ప్రస్తుత ఆర్థిక, మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో బంగారం పెట్టుబడులపై నియంత్రణ చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ (HDFC Mutual Fund) తన గోల్డ్ ఆధారిత పథకాల్లో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి సబ్‌స్క్రిప్షన్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ తీసుకున్న ఈ నిర్ణయం.. గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ పథకాలకు వర్తిస్తుంది. మార్కెట్ పరిస్థితులు మెరుగుపడే వరకు ఈ పరిమితులు కొనసాగుతాయని ఫండ్ హౌస్ స్పష్టం చేసింది.
'హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్ ఈటీఎఫ్'లో పెద్ద పెట్టుబడిదారులు.. నేరుగా ఫండ్ హౌస్ ద్వారా పెట్టే పెట్టుబడులు జూన్ 8, 2026 నుంచి స్వీకరించబడవు. అంటే. ఒక్కసారిగా భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టే అవకాశం తాత్కాలికంగా నిలిపివేశారన్నమాట. ప్రత్యేకంగా రూ.25 కోట్లకు పైగా పెట్టుబడులపై ఈ నిబంధన వర్తిస్తుంది.
అదే విధంగా 'గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్'లో ఒక PANకి నెలకు గరిష్టంగా రూ.10 లక్షల వరకు మాత్రమే పెట్టుబడులు అనుమతిచడం జరుగుతుంది. జూన్ 5, 2026 సాయంత్రం 3 గంటల తర్వాత వచ్చిన ఆర్డర్లకు ఈ పరిమితి అమలులోకి వస్తుంది. అయితే.. ఈ పథకాలకు సంబంధించి ఇతర నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదు. అంటే రెగ్యులర్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు కొనసాగుతాయి.
హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం.. బంగారం దిగుమతులపై పెరిగిన పన్నులు. కాగా.. ప్రభుత్వం ఇటీవల బంగారం, వెండి దిగుమతులపై ప్రభావవంతమైన పన్నును 9.2% నుంచి 18.4%కి పెంచింది. ఈ మార్పు మే 13, 2026 నుంచి అమలులోకి వచ్చింది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధరలు కూడా పెరుగుతున్నాయి.
ఇదీ చదవండి: టాప్‌లో ఇన్ఫోసిస్ బాస్.. విప్రో సీఈఓ వేతనం ఎంతంటే?


