మారిన ట్రంప్ వైఖరితో కొత్త వ్యూహాలపై ఐరోపా దేశాధినేతల చర్చలు
బ్రస్సెల్స్: గ్రీన్‌లాండ్ విషయంలో ట్రంప్ మొండిపట్టు పట్టడంతో తమ తదుపరి కార్యాచరణపై సమాలోచనలు జరిపేందుకు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అత్యవసరంగా సమావేశమయ్యాయి. గురువారం బ్రస్సెల్స్‌లో యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా సారథ్యంలో ఐరోపా మండలి సమావేశాలు ఆరంభమయ్యాయి.
డెన్మార్క్ విషయంలో తమకు మద్దతివ్వని ఏడు యూరోపియన్ దేశాలపై 10 శాతం అదనపు సుంకాలను విధిస్తానన్న తన నిర్ణయం నుంచి ట్రంప్ అనూహ్యంగా వెనక్కి తగ్గడంతో ఆయా దేశాలు కాస్తంత ఊపిరిపీల్చుకున్న తరుణంలో ఈ సమావేశాలు జరగడం గమనార్హం. ట్రంప్ శాంతి మండలిలో చేరేందుకు కొన్ని యూరప్‌దేశాలు విముఖత వ్యక్తంచేశాయి. గ్రీన్‌లాండ్ విషయంలోనూ ట్రంప్‌తో విబేధించాయి. ఈ నేపథ్యంలో ఇకమీదట అమెరికాతో ఏదైనా తేల్చుకునేందుకు ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవాలని, ఐక్యంగానే ముందడుగు వేయాలని యూరోపియన్ కౌన్సిల్ సమావేశంలో సభ్యదేశాలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.


