చిరుతల దాడిలో నలుగురికి గాయాలు | Leopard Attacks Four in Anantapur District | Sakshi
Sakshi News home page

చిరుతల దాడిలో నలుగురికి గాయాలు

Feb 3 2026 5:26 AM | Updated on Feb 3 2026 5:26 AM

Leopard Attacks Four in Anantapur District

నార్పల మండలం బొందలవాడలో ముగ్గురు, సంజీవపురంలో మహిళపై చిరుతల దాడి 

అనంతపురం సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

శింగనమల(నార్పల): మూడు చిరుతలు ఒకే రోజు వేర్వేరుగా దాడులు చేయడంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటన అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది. వివరాలు.. శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం మండలం సంజీవపురం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మమ్మ పొలం వద్దకు వెళ్లగా చిరుత దాడి చేసి, తీవ్రంగా గాయపరిచింది. ఆమె గట్టిగా కేకలు వేయడంతో పారిపోయింది. స్థానికులు బాధితురాలిని 108 వాహనంలో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు.

అలాగే నార్పల మండలం బొందలవాడకు చెందిన కొనంకి నాయుడు తోటలో డ్రిప్పు మందు వదులుతుండగా చిరుత దాడి చేసింది. గట్టిగా కేకలు వేయడంతో అది పారిపోయింది. ఇదే గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, గంగరాజు పొలం వద్దకు వెళ్తుండగా దాడి చేయగా గట్టిగా కేకలు వేయడంతో పారిపోయింది. లక్ష్మీదేవి గాయపడింది. 

మరో ప్రాంతంలో ఇదే గ్రామానికి చెందిన నారాయణస్వామి గొర్రెలు కాస్తుండగా చిరుత దాడికి దిగగా.. తప్పించుకుని సమీపంలోని వ్యక్తుల వద్దకు పరుగెత్తికెళ్లాడు. గ్రామస్తులు వెళ్లి చూడగా మూడు చిరుతలు పారిపోవడాన్ని గుర్తించారు. ఈ క్రమంలోనే అడవిపిల్లి కనిపించడంతో స్థానికులు చిరుత అనుకుని దాడి చేసి చంపేశారు. అటవీశాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ అక్బర్, సిబ్బంది బొందలవాడ పరిసరాల్లో పర్యటించారు. చిరుతలను పట్టుకోవడానికి చర్యలు తీసుకుంటామని, ఎవరూ భయపడవద్దని ప్రజలకు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement