పీరియడ్ సేఫ్
వరుస కథనాలు
పిరియడ్స్ గురించిన అవేర్‌నెస్‌ను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవాల్సిందే
ఒక అమ్మాయి స్కూల్‌కు సెలవు పెట్టడానికి
ఒక క్రీడాకారిణి మైదానానికి దూరంగా ఉండడానికి
ఉద్యోగినులు చాలాసార్లు ఇబ్బంది పడటానికి
ఈ సమస్య పై అవగాహన లోపమే కారణం.
శరీరం పెట్టే ఇబ్బంది కంటే సమాజం చేస్తున్న అవమానమే జాస్తి.
చైతన్యం కోసం అందరూ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.
సినిమా రంగంలో కూడా ‘ప్యాడ్‌మ్యాన్’ వంటి సినిమాలు నిశ్శబ్దంగా ఉన్న గోడలను బద్దలు కొట్టాయి. ఇప్పుడు ‘పిరియడ్ సేఫ్’ పేరుతో మన వంతు కాంపెయిన్ మనం చేశాం.
స్కూల్ పిల్లల నుంచి జాతీయ క్రీడాకారిణుల వరకు వారి గొంతు విన్నాం. కానీ... ఇది సరిపోదు. ఈ సంభాషణ ఇక్కడితో ఆగకూడదు. ప్రతి అమ్మాయికి సురక్షితమైన గౌరవప్రదమైన పిరియడ్ దక్కే వరకు మన పోరాటం ఆగదు. ఈరోజు మనం మాట్లాడింది రక్తం గురించి కాదు. రేపటి తరం ధైర్యం గురించి.
నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమస్యలకు పరిష్కారాలు తెలియజేస్తున్నవారి సూచనలను మనమూ పాటిద్దాం. మన ఇంట్లోనూ పీరియడ్ ఫేజ్ నిశ్శబ్దపు గోడలను కూల్చేద్దాం. ‘ఆ రోజులలో’ ఆమె పరిస్థితిని అర్థం చేసుకుందాం.. అండగా ఉందాం..
టీచర్లే ముందు గుర్తించగలరు
మాది కో ఎడ్యుకేషన్ స్కూల్. అబ్బాయిలకన్నా అమ్మాయిల సంఖ్యే అధికం. నెలసరి సమయంలో అమ్మాయిల శారీరక, మానసిక స్థితి ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి దానిపై వారికి అవగాహన కోసం ఏడాదికి మూడుసార్లైనా అవేర్‌నెస్ క్యాంపులను ఏర్పాటు చేయిస్తాం. అమ్మాయిల నెలసరి సమస్యలను అడిగి తెలుసుకుంటాం. నెలసరి సమయంలో శుభ్రత పాటించకపోతే భవిష్యత్తులో ఎలాంటి ఇన్ఫెక్షన్లు వస్తాయి, అవి దీర్ఘకాలం ఎలా బాధిస్తాయో వివరిస్తాం. ఇన్ఫెక్షన్లు వచ్చిన మహిళలు తల్లులు కావాలనుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియజేస్తాం. శానిటరీ ప్యాడ్స్ వాడకం గురించి చెబుతూ, ఎన్జీవోల సాయంతో స్కూల్స్‌కి శానిటరీ ప్యాడ్స్ తెప్పిస్తుంటాం. ఆరు నెలలకు సరిపడా అమ్మాయిలకు కావల్సిన ప్యాడ్స్ ఒకేసారి పంపిణీ చేస్తాం. ఆరోగ్యంగా ఎదగడానికి కావల్సిన అవగాహన స్కూల్‌లో కలిగిస్తాం. – వాణీ సక్కుబాయి, జెడ్‌పిహెచ్‌ఎస్ టీచర్
ఇంటింటికీ వెళ్లి అవగాహన
ఆశావర్కర్‌గా ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్నాను. గ్రామీణ ప్రాంతంలో తల్లీ పిల్లల ఆరోగ్య సంరక్షణ గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రసవం తర్వాత మహిళలు చాలా సమస్యలు ఎదుర్కొంటుంటారు. అధిక రక్తస్రావం, నెలసరి సక్రమంగా రాకపోవడం, రక్తహీనత వంటి సమస్యల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మహిళలకు చెబుతుంటాం. స్కూళ్లకు వెళ్లి నెలసరి సమయంలో శుభ్రత లేకపోతే వచ్చే సమస్యల గురించి వివరించడం, సర్వైకల్ క్యాన్సర్ గురించి చెప్పడం, వ్యాక్సిన్లు వేయించడం చేస్తుంటాం. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఆ బిడ్డ తల్లి అయ్యి, ఆరోగ్యకర జీవనం గడిపే వరకు మా పాత్ర ఉంటుంది. ఫోన్ల ద్వారానూ, ఇంటింటికి వెళ్లి కూడా మా సేవలను అందిస్తాం.
– గంగిలి ధనలక్ష్మి, ఏఎన్‌ఎమ్
తరచూ వర్క్‌షాప్స్
మేం వాటర్, శానిటరీ క్లీనింగ్‌కు సంబంధించి వర్క్ చేస్తుంటాం. దీంట్లో భాగంగా తరచూ యువతులకు, మహిళలకు శుభ్రతకు సంబంధించిన వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంటాం. ఉపయోగించిన ప్యాడ్స్‌ను ఎలా డిస్పోజ్ చేయాలో చెబుతాం. మట్టిలో పూడ్చిపెట్టడం కన్నా వాడిన ప్యాడ్స్‌ను కాల్చేయమని సూచిస్తాం. పీరియడ్స్ వచ్చిన సమయంలో చేతులు, డ్రెస్సుల శుభ్రత, ప్యాడ్స్ మార్చుకోవడం, ఇన్ఫెక్షన్స్ గురించి తరచూ చెబుతుంటాం. కొందరు తమ సమస్యలను నేరుగా వచ్చి, చర్చిస్తుంటారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల శుభ్రతను పాటించడం కూడా చాలా ముఖ్యం.
– రేవతి, వాటర్ ఎయిడ్ ఇండియా, స్వచ్ఛంద స్వస్థ కమ్యూనిటీ ఫెసిలిటేటర్
కుటుంబ మద్దతు అవసరం
నెలసరి సమయంలో అమ్మాయిల మనస్తత్వంలో చాలా మార్పులు ఉంటాయి. వారు తినే ఆహారం, పెరిగిన వాతావరణం కూడా వారి శారీరక, మానసిక ఆరోగ్యాలపై ప్రభావం చూపుతుంటాయి. ముఖ్యంగా చదువుకునే పిల్లలు నెలసరి సమయంలో వచ్చే సమస్యలను అంత సులువుగా అర్థం చేసుకోలేక ఆందోళన పడుతుంటారు. ఆ సమయంలో వారికి మనస్తత్వ నిపుణుల కౌన్సెలింగ్ అవసరం. ఉద్యోగినులు నెలసరి సమయంలో తమ వర్క్ ప్లేస్‌లో బ్యాలెన్స్‌డ్‌గా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. ఇంట్లో మాత్రం చిన్న విషయాలకు కూడా తీవ్రంగా ప్రతిస్పందిస్తారు. పీరియడ్స్ ఉన్నవారి మనస్తత్వాన్ని అర్ధం చేసుకుంటూ కుటుంబం వారికి మద్దతుగా ఉండాలి. అప్పుడే ‘ఆమె’ సంతోషంగా ఉంటుంది. కుటుంబమూ సంతోషంగా ఉంటుంది.
– డాక్టర్ సునీతాప్రసాద్, సైకాలజిస్ట్
నిర్వహణ: నిర్మలారెడ్డి


