వాన్స్, నవారోకు కూడా
భారత్‌తో ఒప్పందంపై రిపబ్లికన్ సెనేటర్ క్రుజ్ వ్యాఖ్యలు
వెలుగులోకి ప్రైవేట్ సంభాషణల టేప్
వాషింగ్టన్: భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కే ఇష్టం లేదంటూ టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రుజ్ బాంబు పేల్చారు. ఆయన అధికార రిపబ్లికన్ పార్టీ నేతే కావడం విశేషం! అంతేగాక ఈ విషయమై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారోలది కూడా అదే వైఖరి అని ఆయన చెప్పుకొచ్చారు.
పారీ్టకి విరాళాలిచ్చే దాతలతో భేటీ సందర్భంగా క్రుజ్ చేసినట్టు చెబుతున్న వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో టేపులు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. 2025 జూన్ నాటి ఆ టేపులను ఉటంకిస్తూ అమెరికాకు చెందిన మీడియా సంస్థ ఆక్సియోస్ తాజాగా ఈ మేరకు కథనం వెలువరించింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం చాలాకాలంగా పెండింగ్‌లోనే ఉన్న విషయం తెలిసిందే.
దానిపై ఇరుదేశాల నడుమ అత్యున్నతాధికారుల స్థాయిలో పలు దఫాలుగా చర్చలు జరిగినా తుది నిర్ణయం, ఒప్పందం మాత్రం ఇప్పటికీ జరగలేదు. ట్రంప్ భేషజాలకు పోవడం వల్లే ఈ ఒప్పందం ఆగిపోయిందనే అర్థంలో అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్ ఇటీవలే వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ‘‘నిజానికి ఆ ఒప్పందం ఎప్పుడో దాదాపుగా తుదిరూపునకు వచ్చింది.
అయితే దానికోసం ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా తనతో ఫోన్లో మాట్లాడాలని ట్రంప్ ఆశించారు. అలా జరగకపోవడం వల్లే ఒప్పందాన్ని పక్కన పెట్టారు’’అని లుట్నిక్ చెప్పుకొచ్చారు. క్రుజ్ వ్యాఖ్యలు కూడా దాన్ని బలపరిచేలానే ఉండటం విశేషం. భారత్‌పై ట్రంప్ అత్యధికంగా 50 శాతం టారిఫ్‌లు వేయడం, దాంతో ఇరుదేశాల నడుమ ఉద్రిక్తత నెలకొనడం తెలిసిందే. అమెరికాతో సంబంధాలు కూడా కొంతకాలంగా తిరోగమన బాట పట్టాయి.
టారిఫ్‌లతో ట్రంప్ పదవికే ఎసరు
ఆడియో టేపుల ప్రకారం, భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదరకపోవడానికి కారణం ఎవరని ఒక దాత క్రుజ్‌ను అడిగారు. ‘నవారో, వాన్స్. కొన్నిసార్లు ట్రంప్ కూడా’’అని ఆయన బదులిచ్చారు. ప్రపంచ దేశాలపై ట్రంప్ గతేడాది ఏప్రిల్‌లో ఎడాపెడా టారిఫ్‌లు విధించడం తెలిసిందే. అది సరికాదని, వాటిని వెనక్కు తీసుకోవాలని ఎంత నచ్చజెప్పినా ఆయన వినలేదని క్రుజ్ చెప్పారు. ‘‘పలువురు సెనేటర్లు ఈ విషయమై ట్రంప్‌కు ఫోన్ చేసి అర్ధరాత్రి దాకా సుదీర్ఘంగా మాట్లాడాం.
కానీ ఆయన మా మాట వినిపించుకోలేదు. పైగా మాపై తిట్లకు లంకించుకున్నారు. నన్నైతే బూతులు తిట్టారు’’అంటూ వాపోయారు. ట్రంప్ టారిఫ్‌లు అమెరికా ఆర్థిక వ్యవస్థనే భారీగా దెబ్బ తీస్తాయని, అంతిమంగా ఆయన పదవీచ్యుతికి దారితీసినా ఆశ్చర్యం లేదని క్రుజ్ అన్నారు. అంతేగాక రానున్న మిడ్ టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పారీ్టకి ఓటమి కూడా తప్పకపోవచ్చని అంచనా వేశారు. ఆ తర్వాత రెండేళ్లపాటూ ట్రంప్ మెడపై నిత్యం పదవీచ్యుతి కత్తి వేలాడుతూనే ఉంటుందన్నారు.


