వైభవ్ సూర్యవంశీ ట్యాక్స్ ఎవరు కట్టాలి?: రూల్స్ ఏం చెబుతున్నాయ్! | Vaibhav Suryavanshi Earns Rs 7 Crore at 15 Who Pays the Tax | Sakshi
Sakshi News home page

వైభవ్ సూర్యవంశీ ట్యాక్స్ ఎవరు కట్టాలి?: రూల్స్ ఏం చెబుతున్నాయ్!

Jun 5 2026 2:41 PM | Updated on Jun 5 2026 3:41 PM

Vaibhav Suryavanshi Earns Rs 7 Crore at 15 Who Pays the Tax

15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శన కనపరిచి.. అందరినీ ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే.. ఇతడు ఐపీఎల్‌ కాంట్రాక్టులు, ఎండార్స్‌మెంట్స్, స్పాన్సర్‌షిప్‌ డీల్స్‌ ద్వారా సుమారు రూ.7 కోట్ల వరకు ఆర్జించినట్లు సమాచారం. ఇంత చిన్న వయసులో అతనకి వస్తున్న భారీ ఆదాయానికి పన్నులు ఎవరు కట్టాలి? అనేది చాలామంది తెలుసుకోవాల్సిన ప్రశ్న. దీనికి సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. మైనర్ పిల్లల (18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నవారు) ఆదాయానికి డైరెక్ట్ ట్యాక్స్ అంటూ ఉండదు. కాబట్టి.. వీరి ఆదాయాన్ని తల్లిదండ్రుల ఆదాయంగానే పరిగణిస్తారు. పిల్లలు సంపాదించినప్పటికీ.. దానికి సంబంధించిన ట్యాక్స్ తల్లిదండ్రులు చెల్లించాలన్నమాట.

సెక్షన్ 99 ప్రకారం (మునుపటి సెక్షన్ 64(1A) స్థానంలో), మైనర్ ఆదాయం.. తల్లిదండ్రులలో ఎవరి మొత్తం ఆదాయం ఎక్కువగా ఉంటుందో, వారి ఆదాయంతో కలిపి లెక్కిస్తారు. తల్లిదండ్రులు విడిపోయిన సందర్భంలో.. పిల్లలను చూసుకునే తల్లి లేదా దండ్రి ఆదాయంలో అది కలుస్తుంది. దీంతో పిల్లల పేరుతో పెట్టుబడులు పెట్టినా, వాటి ద్వారా వచ్చిన వడ్డీ లేదా ఇతర లాభాలు సాధారణంగా తల్లిదండ్రుల పన్ను పరిధిలోకి వస్తాయి.

అయితే.. ఈ నియమానికి ఒక ముఖ్యమైన మినహాయింపు ఉంది. పిల్లలు తన సొంత ప్రతిభ, నైపుణ్యం, కృషి లేదా ప్రత్యేక జ్ఞానం ద్వారా సంపాదిస్తే, ఆ ఆదాయం తల్లిదండ్రుల ఆదాయంలో కలపరు. ఈ కారణం చేతనే.. వైభవ్ సూర్యవంశీ వంటి క్రీడాకారుల ఆదాయానికి నేరుగా వారి పేరుతోనే పన్ను విధించడం జరుగుతుంది.

ఇదీ చదవండి: బంగారం పెట్టుబడులపై ఆంక్షలు.. HDFC కీలక నిర్ణయం!

ఈ నిబంధన కేవలం క్రీడాకారులకు మాత్రమే కాకుండా.. యూట్యూబర్లు, సోషల్ మీడియా క్రియేటర్లు, బాల నటులు, ఈస్పోర్ట్స్ ప్లేయర్లకు కూడా వర్తిస్తుంది. పిల్ల తన సొంత ప్రతిభతో సంపాదిస్తే.. ఆ ఆదాయం అతని లేదా ఆమె పేరుతోనే పన్ను విధించడం జరుగుతుంది. పిల్లల 18  సంవత్సరాలు పూర్తయితే నియమాలు మారిపోతాయి. అప్పుడు అతను లేదా ఆమె స్వతంత్రంగా పన్ను చెల్లింపుదారుడిగా మారి, తన ఆదాయానికి తానే బాధ్యత వహించాలి.

Advertisement
 
Advertisement
Advertisement