రాష్ట్రాన్ని ‘జంగిల్‌ రాజ్‌’ చేశారు | YSRCP leaders Fires on Chandrababu | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని ‘జంగిల్‌ రాజ్‌’ చేశారు

Feb 3 2026 2:45 AM | Updated on Feb 3 2026 2:45 AM

YSRCP leaders Fires on Chandrababu

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ, పార్టీ ముఖ్యనేతలు

చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నేతల ధ్వజం

పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఆదేశాల మేరకు అత్యవసరంగా సమావేశమైన సీనియర్‌ నేతలు 

అంబటి రాంబాబుపై హత్యాయత్నం, జోగి రమేష్‌ ఇంటిపై జరిగిన దాడిపై చర్చ 

బాబు దుర్మార్గాలు జాతీయస్థాయిలో ఎండగడతామని వెల్లడి 

ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారని మండిపాటు 

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని వెల్లడి 

దాడులతో మమ్మల్ని భయపెట్టలేరని స్పష్టికరణ 

చంద్రబాబు దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం 

వెంకన్న భక్తుల మనసులను గాయపరిచిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని జంగిల్‌ రాజ్‌ చేశారని వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు దుర్మార్గాలను జాతీయ స్థాయిలో ఎండగడతామని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్‌ నేతలు సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. పార్టీ స్టేట్‌ కో– ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో నేతలు భేటీ అయ్యారు. రెండున్నర గంటలు జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌ ఇళ్లపై దాడులు, అంబటిపై హత్యాయత్నం ఘటనలపై చర్చ జరిగింది.

చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలిపోయాయని నేతలు అన్నారు. చంద్రబాబు దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాష్ట్రంలో పరిణామాలను జాతీయ స్థాయికీ తీసుకెళ్లాలని నిర్ణయించారు. తిరుమల శ్రీవారి భక్తుల మనసులను చంద్రబాబు గాయపర్చారని, ఆయనకు ఏ మాత్రమైనా పాపభీతి ఉంటే వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు తప్పులను ప్రశి్నస్తున్నందుకే వైఎస్సార్‌సీపీ నేతలపైన కుట్రలకు పాల్పడుతున్నారని తెలిపారు. మూడు రోజుల్లో ముగ్గురు మాజీ మంత్రులు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలపై దాడులు చేశారని, అంబటి రాంబాబుపై ఏకంగా హత్యాయత్నం చేశారని, ఇవి చాలా దారుణ ఘటనలని అన్నారు.

ఇలా దాడులతో భయపెడితే ఎవ్వరూ ప్రశ్నించరని చంద్రబాబు అనుకుంటున్నారని, కానీ, అది ఆయన అవివేకమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలను చంద్రబాబు పూర్తిగా దెబ్బతీశారన్నారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ పూర్తిగా చెడిపోయిందని తెలిపారు. రక్షణ కోసం పార్టీ నాయకులు గంటల తరబడి ఫోన్లు చేసినా పోలీసు అధికారులు స్పందించకపోవడం ఆ వ్యవస్థ దిగజారిపోయిందనడానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇక సామాన్యులకు ఏం రక్షణ కల్పిస్తారని, పైగా బాధితులపైనే కేసులు పెడుతున్నారని చెప్పారు.

అంబటి రాంబాబు ఇంటిపై ఆ స్థాయిలో దాడి జరిగినా, ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని నేతలు మండిపడ్డారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, మేరుగు నాగార్జున, కారుమూరు నాగేశ్వరరావు, మాజీ ఎంపీ మార్గాని భరత్, నేతలు కరణం ధర్మశ్రీ, దేవినేని అవినా‹Ù, పూనూరు గౌతమ్‌ రెడ్డి, వరికూటి అశోక్‌ బాబు, దూలం నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాదరాజు,  ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, నూరి ఫాతిమ, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్షి్మ, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్‌ పాల్గొ­న్నారు. సమావేశంలో ముఖ్యనేతలు ఏమన్నారంటే.. 

ఇంతటి దుర్మార్గాలు ఎప్పుడూ చూడలేదు : బొత్స సత్యనారాయణ 
రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలు నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు. రాజకీయంగా ప్రశ్నించే వారిపై చంద్రబాబు దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఎవరో ఏదో చేస్తారని భయపడే రోజులు లేవు. అలా భయపడే వారెవరూ ఇక్కడ లేరు. ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాలు చేపడతాం. పెట్రోలు బాంబులు వేయడం అనే విష సంస్కృతిని చంద్రబాబు మళ్లీ తెచ్చారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్తాం. తిరుమల లడ్డూపై చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలను దేశమంతా తప్పుపడుతోంది. క్షమాపణ చెప్పకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు 

బాబు అరాచకాలు ఢిల్లీలో ఎండగడతాం : సజ్జల రామకృష్ణారెడ్డి 
అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు విడతలవారీగా ఐదున్నర గంటల పాటు దాడులకు తెగబడ్డారంటే పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరించారో అర్థం అవుతోంది. మరుసటి రోజే జోగి రమేష్‌ ఇంటిపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలోనే గంటల తరబడి దాడులు జరగడం శృతి మించిన అరాచకాలకు నిదర్శనం. తిరుమల లడ్డూ విషయంలో అబద్ధాలు రుద్దడంలో ఫెయిల్‌ కావడంతో, డైవర్షన్‌ కోసం ఇలా అడ్డదారిలో బరి తెగించారు. ఇవన్నీ ఢిల్లీలో ఎండగడతాం. కేంద్ర హోం శాఖ దృష్టికి కూడా తీసుకెళ్తాం.

ప్రభుత్వ దుర్మార్గాలపై పార్టీ నాయకులంతా ఒక్కటై పోరాడతారు. విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడుపై దాడుల ఘటనల్లోనూ పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వీటన్నింటిపై కోర్టుల్లో దావా వేస్తాం. జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్చార్సీ) దృష్టికి కూడా తీసుకెళ్తాం. లడ్డూ విషయంలో చంద్రబాబు క్షమాపణ చెప్పేవరకు వదిలి పెట్టేది లేదు. ఫ్లెక్సీలపై పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు మంగళవారమూ కొనసాగుతాయి. 

సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన బాబు: కారుమూరు నాగేశ్వరరావు 
చంద్రబాబు మానవ హక్కులు హరిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించి పోస్టర్లు వేస్తూ, జంతు కొవ్వు కలిసిందని వారు చేసిన ఆరోపణలు నిజమని నమ్మించే కుట్రలు చేస్తున్నారు. 

తిట్టకపోయినా తిట్టారనే రకం చంద్రబాబు: గుడివాడ అమర్నాథ్‌ 
అంబటి రాంబాబు వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి, రోడ్డుపై వెళ్తుంటే టీడీపీ క్యాడర్‌ రెచ్చగొట్టిందని, ఆ ఇన్సిడెంట్‌లో అలా మాట్లాడకుండా ఉండాల్సిందని రాంబాబు ఒప్పుకున్నా టీడీపీ దౌర్జన్యం చేసింది. ఏమీ తిట్టకపోయినా తనను తిట్టారంటూ రాజకీయం చేసే వ్యక్తి చంద్రబాబు. 

పక్కా ప్లాన్‌ ప్రకారమే దాడులు: మాజీ మంత్రి పేర్ని నాని 
ప్రభుత్వ తప్పిదాలు, అరాచకాలు, అవినీతిపై గట్టిగా ప్రశ్నించే వారు ఎప్పుడు దొరుకుతారా అని చంద్రబాబు, లోకేశ్‌ ఎదురు చూస్తున్నారు. మా పార్టీ క్యాడర్‌ను భయపెట్టాలనే లోకేశ్‌ పన్నాగం పన్నారు. అయినా మేమంతా చాలా ధైర్యంగా నిలబడ్డాం. ఇంకా నిలబడతాం.  

Advertisement
 
Advertisement
Advertisement