చిన్న పని అంటూ ఏదీ ఉండదు... ప్రతి అవకాశం గొప్ప విజయానికి పునాది కావచ్చు. ఈ మాటలను నిజం చేసింది బ్రిటన్‌కు చెందిన క్లేర్ పార్‌ఫిట్(Claire Parfitt). 14 ఏళ్ల వయసులో అంతరిక్ష కేంద్రంలో స్పేస్ టాయిలెట్‌ను శుభ్రం చేసిన ఆమె.. ఇవాళ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA)లో భవిష్యత్ మార్స్ అన్వేషణ మిషన్‌లకు నాయకత్వం వహిస్తోంది..ఆమె ప్రస్థానం ఎలా మొదలైందంటే..
నాటింగ్‌హామ్‌కు చెందిన క్లేర్‌కు చిన్నప్పటి నుంచే అంతరిక్షంపై మక్కువ. వర్క్ ఎక్స్‌పీరియెన్స్ కోసం తొలుత నాసాకు దరఖాస్తు చేసినా అవకాశం రాలేదు. తర్వాత లీసెస్టర్‌లోని నేషనల్ స్పేస్ సెంటర్( National Space Centre)లో అవకాశం దక్కింది. ఆ సమయంలో స్పేస్ సెంటర్ ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతుండగా, కొత్తగా వచ్చిన ప్రదర్శన వస్తువులను విప్పడం, శుభ్రపరచడం వంటి బాధ్యతలను ఆమె నిర్వహించారు.
ఆ పనుల్లోనే అంతరిక్ష యాత్రల్లో ఉపయోగించే స్పేస్ టాయిలెట్‌ను శుభ్రం చేయడం కూడా ఒకటి. అలాగే అంతరిక్షంలోకి వెళ్లిన తొలి బ్రిటిష్ వ్యోమగామి హెలెన్ షార్మన్ Helen Sharman ఉపయోగించిన స్పేస్‌సూట్‌ను విప్పి పరిశీలించే అవకాశం కూడా ఆమెకు లభించింది. ఆ సూట్‌ను చూసిన క్షణం.. " ఏదో నిధి పెట్టెను తెరిచినంత ఆనందం కలిగింది" అని ఆ రోజులను క్లేర్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.
ఆ చిన్న అవకాశం ఆమె జీవితాన్నే మార్చేసింది. ఫిజిక్స్‌లో డిగ్రీ, స్పేస్‌క్రాఫ్ట్ పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసిన క్లేర్ అంతరిక్ష పరిశోధన రంగంలో అడుగుపెట్టి, వరుసగా కీలక ప్రాజెక్టుల్లో పనిచేశారు. ముఖ్యంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టిన రోసాలిండ్ ఫ్రాంక్లిన్ ఎక్సోమార్స్ రోవర్ మిషన్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2028లో ప్రయోగించనున్న ఈ రోవర్ అంగారక గ్రహంపై జీవం ఆనవాళ్ల కోసం అన్వేషణ చేపట్టనుంది. అలాగే భూమిపై సౌర గాలుల ప్రభావాన్ని అధ్యయనం చేసే స్మైల్ (SMILE) మిషన్‌లో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు.
2019లో నెదర్లాండ్స్‌లోని ESA పరిశోధనా కేంద్రంలో చేరిన క్లేర్ ప్రస్తుతం..మార్స్‌పై భవిష్యత్ మానవ, రోబోటిక్ మిషన్‌ల ప్రణాళిక బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా మార్స్ పరిశోధనలను సమన్వయం చేసే International Mars Exploration Working Groupకు ఛైర్‌గా కూడా ఉన్నారు.
మార్స్‌ను అధ్యయనం చేయడం మానవాళి భవిష్యత్తుకు ఎంతో కీలకమని క్లేర్ చెబుతున్నారు. 2028లో రోసాలిండ్ ఫ్రాంక్లిన్ రోవర్ ప్రయోగం ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుందని, ఆ తర్వాత మానవ యాత్రలకు అవసరమైన సాంకేతికత, ప్రణాళికలను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అదే సమయంలో మార్స్ సహజ స్వరూపానికి ఎలాంటి నష్టం జరగకుండా శాస్త్రీయ పరిశోధనలు కొనసాగించడం కూడా తమ బాధ్యత అని స్పష్టం చేశారు.
తన విజయానికి చిన్ననాటి ఉపాధ్యాయుల ప్రోత్సాహం, నేషనల్ స్పేస్ సెంటర్‌లో లభించిన తొలి అవకాశం ప్రధాన కారణాలని క్లేర్ చెబుతున్నారు. ఆ సంస్థకు అప్పటి డైరెక్టర్‌గా ఉన్న మహిళను చూసి తానూ ఒకరోజు అంతరిక్ష రంగంలో నాయకత్వ స్థాయికి చేరాలనే ఆత్మవిశ్వాసం కలిగిందని గుర్తు చేసుకున్నారు.
స్పేస్ టాయిలెట్‌ను శుభ్రం చేసిన విద్యార్థిని నుంచి మార్స్ మిషన్‌లకు నాయకత్వం వహించే శాస్త్రవేత్తగా ఎదిగిన క్లేర్ పార్ఫిట్ ప్రయాణం... చిన్న అవకాశాన్ని కూడా అంకితభావంతో స్వీకరిస్తే అది జీవితాన్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందో చెప్పే స్ఫూర్తిదాయక గాథగా నిలిచింది.
(చదవండి: ప్లీజ్ మంచి తల్లిగా మారండి..! ఆ తర్వాతే ఇంకేదైనా..)


