ప్రపంచ జనాభా దినోత్సవం - జూలై 11
ఆనందంగా జరుపుకోవడానికి వారి పుట్టినరోజులు లేవు, గుమ్మం ముందు వేచి ఉండే బుజ్జిబుజ్జి చెప్పులు లేవు, అల్మారాలో నీట్‌గా సర్దిన స్కూల్ యూనిఫార్మ్‌లూ లేవు. కాలక్రమేణా వాయిదా పడుతూ, మెల్లగా కరిగిపోతున్న కలలు మాత్రమే ఉన్నాయి. రికార్డుల్లో రాయని గుండెల్లో గూడు కట్టుకున్న నిశ్శబ్దం మాత్రమే ఉంది. ఒకప్పుడు తమను ‘అమ్మా’, ‘నాన్నా‘ అని పిలిచే ఒక చిన్నారిని ఊహించుకుని, ఇపుడు భవిష్యత్తులో ఆ రోజు అసలు వస్తుందో లేదో తెలియక సతమతమవుతున్న లక్షలాది మంది యువతీ యువకుల అంతరంగిక వ్యథ ఇది. ఎక్కడా నమోదు చేయలేని వేదన ఇది.
ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటాం. దశాబ్దాలుగా ఈ చర్చ కేవలం అంకెల చుట్టూనే తిరుగుతోంది. ఎంతమంది జన్మిస్తున్నారు? ఏ దేశ జనాభా వేగంగా పెరుగుతోంది? అందరికీ సరిపడా ఆహారం, నీరు, వనరులు ఉన్నాయా? అంటూ. ఇవి ముఖ్యమైన ప్రశ్నలే కావచ్చు, కానీ అంకెలకు వాటి వెనుక ఉన్న మనుషులను, వారి వ్య«థలను దాచేసే వింత అలవాటు ఒకటి ఉంది. అదే నేడు ఒక అందమైన కుటుంబాన్ని నిర్మించుకోవాలనే యువత కలలు కల్లలుగానే మిగిలిపోతున్నాయనే చేదు వాస్తవాన్ని ముందుకు తీసుకురాలేకపోతోంది.
పడిపోతున్న జననాల రేటు
ఒకప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ‘అధిక జనాభా’ అని మనమంతా నమ్మాం. కానీ నేటి వాస్తవం చాలా భిన్నంగా ఉంది. ప్రపంచంలోని అనేకప్రాంతాలలో మునుపెన్నడూ లేనంతగా జననాల రేటు పడిపోతోంది. అయితే పడిపోతున్న జననాల రేటు అనేది గ్రాఫ్‌లో కేవలం ఒక లైన్ మాత్రమే కాదు. ఇద్దరు పిల్లలను పెంచాలని కలలుగని, చివరికి ఆర్థిక పరిస్థితులు సహకరించక ఒక్కరిని కూడా వద్దనుకున్న ఎన్నో యువ జంటల నిర్ణయం అది. పెరుగుతున్న జనాభా కేవలం ఒక గణాంకం కాదు. ప్రతి బిడ్డకు వైద్యం, విద్య, రక్షణ, ఆశ లభించాలనే రిమైండర్ అది. అదే నేడు యువతను వెనకడుగు వేసేలా చేస్తోంది.
మరో ఏడాది ఆగుదాం!
జనాభా తగ్గడంపై యువతను బ్లేమ్ చేయడం చాలా సులభం. ‘వారు కెరీర్ వెంటపడుతున్నారు’, ‘బాధ్యత వద్దు అనుకుంటున్నారు‘ అని చాలామంది అంటుంటారు. కానీ అందులో నిజం లేదు. ఇంటి అద్దెలు పెరిగాయి, నిత్యావసరాలు భారమయ్యాయి, ఎడ్యుకేషన్ లోన్లు, చైల్డ్ కేర్ ఖర్చులు ఆకాశాన్నంటాయి. ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ వస్తే జీవితకాల ΄÷దుపు కరిగిపోతోంది. ఒకరికి ప్రసూతి సెలవు తీసుకుంటే కెరీర్ ఎక్కడ ఆగిపోతుందో అన్న భయం, మరొకరికి ఉద్యోగ భద్రత లేదన్న ఆందోళన. ఇన్ని ఆలోచనలతో ‘మరో ఏడాది ఆగుదాం’ అనుకుంటూ వాయిదా వేసిన ఆ జంట అలా ఐదేళ్ల పాటు వాయిదాల బాటలోనే నడుస్తుంది. చివరిగా ‘పిల్లలను ఎప్పుడు కందాం?’ అనే స్థితి నుంచి, ‘అసలు మనం పిల్లలను కనగలమా?’ అనే ప్రశ్నగా మారిపోతోంది. ఈ నిశ్శబ్ద కన్నీటి సంభాషణలు ఏ ప్రభుత్వ నివేదికల్లోనూ నమోదు కావు. ఏ జనాభా చార్ట్ కూడా ఆ సమయంలో కార్చిన కన్నీళ్లను చూపించదు. కానీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఇళ్లల్లో ఈ నిశ్శబ్ద చర్చలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇది స్వార్థం కాదు, భవిష్యత్తుపై ఉన్న అభద్రతాభావం.
ఉమ్మడి బాధ్యత కావాలి!
ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. కానీ ఇంట్లో మాత్రం ఆనాటి మూసధోరణులు అలాగే ఉండిపోయాయి. బిడ్డ పుట్టగానే మహిళే తన కెరీర్‌ను ఆపాలి లేదా పని గంటలు తగ్గించుకోవాలి. అటు ఉద్యోగం, ఇటు నిద్రలేని రాత్రులు, పిల్లల పెంపకం, పెద్దల సంరక్షణ అన్నీ తానై చూసుకోవాలి. స్త్రీల సామర్థ్యాన్ని వారిపై అదనపు భారం వేయడానికి సాకుగా తీసుకోకూడదు. పిల్లల పెంపకం అనేది ఉమ్మడి బాధ్యత కావాలి. స్త్రీలు మాత్రమే ఈ భారాలన్నింటినీ మోయాలి అనేది కూడా జనాభా తగ్గడంలో ఒక కారణంగా మారుతోందని నిపుణుల మాట.
అవసరాల ఖరీదు ఎక్కువైతే..
ఎంతో ప్రగతి సాధించాం. శాటిలైట్లు లాంచ్ చేశాం, ఏఐ సృష్టించాం. కానీ ‘మనం ఒక బిడ్డను పెంచగలమా?’ అనే సాధారణ ప్రశ్నకు నేటి యువత సమాధానం చెప్పలేకపోతున్నారు. సురక్షితమైన ఉద్యోగం, సరసమైన వైద్యం, నమ్మకమైన చైల్డ్ కేర్ అనేవి విలాసాలు కావు, అవి ఒక ఆరోగ్యకరమైన సమాజానికి పునాదులు. నిజమైన జనాభా సంక్షోభం జనాభా పెరగడం లేదా తగ్గడం గురించి కాదు. అది నిశ్శబ్దంగా మారుతున్న ప్రపంచం గురించి. లక్షలాది మంది యువత తల్లిదండ్రులు కావాలనే కలలను ఆపలేదు.. కానీ ఈ ప్రపంచం తమ పిల్లల కోసం సిద్ధంగా లేదని నమ్మడం ప్రారంభించారు. అంటే ప్రేమ లేకపోవడం వల్ల కాదు, అవసరాల ఖరీదు ఎక్కువైపోవడం వల్ల. ఏ సమాజానికైనా తన యువతను ఇలాంటి హృదయ విదారకమైన పరిస్థితిలోకి నెట్టడం ఒక ఓటమి. అందుకే పిల్లల విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు.
వరల్డ్ పాపులేషన్ డే 2026 సందర్భంగా మన ముందున్న ప్రశ్న ఒక్కటే. తల్లిదండ్రులు కావాలని కలలు కనేవారికి, వారు ఆహ్వానించాలనుకునే పిల్లల కోసం మనం ఎలాంటి ప్రపంచాన్ని అందిస్తున్నాం? దీనికి మనం ఇచ్చే సమాధానమే మన భవిష్యత్‌ను, మన మానవత్వాన్ని నిర్ణయిస్తుంది.
వరల్డ్ పాపులేషన్ డే 2026 జనాభాని శాతాల్లో, గ్రాఫ్‌లలో కాకుండా మనుషుల కోణంలో చూడమని కోరుతోంది. ఎందుకంటే, జనాభా అనేది కేవలం భూమిపై ఎంతమంది ఉన్నారనేది కాదు. మనుషులకు తమ కలల జీవితాన్ని నిర్మించుకునే స్వేచ్ఛ, భద్రత, నమ్మకం ఉన్నాయా లేదా అనేదే ముఖ్యమని
చెబుతోంది.
– రమ జంబుల


