నేడు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలితో ప్రధాని మోదీ భేటీ
యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతోనూ చర్చలు
తర్వాత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై అధికారిక ప్రకటన
న్యూఢిల్లీ: ఐరోపా దేశాల ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు చవగ్గా అందించే లక్ష్యంతో యూరోపియన్ యూనియన్‌తో భారత్ చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదుర్చుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాలతో ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం భేటీ తర్వాత అధికారికంగా ఎఫ్‌టీఏ ఒప్పందాన్ని ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు సోమవారం వెల్లడించాయి.
ఒప్పందానికి సంబంధించి ఉన్నతాధికారుల స్థాయి చర్చలు సోమవారం ముగిశాయని భారత వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ ప్రకటించారు. అయితే చర్చలు విజయవంతమయ్యాయని మంగళవారం అధికారికంగా భారత్–ఈయూ సదస్సులో అగ్రనేతలు ప్రకటించనున్నారు. ఉర్సులా, యూరోపియన్ యూనియన్ వాణిజ్య, ఆర్థిక భద్రతా విభాగ కమిషనర్ మారోస్ సెకోవిక్‌లతో ప్రధాని మోదీ విస్తృతస్థాయి చర్చల తర్వాత ఒప్పంద వివరాలను బహిర్గతం చేయనున్నట్లు తెలుస్తోంది.
ముడి వ్రస్తాలు, తోలు, దుస్తులు, పాదరక్షలు, రత్నాలు, వజ్రాభరణాలు, కార్లు, వైన్ తయారీ పరిశ్రమల ఉత్పత్తులపై ఈయూ టారిఫ్‌లను పూర్తిగా తొలగించాలని భారత్ మొదట్నుంచీ డిమాండ్‌చేస్తోంది. ఈ మేరకు ఈయూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాణిజ్యం, రక్షణ, భద్రత, వాతావరణ మార్పులు, భూఅయస్కాంతాల వెలికితీత సంబంధ సంక్లిష్టమైన సాంకేతికతలు సహా పలు అంశాలపై ఒప్పందం కుదిరినట్లు సమాచారం. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈయూలోని 27 సభ్యదేశాలతో భారత్ మరింత విస్తృతమైన రక్షణ, భద్రత సహకారం ఉండేలా భద్రత, రక్షణ ఒప్పందం(ఎస్‌డీపీ) కుదుర్చుకోనున్నారు.
ఎఫ్‌టీఏను ప్రకటించక ముందే రక్షణ ప్రణాళికా చట్రం, వ్యూహాత్మక ఎజెండాలను ఆవిష్కరించనున్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) ఒప్పందం కుదిరాక యూరోపియన్ యూనియన్‌లోని ‘సెక్యూరిటీ యాక్షన్ ఫర్ యూరప్(సేఫ్) కార్యక్రమంలో భారతీయ సంస్థలు చేరతాయి. తద్వారా యూరప్ మార్కెట్లోకి భారతీయ కంపెనీలు అడుగుపెడతాయి. దీంతోపాటు పారిశ్రామిక రక్షణ సహకారం బలోపేతం లక్ష్యంగా సెక్యూరిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్(ఎస్‌ఓఐఏ)ను కుదుర్చుకోనున్నారు. భారతీయ కారి్మకులను యూరప్‌లో అవకాశాలు పెంచేలా అవగాహన ఒప్పందం(ఎంఓయూ) చేసుకోనున్నారు.
లగ్జరీ కార్లపై టారిఫ్ తగ్గే చాన్స్..
తమ విలాసవంత కార్లపై టారిఫ్‌ను భారత్ తగ్గించాలని ఈయూ దేశాలు కోరుతున్నాయి. దీంతో ఇరువైపులా డిమాండ్లు ఏమేరకు నెరవేరనున్నాయో మంగళవారంతో తేలిపోనుంది. మరోవైపు సేవారంగంలోనూ ఉదారవాద నిర్ణయాలను తీసుకోనున్నారు. అయితే యూరప్‌కు చెందిన లగ్జరీ కార్లపై దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించాలని భారత్ భావిస్తోందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం లగ్జరీ కార్లపై 110 శాతం టారిఫ్ విధిస్తుండగా ఇకపై కేవలం 40 శాతం టారిఫ్ విధించనున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్‌లో లగ్జరీ కార్ల సెగ్మెంట్ విపరీతంగా విస్తరించనుంది. ప్రసుత్తం కార్ల మార్కెట్లో విలాసవంత కార్ల మార్కెట్ కేవలం ఒక శాతం ఉండటం గమనార్హం. ఈ సెగ్మెంట్ వృద్ధికి విపరీతమైన అవకాశాలు ఉన్నాయి. 15 వేల యూరోల(రూ.16 లక్షలు) కంటే ధర ఎక్కువుండే కార్లకే ఈ తగ్గింపు వర్తింపజేయాలని యోచిస్తున్నారు. దీంతో ఫోక్స్‌వ్యాగన్, మెర్సిడెజ్‌బెంజ్, బీఎండబ్ల్యూ కార్ల మార్కెట్ మరింత విస్తృతంకానుంది. భవిష్యత్తులో ఈ 40 శాతం టారిఫ్‌లను 10 శాతం స్థాయికి తగ్గిస్తారని తెలుస్తోంది.
136.53 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం..
ప్రస్తుతం ఈయూ మద్యం ఉత్పత్తులపై భారత్ 100–125 శాతం టారిఫ్ విధిస్తోంది. ఈయూ ఆటోమొబైల్ విడిభాగాలపై భారత్ 35.5 శాతం, ప్లాస్టిక్‌లపై 10.4 శాతం, రసాయనాలు, ఫార్మాసూటికల్స్‌పై 9.9 శాతం టారిఫ్ విధిస్తోంది. ఎఫ్‌టీఏ అమల్లోకి వచ్చాక ఇన్నాళ్లూ ఇరువైపులా వాణిజ్యం జరిగే వస్తూత్పత్తుల్లో 90 శాతం ఉత్పత్తులపై టారిఫ్‌ను భారీగా తగ్గించడమో లేదా పూర్తిగా తొలగించడమో చేయాలి. అయితే తమ బీఫ్, చక్కెర, బియ్యం మార్కెట్ల రక్షణకు ఈయూ ప్రాధాన్యతనిస్తోంది. భారత్ తమ పాడి ఉత్పత్తులు, రైతుల ప్రయోజనాల పరిరక్షణకు భారత్ పాటుపడుతోంది. ప్రస్తుతం ఈయూ దేశాలతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 2024–25 ఆర్థికసంవత్సరంలో 136.53 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇందులో భారత్ నుంచి 75.85 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమ తులు ఉండగా భారత్‌కు 60.68 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు ఉన్నాయి. 2024–25లో భారత్ 15.17 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులును సాధించింది. భారత ఎగుమతుల్లో ఈయూ దేశాలకు 17 శాతం వస్తూత్పత్తులు వెళ్తున్నాయి.


