఆధారపడుతోంది. కానీ రెండు నెలల క్రితం ఈపార్టీల మధ్య విభేదాలు ముదిరాయి. దీంతో పార్లమెంట్లో సోషలిస్ట్ ప్రధాన మంత్రి ఆంటినో కోస్టాకు మెజార్టీ మద్దతు గగనమైంది. ఈ ఎన్నికల్లో మెజార్టీ సోషలిస్టులకు తగినంత బలాన్ని ఇవ్వనుంది. చేగా.. గెలుపు పోర్చుగల్‌లో వరుసగా రెండుమార్లు సోషలిస్టు పార్టీనే అధికారంలో ఉంది. దీని ప్రధాన ప్రత్యర్థి సోషల్ డెమొక్రాటిక్ పార్టీ. ఈ రెండు పార్టీలే దేశంలో దశాబ్దాలుగా అధికారం అనుభవిస్తున్నాయి. కానీ ఈసారి చేగా అనే పార్టీ సత్తా చూపింది. మూడు సంవత్సరాల క్రితం దేశంలో ఆవిర్భవించిన ప్రజాకర్షక మరియు జాతీయవాద పార్టీ చేగా (చాలు అని అర్థం) ఈ ఎన్నికల్లో 5– 8 శాతం ఓట్లను కొల్లగొట్టినట్లు ఆర్టీపీ పోల్స్ అంచనా వేసింది. దీంతో ఈ పార్టీకి పార్లమెంట్లో 13 సీట్లు దక్కవచ్చని అంచనా. గత ఎన్నికల్లో ఈ పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. పోర్చుగీస్ కమ్యూనిస్ట్ పార్టీకి 3– 5 శాతం ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో 46– 51 శాతం మధ్య పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో 48.6 శాతం పోలింగ్ నమోదైంది. కరోనా కారణంగా అర్హులైన ఓటర్లలో దాదాపు 10 లక్షలమంది ఇంకా ఐసోలేషన్‌లోనే ఉన్నారు. దేశాధ్యక్షుడు మార్సెలో రెబోలో డీసౌజా సైతం ఓటు వేయమని ప్రజలకు పిలుపునిచ్చారు. -
పోర్చుగల్ చేరుకున్న ప్రధాని మోదీ
లిస్బన్: మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందుగా పోర్చుగల్ చేరుకున్నారు. మోదీ శనివారం పోర్చుగల్ ప్రధానమంత్రి ఆంటోనియా కోస్టాతో భేటీ కానున్నారు. ఈ పర్యటన అనంతరం ఆయన 25, 26 తేదీల్లో అమెరికా, 27న నెదర్లాండ్స్‌లో పర్యటిస్తారు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు మంత్రులు, వివిధ సంస్థల సీఈవోలతో మోదీ భేటీ కానున్నారు. ఆ తర్వాత వాషింగ్టన్లో ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం అవుతారు. ఈ మూడు దేశాలతోనూ సంబంధాలు బలోపేతం చేయాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు మోదీ నిన్న ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
బెంగళూరులో ప్రధాని మోదీ
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలో పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో శనివారం అర్ధరాత్రి మోదీ బెంగళూరుకు చేరుకున్నారు. ఉన్నతాధికారులతో సహా ఎయిర్‌పోర్టుకు వచ్చిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. నేడు బెంగళూరులో రెండోరోజు జరగనున్న ప్రవాసి భారతీయ దివాస్ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించనున్నారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ ఈవెంట్ ఓవరాల్‌గా 14వ ప్రవాసీ భారతీయ దివాస్ కార్యక్రమం. 'యూత్ ప్రవాసీ భారతీయ దివాస్'గా ఈవెంట్‌కు నామకరణం చేశారు. స్టార్ట్ అప్ అండ్ ఇన్నోవేషన్, స్టార్ట్ అప్ ఇన్ కర్ణాటకతో పలు కార్యక్రమాలను మోదీ ప్రారంభిస్తారు. నేడు జరగనున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా విచ్చేయనున్నారు. భారతీయ మూలాలున్న ఆంటోనియో కోస్టా స్వతహాగా రచయిత. ఆంటోనియా తండ్రి ఓర్లాండో డీ కోస్టా.. గోవా ప్రాంతంలో జన్మించారు. నేటి ఈవెంట్లకు సంబంధించి కర్ణాటక అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సమాచారం. -
ప్రవాసీ దివస్‌కు అతిథిగా పోర్చుగీసు ప్రధాని
న్యూఢిల్లీ: జనవరి 7 నుంచి బెంగళూరులో నిర్వహించనున్న 14వ ప్రవాసీ భారతీయ దివస్‌కు ముఖ్య అతిథిగా భారతీయ మూలాలున్న పోర్చుగీసు ప్రధాని ఆంటోనియో కోస్టా హాజరుకానున్నారు. రచయిత అయిన ఆంటోనియా తండ్రి ఓర్లాండో డీ కోస్టా.. గోవా ప్రాంతంలో జన్మించారు. గతేడాది పోర్చుగీసు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆంటోనియా అక్కడి లిస్బన్ నగరంలో 1961లో జన్మించారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు 8న భారతీయ దివస్ వేడుకల్లో పాల్గొనేందుకు ఆంటోనియో అంగీకరించారని విదేశాంగ శాఖ సోమవారం వెల్లడించింది.


