
ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. ఆదాయపన్ను చట్టం 1922, ఆ తరువాత చట్టం 1961 ... ఇప్పుడు కొత్తం చట్టం 2025 పేరుతో వస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో రాష్ట్రపతి ఆమోదముద్ర పొందిన ఈ చట్టం 1.4.2026 నుంచి అమల్లోకి రానుంది. కొత్త చట్టం అత్యంత సరళీకృతంగా ఉంది. నిడివి, సెక్షన్లు తగ్గించారు. ‘పన్ను సంవత్సరం’ అనే కొత్త నిర్వచనంతో వర్చువల్ డిజిటల్ ఆస్తులను కూడా కలుపుతూ, సెర్చ్, సీజర్ అధికారాలను విస్తృత పరుస్తూ, ఎన్నో సంస్కరణలతో రూపుదిద్దుకొని ఇది ముస్తాబయింది.
ఈ సంవత్సరంలో అన్నీ పూర్తయినా, అమలు మాత్రం 1.4.2026 నుండే ఉంటుంది. అయితే 2025 బడ్జెట్‌లో తెచ్చిన మార్పులు 2025–26 ఆర్థిక సంవత్సరంలో వర్తిస్తాయి. 2026లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కొన్ని మార్పులు రావడం సహజం. ముఖ్యంగా బేసిక్ లిమిట్, మినహాయింపులు, శ్లాబులు, రేట్లు, ఇవి రావచ్చు. లేదా రాకపోవచ్చు. వచ్చేవి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి. వాటి గురించి ఇప్పుడు ఆలోచించడం అనవసరం.
కొత్త విధానాన్ని ప్రతిపాదించినప్పటి నుంచే ప్రభుత్వం దాన్ని సమర్థిస్తూ, వెనకేసుకొస్తోంది. మధ్య తరగతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని శ్లాబులు, రేట్లు తెచ్చారు. దీని ప్రకారం రూ.12,00,000కు పన్ను ఉండదు. శ్లాబులు మార్చారు. రేట్లు మారాయి.
రూ.12,00,000 ఆదాయాల విషయంలో శ్లాబులను మార్చకుండా రిబేటును 87 అ ప్రకారం రూ.60వేల వరకు పెంచి ఎంతో ఉపశమనం ఇచ్చారు. నికర ఆదాయం పెరిగితే వైకుంఠపాళి ఆటలో పాము నోట్లో పడినట్లే. శ్లాబుల వారీగా పన్ను కట్టాల్సి వస్తోంది.
సాండర్డ్ డిడక్షన్‌ని కొత్త విధానంలో రూ.75వేలకు పెంచారు.
ఈ ఆర్థిక సంవత్సరం నుంచి వ్యక్తులు రెండు సొంత ఇళ్ల మీద పన్ను కట్టాల్సిన అవసరం లేదు. గతంలో ఒక ఇంటికే ఉన్నా.., ఇప్పుడు మినహాయింపుని రెండో ఇంటికీ కల్పించారు.
కొత్త విధానంలో ఫ్యామిలీ పెన్షను మినహాయింపుని రూ.25వేలకు పెంచారు. గతంలో ఇది రూ.13,000గా ఉండేది. ఈ విధంగా కొత్త విధానాన్ని సమర్ధిస్తూ.., ఉపశమనం ఇచ్చారు. కొత్త విధానం కొంగు బంగారం అయ్యింది. ఆర్థికపరంగా ఎందరో చిన్న చిన్న అస్సెస్సీలకు పెద్ద రిలీఫ్ ఇచ్చారు. టాక్స్ ప్లానింగ్ పేరుతో ఎటువంటి అక్రమ మార్గాలకు పాల్పడకుండా రాచమార్గంలో రాజహంసలాగా రాజీ పడకుండా, రాంగ్ రూటు వెళ్లకుండా రైట్‌వే ఇది.
యూలిప్ ద్వారా వచ్చే మొత్తాలను క్యాపిటల్ గెయిన్ పరిధిలోకి తీసుకొచ్చారు. మొదటి రూ.25వేలకు మినహాయింపు ఉంది.
టీడీఎస్ (టాక్స్ డిడక్షన్ సోర్స్) వర్తించే విషయాల్లో పరిమితిని పెంచారు. దానివల్ల కొంతమంది టీడీఎస్‌కి గురికారు.
విదేశాల చెల్లింపుల్లో వర్తించే టీసీఎస్(టాక్స్ కలెక్టెడ్ సోర్స్) విషయంలో పరిమితి పెంచారు.
కొన్ని వస్తువుల అమ్మకపు విషయంలో పరిమితి రూ.50,00,000 ఇక నుంచి లేదు.
అప్‌డేటెడ్ రిటర్నులను ఫైల్ చేసుకోవడానికి 24 నెలల నుంచి 48 నెలలకు వెనక్కి వెళ్లవచ్చు. ఇది మంచి అవకాశం. అయితే షరతులకు లోబడి మాత్రమే.
రిటర్నులు వేయనివారిని నాన్‌ఫైలర్స్ అంటారు. గతంలో ఎక్కువ టీడీఎస్/టీసీఎస్ రేట్లు వేసేవారు. ఇప్పుడు ఆ వివక్ష లేదు.
భాగస్వాములకు చెల్లించే చెల్లింపుల మీద టీడీఎస్ ప్రవేశపెట్టారు.
నాన్ రెసిడెంట్లకి సంబంధించి కొన్ని డిజిటల్ వ్యవహారాల మీద వేసే పన్ను 6% ఎత్తివేశారు.
ఈ మార్పులను పెట్టుకొని టాక్స్ ప్లానింగ్ వైపు అడుగులు వేయండి.
