సాక్షి, గుంటూరు: చంద్రబాబు సర్కార్.. రైతుల పాలిట శాపంగా మారింది. ఏపీ రాజధాని అమరావతి రైతు గుండెకోతను మిగిల్చింది. మందడం గ్రామసభలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. మంత్రి నారాయణ ఎదుటే తన ఆవేదనను వెళ్లగక్కిన రైతు రామారావు.. తమను నారాయణే ముంచేశాడంటూ వాపోయారు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ.. కుప్పకూలిన రైతు.. మంత్రి నారాయణ చెప్పడం వల్లే వాగులో ప్లాట్లు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘ఇళ్లు తీసుకుంటానంటే తీసుకోండి. మాకు ఎక్కడ ఇస్తారంటే సీడ్ యాక్సెస్ రోడ్డులో ప్లాట్లు ఇవ్వండి. అమరావతికి మా పొలాలు ఇచ్చాం. సింగపూర్ వాళ్లకు ఇచ్చినదాంట్లోంచి మాకు 2 ఎకరాలు వాగులో ప్లాట్లు ఇచ్చారు. నారాయణ ఆర్డర్ అన్నారు. నారాయణ ఇవ్వమంటేనేగా వాళ్లు ఇచ్చింది..?. ఇంత లోతు నీళ్లు పడ్డాయి’’ అంటూ రైతు ఆవేదన చెందారు.

అందరికీ సీడ్ యాక్సెస్ రోడ్‌లోనే స్థలాలు ఇవ్వాలన్న రైతు.. ముక్కలు ముక్కలుగా ప్లాట్లు ఇస్తే తమ గొంతు కోసినట్లు అవుతుందన్నారు. ఎమ్మెల్యే సర్ధి చెప్పబోయినా తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పి.. ఆ రైతు కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా రైతు రామారావు మృతిచెందారు.


