Income Tax: వ్యవసాయ ఆదాయం అంటే..? | Agricultural Income in Income | Sakshi
Sakshi News home page

Income Tax: వ్యవసాయ ఆదాయం అంటే..?

Nov 17 2025 1:02 PM | Updated on Nov 17 2025 1:39 PM

Agricultural Income in Income

గతవారం వ్యవసాయ భూముల అమ్మకం, క్యాపిటల్‌ గెయిన్‌ గూర్చి తెలుసుకున్నాము. కొందరు పాఠకులు అసలు ‘వ్యవసాయ ఆదాయం’ ఏమిటని అడుగుతున్నారు. ఆదాయపన్ను చట్టంలో వ్యవసాయ ఆదాయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ ఆదాయం మీద పన్ను భారం లేదు. పూర్తిగా మినహాయింపే! అయితే ఇది కేవలం రైతులకు మాత్రమే కాదు రైతులుగా వ్యవసాయం చేసే వారికి కూడా ఈ మినహాయింపులు ఇస్తారు. అంటే భూమికి ఓనరే కావల్సిన అవసరం లేదు. కొన్ని షరతులు ఉన్నాయి. తెలుసుకోండి.  

  • వ్యవసాయ భూమి దేశంలోనే ఉండాలి. ఇందుకు సంబంధించి కాగితాలు ఉండాలి. అవి న్యాయబద్ధంగా ఉండాలి. సర్వే నెంబర్లు... పోరంబోకు భూములు, అడవులు, మెట్టభూములు, ఇసుక మెట్టలు, బంక మట్టివి మొదలగునవి చెప్పి మోసం చేయకండి. వ్యవసాయానికి అనువైన భూమిగా ఉండాలి. పట్టా పుస్తకాలు, పాస్‌ బుక్‌లు, అమ్మకం పత్రాలు, మ్యూటేషన్‌ వివరాలు ఉండాలి. వీటి ద్వారా హక్కులు, పరిమాణం, సరిహద్దులు, కొలతలు, యాజమాన్య స్థితి, ల్యాండ్‌ రికార్డు తదితర రికార్డులుండాలి.  

  • ఆ నిర్దేశిత వ్యవసాయ భూమి ద్వారా ఆదాయం ఏర్పడాలి. అది అద్దె కావచ్చు. పాడి పంటలు అమ్మగా నికరంగా మిగిలింది కావచ్చు. ఫామ్‌ హౌస్‌ మీద ఆదాయం కావచ్చు. అయితే ఆదాయం చేతికొచ్చినట్లు ఆధారాలుండాలి. రశీదులు, అగ్రిమెంట్లు, వ్యవసాయ కమిటీలు, పంపినట్లు రశీదు క్రయవిక్రయాలకు కాగితాలు మొదలైనవి. ఎంత పంట పండింది? పరిమాణం ఎంత? ఎక్కడ దాచారు? ఎంత దాచారు? సొంత వాడకం ఎంత? మార్కెట్‌ యార్డులకు ఎలా తరలించారు? ఎంత ధరకు అమ్మారు? ఎవరికి అమ్మారు? నగదు ఎలా వచ్చింది? బ్యాంకులో జమ ఎంత? తదితర వివరణలు ఉండాలి. అలాగే ఖర్చులు వివరాలు... అంటే సాగుబడికెంత? లేబర్‌కి ఎంత?  విత్తనానికి ఎంత? పురుగు మందులకు ఎంత? ఎరువులకు ఎంత? యంత్రాల పనిపట్లపై ఎంత ఖర్చు చేశారు? కరెంటు ఎంత? బట్వడా ఎంతిచ్చారు ? ట్రాక్టరు బాడుగ, నీటి పారుదల, గోదాములు ఖర్చు తదితరాలపై సరైన కాగితాలుండాలి.  

  • పంటల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయమై ఉండాలి.

  • కౌలు ద్వారా వచ్చినది వ్యవసాయ ఆదాయమే.. అయితే అగ్రిమెంట్లు ఉండాలి.  

  • ఒకటి గుర్తుంచుకోండి. నిజానికి రైతుకి నెలసరి ఆదాయం 2021–22లో సగటున రూ.12,698గా ఉంది. ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంది. ఇక మిగిలింది ఎంత ? గొర్రె తోకంత. కానీ ఆదాయపు పన్ను శాఖ వారి రికార్డుల ప్రకారం ఏడాదికి కోటి రూపాయల వ్యవసాయ ఆదాయం ప్రకటించిన వారి సంఖ్య సుమారు 3,000 మంది. అందుకని వారి డేగ కన్ను కచ్చితంగా ఉంటుంది గుర్తుపెట్టుకొండి.  

కింద వివరాలు, ఉదాహరణలు గమనించండి 
విత్తనాల అమ్మకాలు, మొక్కలు, పూలు, పాదులు, ల్యాండ్‌ మీద అద్దె, వ్యవసాయం చేసే భాగస్వామ్య సంస్థలో భాగస్వామికిచ్చే వడ్డీ, పంట అమ్మకం పంట నష్టం అయితే ఇన్సూరెన్సు వారిచ్చే పరిహారం, అడువులలో చెట్లు ఇవన్నీ వ్యవసాయం మీద ఆదాయం కిందకు వస్తాయి.  

ఈ కిందివి వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయాలు కావు

  • భూమి బదిలీ చేసిన తరువాత వచ్చిన ఎన్యూటీ 
     

  • బకాయి అద్దెల మీద వడ్డీ 
     

  • కౌలు తీసుకున్న వారు డబ్బులు చెల్లించకపోతే బదులుగా ప్రామిసరీ నోటు ఇచ్చి.., వాటి మీద వచ్చే వడ్డీ  
     

  • అటవీ సంపద అమ్మకం అంటే చెట్లు, పండ్లు, పూలు, అడవి గట్టి వంటివి అడవి నుంచి దొంగిలించినవి అమ్మివేయగా వచ్చేవి. 
     

  • పొలాల్లో సముద్రపు నీరు రావడం వలన ఏర్పడ్డ ఉప్పు అమ్మకం ద్వారా ఆదాయం  
     

  • వడ్డీ కమీషన్‌ 
     

  • చేపల అమ్మకం 
     

  • ఫైనాన్సింగ్‌లోని రాయితీ 
     

  • వెన్న, చీజ్‌ అమ్మకం 
     

  • పౌల్ట్రీ ఆదాయం 
     

  • డెయిరీ మీద ఆదాయం 
     

  • తేనెటీగల పెంపకం 
     

  • చెట్లు నరకడం ద్వారా వచ్చిన ఆదాయం 
     

  • ఫామ్‌ హౌజ్‌ని టీవీ, సీరియల్స్‌ షూటింగ్‌లకు అద్దెకిస్తే వచి్చన ఆదాయం 
     

  • విదేశాల నుంచి వచి్చన వ్యవసాయ ఆదాయం 
     

  • వ్యవసాయ కంపెనీ ఇచ్చే డివిడెండ్లు 
     

  • టీ పంటలో ఆదాయం 40%, మిగతా 60% వ్యవసాయం మీద ఆదాయం 
     

  • కాఫీలో 25%, (పండించి అమ్మితే) 
     

  • రబ్బర్‌ 95% 
     

  • కాఫీ...  చికోరితో/లేదా చికోరి లేకుండా 40%

చివరిగా, వ్యవసాయ ఆదాయం రూ.5,000 కు మినహాయింపు అందరికీ ఉంటుంది. దీనితో పాటు వ్యవసాయేతర ఆదాయం ఉన్నవారికి రెండింటిని కలిపి పన్ను భారం లెక్కిస్తారు. దీని వల్ల కొంత పన్ను భారం పెరుగుతుంది. కేవలం వ్యవసాయం మీద ఆదాయం ఇతరత్రా టాక్సబుల్‌ ఇన్‌కమ్‌ లేకపోతే పన్నుభారం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement