భూమి, ప్లాటు, జాగా.. ఇలాంటివి అమ్మితే ఏర్పడే క్యాపిటల్ గెయిన్స్ స్వభావరీత్యా పన్నుకి గురి అవుతాయి. అయితే, గ్రామాల్లో ఉన్న వ్యవసాయ భూములు అమ్మితే ఏర్పడే క్యాపిటల్ గెయిన్స్ మీద ఎలాంటి పన్నుభారం ఏర్పడదు.
గ్రామాల్లో వ్యవసాయ భూమి అంటే ఏమిటి..
ఇన్‌కం చట్టంలో గ్రామీణ వ్యవసాయ భూమి అంటే ఏమిటో వివరించారు. ఇలాంటి పొలాన్ని చట్టం ప్రకారం క్యాపిటల్ అసెట్‌గా పరిగణించరు. అసలు అది క్యాపిటల్ అసెట్ కాదు కాబట్టి, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడదు. ఒక మున్సిపాలిటీ, అందులో ఉన్న జనాభా 10,000 కన్నా తక్కువ ఉండి, ఈ రెండు కండీషన్లకు అనుగుణంగా ఉన్న ప్రాంతంలోని పొలాన్ని వ్యవసాయ భూమి అంటారు. అలాగే మున్సిపాలిటీ బైట, జనాభా 10,000 దాటినప్పుడు దూరాన్ని బట్టి పరిగణనలోకి తీసుకుంటారు.
జనాభా సంఖ్య
10,000 దాటి 2 కి.మీ. లోపల
1,00,000 దాటి 2కి.మీ.దాటి 6 కి.మీ. లోపల
10,00,000 దాటి 6కి.మీ.దాటి 8 కి.మీ. లోపల
మున్సిపాలిటీ పొలిమేర హద్దుల నుంచి కొలుస్తారు. జనాభా సంఖ్యను బట్టి, దూరాల లోపల ఉంటేనే గ్రామీణ వ్యవసాయ భూమి కింద లెక్కిస్తారు. ఈ రోజు గ్రామంలో ఉన్న జనాభా సంఖ్య తీసుకోరు. తాజా జనాభా లెక్కల గణన ప్రకారం పరిగణిస్తున్నారు. అంటే ప్రస్తుతానికి చివరగా 2011లో జనాభా లెక్కింపు జరిగినది. 2021లో జరగలేదు. 2027లో జరుగుతుంది. దూరం అంటే నడక దూరం కాదు, వైమానిక దూరం.
వ్యవసాయ భూమి అమ్మితే..
పైన చెప్పిన షరతులకు లోబడి భూమి ఉండి, ఆ భూమి అమ్మితే పన్ను భారం ఉండదు. ఆదాయానికి కూడా పన్ను భారం ఉండదు. అయితే, చాలా మంది వ్యవసాయ భూమి మీద బంగారం పండుతుందని చెప్తారు. ఆస్తిపరులు, రాజకీయ నాయకులు, సినిమా ఇండస్ట్రీ వాళ్లు, పారిశ్రామికవేత్తలు, బడా బడా ఆఫీసర్లు ఉన్నారు. మహానగరాల్లో మసలుతూ, వ్యవసాయం మీద ఆదాయం ఉందని, పొంతన లేని లెక్కలు చూపిస్తుంటారు. వరి వంగడంలో నుంచి ‘‘సిరి’’ పండిందని, యాపిల్ చెట్టుకి బంగారం పళ్లు కాశాయని చెప్పిన ఎందరో రాజకీయ నాయకులు, తనిఖీలు చేసినప్పుడు, అడ్డంగా బుక్ అయిపోయారు.
పెద్ద పెద్ద సినిమా స్టార్లు, తాము చిత్ర రంగాన్ని ఏలుతున్నా, వ్యవసాయదార్లమని చెప్పుకుంటున్నారు. అలాగే కంపెనీలు కూడా. ఒక ఆర్‌టీఐ జవాబు ప్రకారం 2011లో 6,50,000 మంది వ్యక్తులు డిక్లేర్ చేసిన వ్యవసాయ ఆదాయం సుమారు రూ. 2,000 లక్షల కోట్లు!! అయితే, ఆదాయ పన్ను శాఖ వారు స్రూ్కటినీ చేస్తున్నారు. శాటిలైట్ ద్వారా పరీక్ష చేస్తున్నారు. అసలు పొలం ఉందా లేదా.. ఉంటే ఏం పండుతుంది.. అది ఎలా అమ్ముతారు.. ఎక్కడ అమ్ముతారులాంటి విషయాలు తెలుసుకుంటున్నారు.
సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే, వ్యవసాయం మీద పన్నుభారం లేదు. వ్యవసాయ భూములు అమ్మితే పన్నుభారం లేదు. వచ్చిన మొత్తం మీద ఏమాత్రం పన్ను కట్టకుండా వైట్ రంగు వేసుకోవచ్చు. అయితే, ఆ ఇన్వెస్ట్‌మెంట్ మీద వచ్చే ఆదాయం, వడ్డీ, డివిడెండ్ల రాబడి మీద పన్నుభారం ఉంటుంది. ఇక రూ. 50,00,000 దాటినా టీడీఎస్ ఉండదు. అయితే, అర్బన్ ల్యాండ్‌ని క్యాపిటల్ అసెట్‌గా పరిగణిస్తారు. అమ్మగా ఏర్పడ్డ క్యాపిటల్ గెయిన్స్ మీద పన్ను వేస్తారు. రూ. 50,00,000 దాటితే టీడీఎస్ 1 శాతం వర్తిస్తుంది.
అర్బన్ ల్యాండ్ స్వల్పకాలికం అయితే, శ్లాబు ప్రకారం పన్ను విధిస్తారు. దీర్ఘకాలికం అయితే, 20 శాతం విధిస్తారు. అర్బన్ ల్యాండ్ అమ్మి వ్యవసాయ భూమి కొంటే పన్నుండదు. అలాగే కంపల్సరీ అక్విజిషన్, పన్ను విధింపు, మినహాయింపు ఉన్నాయి. అర్బన్ ల్యాండ్ అమ్మగా ఏర్పడ్డ క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపు పొందాలంటే 54ఎఫ్ ప్రకారం ఇల్లు కొనొచ్చు. 54ఈసీ ప్రకారం గుర్తింపు పొందిన బాండ్లలో రీఇన్వెస్ట్ చేయొచ్చు.
లేని ఆదాయాన్ని చూపించకండి. లేని ఆస్తిని చూపించకండి. దొంగ లెక్కలు చూపించకండి. అన్నదాత ముసుగులో అసలు నిజాన్ని దాచి, దోచి అధికారుల దృష్టిలో పడకండి.


