breaking news
new meters
-
ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయండి
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగదారుల నుంచి స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత అదనంగా వసూలు చేసిన చార్జీలను వెనక్కి ఇచ్చేయాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) ఆదేశించింది. ఇకపై కెపాసిటర్లు ఎన్ని ఉన్నా లోడ్‌కి ఎన్ని అవసరమో వాటినే విద్యుత్ బిల్లు వేసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. విద్యుత్ పంపిణీ రంగంలో సామర్థ్యం, పారదర్శకత, విశ్వసనీయతను మెరుగుపరచడానికి ఆధునిక మీటరింగ్ సాంకేతిక పరిజ్ఞానాలకు మద్దతు ఇస్తూనే వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటానికి కట్టుబడి ఉన్నామని కమిషన్ స్పష్టం చేసింది. మేం కట్టలేం ‘‘స్మార్ట్ మీటర్లు పెడతామని ఎవరైనా వస్తే వాటిని పగలగొట్టండి అని ఎన్నికల ముందు టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం, అవవసరమైతే తగ్గిస్తాం అన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక వినియోగదారుల సమ్మతితోనే విద్యుత్ సర్విసులకు స్మార్ట్ మీటర్లు బిగిస్తామంటూ మాట మాచ్చారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టుకోకపోతే ఉన్న సర్వీసులు తొలగిస్తామంటూ నోటీసులు ఇస్తున్నారు. వీటికి తోడు ప్రజలపై దాదాపు రూ.20 వేల కోట్లకుపైగా విద్యుత్ చార్జీల భారం మోపారు.స్మార్ట్ మీటర్లు పెట్టడంతో విద్యుత్ బిల్లులు రెండు, మూడింతలు పెరిగిపోయాయి. ఇలా అయితే మేమెలా బిల్లులు కట్టాలి ? వినియోగించని విద్యుత్‌కు చార్జీలు ఎందుకు చెల్లించాలి.’’ అంటూ విద్యుత్ వినియోగదారులు ఏపీఈఆర్సీకి ఇటీవల మొర పెట్టుకున్నారు. బహిరంగ విచారణలో, ఈమెయిళ్ల ద్వారా, నేరుగానూ తమ సమస్యలను మండలికి చెప్పుకున్నారు. అందుకే ఎక్కువ బిల్లు వినియోగదారుల ఆందోళనను సీరియస్‌గా తీసుకున్న మండలి ఈ సమస్యకు తమ వంతు పరిష్కారాన్ని అన్వేషించింది. పాత ఎలక్ట్రోమెకానికల్, స్టాటిక్ మీటర్లతో పోలిస్తే కొంతమంది వినియోగదారులకు అధిక విద్యుత్ బిల్లులు వచ్చాయని గుర్తించింది. ఈ నేపథ్యంలో మూడు సూచనలతో సోమవారం ఆదేశాలు జారీ చేసింది. లో టెన్షన్ (ఎల్టీ) విద్యుత్ సర్విసులకు స్మార్ట్ మీటర్లు అమర్చిన తర్వాత విద్యుత్ బిల్లులు భారీగా పెరిగాయి. దీనికి కెపాసిటర్లు కారణమంటూ ఏపీఈఆర్సీకి డిస్కంలు వెల్లడించాయి. వినియోగదారులు అవసరమైన దానికంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న కెపాసిటర్లను పెట్టుకోవడం వల్ల స్మార్ట్ మీటర్లు అదనపు లోడ్‌కి తగ్గట్టుగా యూనిట్లు లెక్కిస్తున్నాయని వివరించాయి. ఈ విషయాన్ని పరిశీలించిన తర్వాత వినియోగదారుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ మీటరింగ్ ప్రోగ్రామ్‌కు అనుకూలమైన వాతావరణం కల్పించాల్సి ఉందని భావించినట్లు ఏపీ ఈఆర్సీ వెల్లడించింది.ఏపీఈఆర్సీ ఆదేశాలు ఇవీ ⇒ స్మార్ట్ మీటర్లలో కెపాసిటర్ల ఆధారంగా బిల్లు లెక్కింపు విధానం ఉండాలని గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు నిలిపివేస్తున్నట్లు మండలి తెలిపింది.⇒ స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత లీడింగ్ రియాక్టివ్ ఎనర్జీ (కెపాసిటర్) కారణంగా వినియోగదారులు ఇప్పటికే చెల్లించిన అదనపు బిల్లులను ఉపసంహరించుకోవాలని డిస్కంలను ఆదేశించింది.⇒ అలా వసూలు చేసిన అదనపు మొత్తాలను సంబంధిత వినియోగదారులకు తర్వాతి నెలల విద్యుత్ వినియోగ బిల్లులలో సర్దుబాటు చేయాలని సూచించింది. -
బాధ్యులు ఎవరు
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఇప్పటికే నష్టాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ ఎన్పీడీసీఎల్)ను కొత్త మీటర్ల కొనుగోలు వ్యవహారం మరింత దెబ్బతీస్తోంది. గృహ వినియోగదారుల కోసం కొనుగోలు చేసిన ఈ రకం మీటర్లలోని లోపాలతో బిల్లు వసూలులో భారీగా తేడా వచ్చే పరిస్థితి నెలకొంది. టెలివిజన్(టీవీ) రిమోట్‌తో కరెంట్ రీడింగ్‌ను నిలిపివేసేలా తయారైన విజన్‌టెక్ మీటర్ల వ్యవహారం ఎన్పీడీసీఎల్లో సంచలనంగా మారింది. నిబంధనల ప్రకారమే ఈ మీటర్లను కొనుగోలు చేశారా... అవసరమైన పరీక్షలు, తనిఖీలు పూర్తి చేశారా.. అనే కోణంలో విచారణ జరపాలనే డిమాండ్ సంస్థలోని ఉద్యోగుల నుంచి వస్తోంది. లోపాలు కలిగిన మీటర్లు లక్షల సంఖ్యలో వినియోగదారులకు సరఫరా జరిగేవరకు ఉదాసీనంగా వ్యవహరించిన అధికారుల తీరుపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సంస్థకు భారీగా ఆర్థిక నష్టం తెచ్చే మీటర్ల కొనుగోలు బాధ్యులు ఎవరు... వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఎన్పీడీసీఎల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్పీడీసీఎల్.. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో విద్యుత్ సరఫరాను నిర్వహిస్తున్నది. ఇళ్లకు కొత్త కనెక్షన్లతోపాటు మీటర్ల కాలిపోయినప్పుడు, సాంకేతిక లోపాలు ఏర్పడినప్పుడు కొత్త మీటర్లు అమర్చుతారు. ఎన్పీడీసీఎల్ ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ విధానంలో టెండర్లు పిలిచి, కంపెనీలతో ఒప్పందం చేసుకుని మీటర్లను సేకరిస్తుంది. ఇటీవ నిర్వహించిన టెండర్లలో... విజన్‌టెక్, నైనా పవర్, డెసిబల్, జీనస్ కంపెనీలను మీటర్ల సరఫరా కోసం ఎన్పీడీసీఎల్ ఎంపిక చేసింది. విజన్‌టెక్ 1.40 లక్షలు, నైనా పవర్ 1.90 లక్షలు, డెసిబల్ 55 వేలు, జీనస్ 75 వేలు కరెంటు మీటర్లను సరఫరా చేశాయి. ఒక్కో మీటరుకు రూ.747 రూపాయల చొప్పున కొనుగోలు చేసిన విజన్‌టెక్ కంపెనీ మీటర్లు ఇప్పుడు ఎన్పీడీసీఎల్కు తలనొప్పిగా మారాయి. రూ.10.45 కోట్లతో కొనుగోలు చేసిన ఈ మీటర్లు... టీవీ రిమోట్‌తో రీడింగ్ ఆగిపోతున్నాయి. ఈ విషయం ఇప్పటికే అధికారులకు, పలువురు వినియోగదారులకు తెలిసింది. దీంతో బిల్లు రూపంలో వచ్చే మొత్తంలో తేడా ఉంటోంది. ఇకముందు ఈ తేడా ఇంకా ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ మీటర్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చే ముందు బెంగళూరులోని సెంట్రల్ పవర్ రీసెర్చీ ఇనిస్టిట్యూట్(సీపీఆర్ఐ)కు, చెన్నైలోని ఎలక్ట్రానిక్ టెస్ట్ డెవలప్‌సెంటర్(ఈటీడీసీ)కి పంపిస్తారు. అక్కడి పరీక్షల్లో ఆమోదం పొందిన కంపెనీలనే కొనుగోలు చేస్తారు. ఎన్పీడీసీఎల్ కొనుగోలు చేసిన విజన్‌టెక్ మీటర్లను పరీక్షలకు పంపించారా లేదా అనేది సందేహంగా మారింది. ప్రఖ్యాత సంస్థల్లో పరీక్షలు నిర్వహించి ఆమోదం పొందితే రిమోట్‌తో రీడింగ్ ఎలా ఆగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజన్‌టెక్ మీటర్ల కొనుగోలు వ్యవహారంపై ఉన్నతాధికారుల నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.


