వియత్నాంలోని క్వాంగ్ నామ్ ప్రావిన్స్‌లోని ఒక మారుమూల ప్రశాంతమైన గ్రామం లో.. 81 ఏళ్ల రైతు థాయ్ న్గోక్ నివసిస్తున్నాడు. అతని కథ ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజలను మాత్రమే కాదు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఒక్కరోజు నిద్ర లేకపోతేనే సడలి, వడలిపోయే సాధారణ మనుషుల ధోరణికి భిన్నంగా ఈ రైతు జీవితం ఉండడమే ఈ ఆశ్చర్యాలకు కారణం. ఒకటీ రెండూ కాదు ఏకంగా 62 ఏళ్ల నుంచీ ఈ తాత కళ్లు మూతపడలేదట.
గత 1962 నుంచి ఒక్క క్షణం కూడా నిద్రపోలేదని న్గోక్ పేర్కొన్నాడు. వియత్నాం యుద్ధంలో తీవ్రమైన జ్వరం నుంచి కోలుకున్న తర్వాత, 20 సంవత్సరాల వయసులో అతనికి ఈ అసాధారణ పరిస్థితి ప్రారంభమైంది. జ్వరం తగ్గింది కానీ, అతని నిద్ర సామర్థ్యం తిరిగి రాలేదు. ఆరు దశాబ్దాల క్రితం అధిక జ్వరం తర్వాత తన నిద్రలేమి ప్రారంభమైందని ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ న్గోక్ గుర్తుచేసుకున్నాడు. ‘నేను మందులు తీసుకున్నాను, ఇంటి చిట్కాలు ప్రయత్నించాను, నిద్రపోవడానికి మద్యం కూడా తాగాను, కానీ ఏదీ పని చేయలేదు.‘ అంటూ చెప్పాడు. అతని కుటుంబ సభ్యులు పొరుగువారు కూడా ఇన్ని సంవత్సరాలలో అతను ఎప్పుడూ నిద్రపోవడం తాము చూడలేదని చెబుతున్నారు.
అయినప్పటికీ, న్గోక్ అసాధారణంగా అందరిలాగే చురుకైన జీవితాన్ని గడుపుతున్నాడు. ప్రతిరోజూ, అతను తన పొలానికి వెళ్తాడు, భారీ బరువులు ఎత్తుతాడు, రైస్ వైన్ తయారు చేస్తాడు పొరుగువారితో చాట్ చేస్తాడు. మనుగడ కు మానసిక ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యమైనదని భావించే ప్రపంచంలో, అతని కథ మానవ జీవశాస్త్రం గురించి సైన్స్ మనకు చెప్పే ప్రతిదానినీ సవాలు చేస్తుంది.
మీడియా నివేదికల ప్రకారం, పలువురు వైద్యులు ఆ గ్రామాన్ని సందర్శించి న్గోక్ ను చాలాసార్లు పరీక్షించారు అతనికి ఎటువంటి ముఖ్యమైన ఆరోగ్య సమస్యలు లేవని కనుగొన్నారు. అతని రక్తపోటు, గుండె. మెదడు అన్నీ సాధారణంగానే పనిచేస్తున్నాయి. అదే వైద్య నిపుణులను కలవరపెడుతుంది, ఎందుకంటే జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తి అంతర్గత అవయవాల పనితీరు కోసం శరీరం విశ్రాంతిపై ఆధారపడటం వల్ల మానవులు నిద్ర లేకుండా కొన్ని రోజుల కంటే ఎక్కువ కాలం జీవించలేరని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి.
గత 2023లో, అమెరికన్ ట్రావెల్ యూట్యూబర్ డ్రూ బిన్సీక న్గోక్ ఇంటికి వెళ్లాడు. అతనితో గడిపిన బిన్సీ్క, న్గోక్ కార్యకలాపాలను నిశితంగా గమనించాడు తన పొలాలకు వెళ్లి పనిచేయడం, రైస్ వైన్ తయారు చేయడం.. అవన్నీ అయిపోయాక అతను నిశ్శబ్దంగా, పూర్తిగా మేల్కొని కూర్చోవడం చూశాడు. పెద్ద మొత్తంలో మద్యం సేవించిన తర్వాత న్గోక్ అప్పుడప్పుడు ఒకటి లేదా రెండు గంటలు విశ్రాంతి పొంది ఉండవచ్చని బిన్సీక తన యూట్యూబ్ వీడియోలో పేర్కొన్నాడు, అయితే ఇది వైద్యపరంగా ఎప్పుడూ నిర్ధారితం కాలేదు.
విచిత్రమేమింటే... న్గోక్ రోజువారీ అలవాట్లు కూడా ఆరోగ్యకరమైనవి కావు...పైగా ఆందోళనకరంగా ఉంటాయి. డ్రూ బిన్సీక వీడియో ప్రకారం, అతను దాదాపు రోజుకు అర లీటరు రైస్ వైన్ తీసుకుంటాడు, దాదాపు 70 సిగరెట్లు తాగుతాడు. అయినప్పటికీ అతను శారీరకంగా చురుకుగా ఉంటాడు, వ్యవసాయం చేస్తూనే ఉంటాడు
సాయంత్రం తర్వాత విశ్రాంతి తీసుకునే గ్రామంలోని ఇతరుల మాదిరిగా కాకుండా, తన రాత్రులను పనిలో లేదా ఆలోచనలో న్గోక్ గడుపుతాడని స్థానికులు చెబుతున్నారు. అతని ఇలాంటి పరిస్థితి అతన్ని ఇప్పుడు ప్రపంచ ఉత్సుకతగా మార్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన న్గోక్ కథ, విస్మయం, ప్రశంస సానుభూతి మిశ్రమాన్ని రేకెత్తించింది. కొంతమంది ఆన్‌లైన్ వినియోగదారులు అతని బలం, ఉత్పాదకతను ప్రశంసిస్తూ, ‘నేను చనిపోయినప్పుడు నిద్రపోతాను‘ అనే నానుడిని న్గోక్ మరొక స్థాయికి తీసుకెళ్లాడని చమత్కరించారు.
మరికొందరు అతని పరిస్థితిని యుద్ధ గాయం తాలూకు శాశ్వత ప్రభావంగా, విషాదకరమైన జ్ఞాపకంగా పరిగణించారు, వియత్నాం యుద్ధం ప్రసాదించిన బాధాకరమైన ఒత్తిడికి అతని నిద్రలేమికి ముడిపడి ఉండవచ్చని భావిస్తున్నారు. ‘ఇది యుద్ధం తాలూకు శాశ్వత ప్రభావాలను చూపిస్తుంది అనుభవజ్ఞులు ఏమి అనుభవిస్తారో వెలుగులోకి తెస్తుంది. ఈ వ్యక్తి తన నిద్రలేని సంవత్సరాలలో అద్భుతమైన పని చేశాడు, కష్టపడి పనిచేస్తూ తన అద్భుతమైన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు
(చదవండి: 'ఆకాశమంత ప్రేమ' ఈ నాన్నది..! కూతురు కోసం ఏకంగా...))


