దీనిని అన్ని రాష్ట్రాలు అమలుచేసేలా కేంద్రం చొరవ తీసుకోవాలి
ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటుచేసి చర్చించాలి
ప్రస్తుతం 12 రాష్ట్రాలు మాత్రమే ఈ చట్టం అమలుకు ముందుకొచ్చాయి
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ 154వ స్థానంలో ఉంది
ఇలాంటి ప్రగతిశీల చట్టాలే పెట్టుబడులకు కీలకం
వైఎస్ జగన్ సీఎంగా ఉండగా ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు
చంద్రబాబు ప్రభుత్వం రాగానే రద్దుచేశారు
ఈ చట్టంపై రాష్ట్రాలకు స్పష్టమైన దిశానిర్దేశం చేయాలి
ప్రధాని మోదీకి మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు లేఖ
సాక్షి, అమరావతి: అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దే క్రమంలో ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని అమలుచేయడం జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశంగా రాష్ట్రాలకు సూచించాలని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తిచేశారు. ప్రపంచంలో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారుచేయడానికి ఇది అత్యావశ్యకమని తెలిపారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని కేంద్రమే సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం, నాడు జగన్ ప్రభుత్వం ఈ చట్టాన్ని ముందుకు తీసుకెళ్లాయి. ఇంత గొప్ప చట్టంపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సమావేశం నిర్వహించి ఈ చట్టం అమలును సమీక్షించాలని ప్రధాని కోరారు. లేనిపక్షంలో ఒక కాన్ఫరెన్స్ ద్వారా ఈ అంశాన్ని చర్చించడానికి ఆదేశించాల న్నారు.
ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రాధాన్యత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఏపీలో అది అమలుకావడం, దాని ప్రాధాన్యతను గుర్తించకుండా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దాన్ని రద్దుచేయడం తదితర అంశాలపై సోమవారం ధర్మాన ప్రధానికి లేఖ రాశారు. అందులో ఆయన పేర్కొన్న అంశాలు.. దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా మీరు ప్రారంభించిన ఆత్మనిర్భర్, వికసిత్ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక పథకాలు ప్రజలకు వరంగా నిలు స్తున్నాయి. ఆ లక్ష్యసాధన దిశగా 2020 ఏప్రిల్ 24న రూ.566.23 కోట్లతో స్వామిత్వ పథకాన్ని ప్రారంభించి 1.61 లక్షల గ్రామాల్లో 2.42 కోట్ల ప్రాపర్టీ కార్డుల పంపిణీ, 3.20 లక్షల గ్రామాల్లో డ్రోన్ సర్వే విజయవంతంగా పూర్తిచేశారు. జాతీయ భూ రికార్డుల ఆధునీకరణ, మోడరనైజేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేశారు. నాలుగు దశాబ్దాల ప్రజా జీవితంలో భూమి అనే అంశంపై మీరు చేసిన కృషి గురించి నాకు స్పష్టమైన అవగాహన ఉంది.
రాష్ట్రాలకు ముసాయిదా చట్టం..
దేశ, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడానికి, వివాదాల శాతాన్ని తగ్గించడానికి.. భూ రికార్డులను ఆధునీకరించాల్సిన అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. నీతి ఆయోగ్‌తో కలిసి ముసాయిదా చట్టాన్ని రూపొందించి అన్ని రాష్ట్రాలకు పంపించింది. ప్రస్తుతమున్న భావనాత్మక హక్కుల (ప్రిజెంటివ్) స్థానంలో నిర్ధారిత హక్కుల (కన్‌క్లూజివ్) వ్యవస్థను తీసుకురావడానికి రాష్ట్రాలను ప్రోత్సహించింది. భూ సమస్యలు, వివాదాలు పరిష్కరించి దేశంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం సృష్టించడానికి మీ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
జగన్ చట్టం తెస్తే చంద్రబాబు రద్దుచేశారు
మీ ప్రభుత్వ లక్ష్యాలు, దార్శనికతకు అనుగుణంగా ఏపీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏపీ ల్యాండ్ టైట్లింగ్ చట్టం 2023 (యాక్ట్ ఆఫ్ 27 ఆఫ్ 2023) అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, 2024లో చంద్రబాబు ప్రభుత్వం ఈ చట్టం అవసరాన్ని విస్మరిస్తూ దాన్ని ఉపసంహరించుకుని రద్దుచేసింది. తద్వారా వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సర్వేలో మన దేశం 154వ స్థానంలో ఉందనే సత్యాన్ని.. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్, వికసిత్ భారత్ వంటి ప్రతిష్టాత్మక పథకాలకు ఇలాంటి ప్రగతిశీల చట్టం అవసరాన్ని విస్మరించింది.
ప్రస్తుతం నీతి ఆయోగ్ సూచించిన ఈ ముసాయిదా బిల్లును చట్టంగా చేయడానికి 12 రాష్ట్రాలు సంసిద్ధతను వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. ఆస్తి యాజమాన్యపు హక్కుకు ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చే టోరెన్స్ విధానంలో కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్ ద్వారా ప్రతిపాదించిన ఈ ముసాయిదా చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేయాల్సిన అవసరం ఉంది. ఈ చట్టంపై రాష్ట్రాలకు స్పష్టమైన దిశానిర్దేశం చేయాలి. అంతర్జాతీయ మేటి రాజనీ తిజు్ఞనిగా అవతరిస్తున్న మన దేశ ప్రధానికి సహకరించడమంటే ఈ చట్టం అమలుచేయడమే.


