యోగా
విపరీత కరణి ఆసనం ఒక సరళమైన కానీ అత్యంత ప్రభావవంత మైన ఆసనం. రోజుకు కేవలం 10–15 నిమిషాలు ఈ ఆసనం సాధన చేస్తే శరీరానికి విశ్రాంతి, మనసుకు ప్రశాంతత, జీవితానికి సానుకూల శక్తి లభిస్తాయి. విపరీత కరణి అనే సంస్కృత పదంలో ‘విపరీత’ అంటే తలకిందులైన లేదా వ్యతిరేకమైన, ‘కరణి’ అంటే చర్య లేదా స్థితి. ఈ ఆసనంలో శరీరాన్ని విశ్రాంతిగా ఉంచి, కాళ్లను గోడకు ఆనించి పైకి ఎత్తుతారు. ఇది శరీరానికి, మనసుకు ప్రశాంతతను అందించే యోగాసనం.
ప్రయోజనాలు...
ఒత్తిడి, ఆందోళన, టెన్షన్ ను తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
కాళ్లలో నిలిచిన రక్తం గుండె వైపు సులభంగా ప్రవహించడానికి సహాయపడుతుంది.
ఎక్కువసేపు నిలబడే వారు, నడిచే వారికి కాళ్ల నొప్పి, వాపు తగ్గించడంలో సహాయపడుతుంది.
నిద్రలేమి సమస్యలను తగ్గించి ప్రశాంతమైన నిద్రకు తోడ్పడుతుంది.
పెల్విక్ ప్రాంతంలో రక్తప్రసరణ మెరుగుపడటానికి సహాయపడుతుంది. హార్మోన్ల సమతుల్యతకు పరోక్షంగా ఉపయోగపడవచ్చు.
పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్‌ను ఉత్తేజపరిచి శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది.
అలసటను తగ్గించి శరీరానికి తాజాదనాన్ని అందిస్తుంది. థైరాయిడ్ సమస్యలను నియంత్రించడానికి సహాయపడుతుంది.
జాగ్రత్తలు....
తీవ్రమైన మెడ, వెన్నెముక గాయాలు ఉన్నవారు, అధిక రక్తపోటు లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు యోగా నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.
ఆసనం చేస్తూ ఎటువంటి ఒత్తిడి లేదా నొప్పి కలిగితే వెంటనే ఆపాలి.
భోజనం చేసిన వెంటనే చేయకూడదు. కనీసం 2–3 గంటల విరామం ఉండాలి.
- అనిత పాతర్ల, యోగా ట్రైనర్


