ITR ఫైలింగ్‌కు మూడు మార్గాలు! | Three Ways to File Your Income Tax Return Which One Is Right for You | Sakshi
Sakshi News home page

ITR ఫైలింగ్‌కు మూడు మార్గాలు!

Jul 6 2026 8:06 AM | Updated on Jul 6 2026 8:54 AM

Three Ways to File Your Income Tax Return Which One Is Right for You

ఈ నెలాఖరులోపల మీరందరూ మీ మీ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్నులు దాఖలు చేయాలి. అంటే గడువు తేదీ 2026 జూలై 31. ఆన్‌లైన్‌లో వేయాలంటే ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల లోపల ఫైల్‌ చేయాలి.

గతంలో ఎన్నోసార్లు రిటర్ను వేయడానికి కావాల్సిన సమాచారం గురించి, కాగితాలు-డాక్యుమెంట్ల ఆవశ్యకత గురించి మనం తెలుసుకున్నాం. రంగంలోకి దిగే ముందు మీకు మూడు ఆప్షన్లు ఉంటాయి. అవేంటంటే..

మొదటిది.. మీ రిటర్ను మీరే దాఖలు చేసుకోవచ్చు. మీ కేసు ట్యాక్స్‌ ఆడిట్‌ కాకపోతే మీ వ్యవహారాలకు ఎటువంటి ఆడిట్‌ అక్కర్లేదు. ఆడిట్‌ రిపోర్టు ప్రశ్న ఉండదు. పాత చట్టం ప్రకారం ఫారం 16, 16ఏ, ఫారం 26ఏఎస్‌ .. మొదలైన క్యాపిటల్‌ గెయిన్స్‌ స్టేట్‌మెంట్, ఇతర సర్టిఫికెట్లు, రెడీగా పెట్టుకోండి. కరెక్ట్‌ ఫారం ఎంచుకోండి. లాగిన్‌ అవ్వండి. ఇది ప్రీ-ఫిల్డ్‌ ఫారం. మీరు ఓపెన్‌ చేయగానే ‘సమాచారం’ అప్పటికే నింపి ఉంటుంది. అది కరెక్ట్‌ అయితే ఓకే.. లేదా విభేదించి కరెక్టు సమాచారం నింపుతూ వెళ్లండి. రిటర్న్‌ ఫైలింగ్‌ సాఫీగా జరిగిపోవచ్చు. మీకు ఖర్చులేమీ ఉండవు. అంతా మీ చేతిలోనే.. ఫారం 1 వరకు ఫర్వాలేదు.

రెండోది. ఇన్‌కంట్యాక్స్‌ ప్రాక్టీషనర్ల దగ్గరికి వెళ్తే వారు మీ తరఫున పోర్టల్‌లోకి వెళ్లి, లాగిన్‌ చేసి, మీరు చేయవలసినవన్నీ చకచకా చేసేస్తారు. ఫీజులు తక్కువగా ఉంటాయి. ఫారం 1, ఫారం 2 వరకు బాగానే ఫైలింగ్‌ చేస్తారు.

మూడో కేటగిరీ.. వృత్తి నిపుణులు.. అంటే.. సీఏలు, కాస్ట్‌ అకౌంటెంట్లు, కొంత మంది కంపెనీ సెక్రటరీలు, సీనియర్‌ లాయర్లు.. వీరు కూడా మీ తరఫున మీ ఆదాయపు పన్ను రిటర్నులు వేస్తారు. వీరికి సబ్జెక్టు మీద పట్టు, ప్రతిభా పాటవాలు, అనుభవం, అవగాహన విశ్లేషణ సామర్థ్యాలు విశేషంగా ఉంటాయి. ఉన్న నాలుగు అంకెలను నాలుగు కాలమ్‌లలో వేసి, మమ అనిపించి ఒక అక్నాలెడ్జ్‌మెంట్‌ తేవడమనేది రిటర్ను వేయడం కాదు.. ఓ కాగితాన్ని డిపార్ట్‌మెంటు వారికి ఇచ్చి ‘అయ్యింది’  అని చేతులు దులుపుకోవడం కాదు.

ముందుగా ఆదాయం ఏమిటో తెలుసుకోవాలి. ప్రతి రశీదు/జమ ఆదాయం కిందికి రాదు. దాన్ని విశ్లేషణ చేయాలి. ఉదాహరణకు: వచ్చిన రసీదు వ్యాపారపరమా – ఇతర సోర్స్‌ ద్వారా వచ్చిందా? పాత చట్టం ప్రకారం 26ఏఎస్‌లో ప్రతి అంశం, ఏఐఎస్‌లోని ప్రతి అంశం, వీటిని మీ మీ ఆదాయంతో చెక్‌ చేయాలి. ఒకదానితో ఒకటి సమన్వయం చేయాలి. అప్పు అని నిర్ధారించినా దాని గత చరిత్ర తోడి, నిజానిజాలు తేల్చాలి. పన్నుకి గురి కాని రశీదు, జమ కావొచ్చు. ఉదాహరణకు ప్రావిడెంట్‌ ఫండ్‌ క్రెడిట్, జీతాల ఎరియర్స్‌ అయితే గత సంవత్సరాలు వెనక్కి వెళ్లి, పాత ఆదాయం ఎంత, ఎరియర్స్‌ ఎంత .. మారిన ఆదాయం ఎంత, పన్ను భారం ఎంత.. చివరికి రిలీఫ్‌ ఎంత అనేది తేల్చాలి.

రెండు.. మూడు లేదా.. అంతకు మించి ఇంటి ప్రాపర్టీలు ఉంటే పెద్ద చిట్టా తయారవుతుంది. ప్రతి ప్రాపర్టీ విషయంలో అంశాలు ఒకే విధంగా ఉండవు. అన్నింటినీ క్రోడీకరించి, సమీకరించాలి. అలాగే క్యాపిటల్‌ గెయిన్స్‌.. కొన్న ధర, ఇంప్రూవ్‌మెంట్‌ ధర ప్రతీ ఏటా మారే ఇండెక్స్‌ రేటు.. వ్యవహారంలో మొత్తం నగదు లేకుండా జాగ్రత్త పడటం.. స్టాంప్‌ పేపర్లు దస్తావేజులు, టైటిల్, ఈ-సీల్, బ్యాంకు లోన్‌ డాక్యుమెంట్లు.. ఇలా సవాలక్ష.. వీటన్నింటిని విశ్లేషించాలి.

విదేశీ ఆస్తులు.. విదేశీ ఆదాయం..
ఉద్యోగస్తులకు ఇచ్చే షేర్లు, ఆప్షన్లు, ఎసాప్‌లు, వాటి అమ్మకం, విలువ, లాభం.. ఇతర అంశాలు ఇవన్నీ తెలుసుకుని, తేల్చి, రిటర్ను వేసిన తర్వాత నోటీసులు రావచ్చు. నోటీసులు, జవాబులు, దిద్దుబాటు, సర్దుబాటు.. అధికారులతో మాట్లాడి లేదా ఆన్‌లైన్‌లో సంప్రదించి సరైన జవాబు ఇవ్వడం, నొప్పించక ఒప్పించి, మెప్పించే ప్రయత్నం .. ఇలా ఎన్నో అంశాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలి. స్క్రూటినీ దాకా బండి వెళ్లొచ్చు. వీటికి డాక్యుమెంట్లు ముఖ్యం. చట్టం తెలిసి ఉండాలి. అధికారులను కలిసి మాట్లాడాలి.

అయితే, వృత్తి నిపుణుల సర్వీసులు పొందడానికి ఎక్కువ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒక పద్ధతి ప్రకారం.. అంటే ప్రాసెస్‌ ప్రకారం వెళ్లండి. కప్పదాట్లు ఉండవు. షార్ట్‌కట్‌లు, లాంగ్‌జంప్‌లు.. హై జంపులు ఉండవు. అన్ని వ్యవహారాల్లోలాగే కాగితాల్లోని అంకెల మేరకే అడుగువేస్తారు. ఆ సర్వీసుల్లో కన్సల్టెన్సీ, ముందు జాగ్రత్తగా ట్యాక్స్‌ ప్లానింగ్‌ ఆలోచనలు, సలహాలు ఇలా ఎన్నో ఉంటాయి.. ఏది చేసినా చట్టప్రకారం చేస్తారు. ఏ చర్య అయినా చట్టానికి లోబడే ఉంటుంది. వడ్డీలు లేకుండా, పెనాల్టీలు లేకుండా ముందు జాగ్రత్త తీసుకుంటారు. ఇప్పుడు మీ ఇష్టం. నిర్ణయం మీదే. ఎలా చేసినా.. చట్టప్రకారంగానే ఉండాలని గుర్తుంచుకోవాలి.


ట్యాక్సేషన్‌ నిపుణులు: డా. కందాళ సత్యనారాయణ మూర్తి & కె.వి.ఎన్‌ లావణ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement