విశిష్ట అతిథులకు రాష్ట్రపతి విందు
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోం’కార్యక్రమం సోమవారం సందడిగా జరిగింది. గణతంత్ర వేడుకల్లో విశిష్ట అతిథులుగా పాల్గొన్న యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాండెర్ లెయన్ తదితరులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘనంగా విందు ఇచ్చారు.
ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ తదితరులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
విందులో ఈశాన్య భారతానికి చెందిన రకరకాల వంటకాలు ఆహూతులను అలరించాయి. ఈశాన్య సంప్రదాయానికి అద్దం పట్టే పలు సాంస్కృతిక కళారూపాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. వాటిని అతిథులు ఎంతగానో ఆస్వాదించినట్టు రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ముఖ్య అతిథులతో కలిసి ఈశాన్య కళాకారులతో ముర్ము, రాధాకృష్ణన్, మోదీ ఈ సందర్భంగా ఫొటోలకు పోజులిచ్చారు.


