అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన పాత టారిఫ్ విధానాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిన కొద్ది గంటల్లోనే ఆయన మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సెక్షన్ 122 కింద కొత్తగా 10 శాతం గ్లోబల్ టారిఫ్‌ను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
'ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్' (IEEPA) కింద ట్రంప్ విధించిన సుంకాలపై సుప్రీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనం 6-3 మెజారిటీతో విదేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవని తీర్పునిచ్చింది. అయితే ట్రంప్ మాత్రం సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తప్పుబట్టారు.
ఈ తీర్పు ద్వారా టారిఫ్‌లను నియంత్రించే విషయంలో అధ్యక్షుడి అధికారాలు తగ్గలేదని, మరింత శక్తివంతంగా మారాయని ట్రంప్ అన్నారు. కొంతమంది న్యాయమూర్తులు దేశీయ ప్రయోజనాల కంటే విదేశీ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆయన ఆరోపించారు. సెక్షన్ 232 , సెక్షన్ 301 కింద ఉన్న జాతీయ భద్రతా సుంకాలు యాధావిధిగా కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. సెక్షన్ 232 ప్రకారం ఉక్కు , అల్యూమినియం వంటి లోహాలపై ఉన్న సుంకాలు కొనసాగనున్నాయి. చైనా వంటి దేశాలపై విధించిన టారిఫ్‌ను సెక్షన్ 301 సూచిస్తోంది.
అసలు ఏంటి సెక్షన్ 122 ?
సెక్షన్ 122 అనేది 1974 నాటి వాణిజ్య చట్టం. ఈ చట్టం ప్రకారం దేశంలో విదేశీ చెల్లింపుల లోటు పెరిగినప్పుడు అధ్యక్షుడు గరిష్టంగా 15 శాతం వరకు సుంకాలు విధించవచ్చు. ఈ సుంకాలు 150 రోజుల వరకు అమలులో ఉంటాయి. ఆ తర్వాత పొడిగించాలంటే అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఆమోదం తప్పనిసరి. ఈ చట్టాన్ని ఎటువంటి సంప్రదింపులు లేకుండా ప్రెసెడెంట్ నేరుగా అమలు చేయవచ్చు.


