గణతంత్ర వేడుకల్లో పాల్గొనడంపై ఉర్సులా
న్యూఢిల్లీ: పలు రంగాల్లో భారత్ సాధిస్తున్న అద్భుత విజయాలు ప్రపంచాన్ని మరింత సుస్థిరంగా, ప్రగతిశీలంగా, సురక్షితంగా తీర్చిదిద్దుతాయని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయన్ పేర్కొన్నారు. తద్వారా అన్ని దేశాలూ ఎంతగానో లబ్ధి పొందుతాయని ఆమె అన్నారు. కర్తవ్యపథ్ వేదికగా భారత గణతంత్ర ఉత్సవాలను తిలకించడాన్ని అద్భుత అనుభూతిగా అభివరి్ణంచారు.
యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో పాటు ఉర్సులా సోమవారం గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం తెలిసిందే. ఆ అనుభూతిని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘నాకు నిజంగా జీవితకాల గౌరవమిది. గణతంత్ర వేడుకల్లో ఈయూ పతాకం, మా సైనిక కూటమికి చెందిన పతాకాలు రెపరెపలాడాయి.
భారత్‌తో ఈయూ సమాఖ్య నడుమ నానాటికీ బలపడుతున్న రక్షణ బంధానికి అవి తార్కాణం. మంగళవారం కుదిరే భద్రత, రక్షణ భాగస్వామ్య ఒప్పందాలతో ఆ బంధం మరింత బలోపేతం కానుంది’’అని ఎక్స్ పోస్టులో ఉర్సులా ఆశాభావం వెలిబుచ్చారు. ఈయూ నేతలు గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ వేడుకలకు మోదీ సర్కారు ఏటా విదేశీ నేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తూ వస్తోంది.


