'ఆకాశమంత ప్రేమ' ఈ నాన్నది..! కూతురు కోసం ఏకంగా... | Daughter missed home-cooked meals; dad quits job Goes Viral | Sakshi
Sakshi News home page

'ఆకాశమంత ప్రేమ' ఈ నాన్నది..! కూతురు కోసం ఏకంగా...

Nov 12 2025 4:31 PM | Updated on Nov 12 2025 4:48 PM

Daughter missed home-cooked meals; dad quits job Goes Viral

కూతురు కోసం ఏ తండ్రైనా దేన్నైనా త్యాగం చేస్తాడు..ఎంత కష్టమైనా భరిస్తాడు. తమ కంటిపాప కంటే తమేకేది ఎక్కువ కాదు అనేంత ప్రేమను చూపిస్తారు. కానీ ఈ నాన్నలా ఇంతలా ప్రేమించడం మాత్రం కష్టమే. అందరి నాన్నల కంటే ఈ తండ్రి ప్రేమ అంతకుమించి..అని చెప్పొచ్చు. ఇతడి కూతురి ప్రేమను చూడగానే ఆకాశమంత మూవీలోని ఈ పాట తప్పక గుర్తుకొస్తుంది. 

"ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా..
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా.. అమ్మరా..
మేఘాల పల్లకి తెప్పిస్తా.. లోకాన్ని కొత్తగ చూపిస్తా.. వెన్నెలే తనపై కురిపిస్తా.." అంటూ సాగే పాట కళ్లముందు కదలాడుతుంది. ఆ సినిమాలో మాదిరిగానే ఈ తండ్రికి కూడా పై చదువుల కోస దూరంగా వెళ్తున్న కూతురిని విడిచిపెట్టి ఉండటం అస్సలు ఇష్టం ఉండదు. పైగా ఆమె అక్కడ భోజనం విషయంలో ఇబ్బంది పడుతుందని తెలిసి..మొత్తం మకాం ఆమె వద్దకు మార్చేశాడు. కూతురు పక్కన లేనిదే జీవితం వృధా అని మొత్తం తన లైఫ్‌నే త్యాగం చేసేశాడు. మరి ఆ ఆసక్తికరమైన ఆ పేరెంట్‌ కథేంటో చూసేద్దామా..!

చైనాకు చెందిన లీ బింగ్డ్‌ అనే టీనేజర్‌ జిలిన్ ప్రావిన్స్‌లో జిలిన్‌ నార్మల్‌ యూనివర్సిటీలో డిగ్రీ సెకండియర్‌ చదువుతోంది. దాదాపు ఒక ఏడాది తర్వాత బింగ్డ్‌ తన యూనివర్సిటీ క్యాంటిన్‌లో భోజనం అస్సలు బాగుండటం లేదని తండ్రి లీతో చెప్పింది. తాను ఇంటి భోజనం చాలా మిస్సవ్వుతున్నానని వాపోయింది. అంతే ఆ తండ్రి బార్బెక్యూ రెస్టారెంట్‌లో చేస్తున్న ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేసి..వంట మంచిగా చేయడం ఎలాగో శిక్షణ తీసుకున్నాడు. 

ఆ తర్వాత కూతురు ఉండే యూనివర్సిటీ సమీపానికి తన మకాం మార్చేసి..అక్కడే ఒక చిన్న ఫుడ్‌ స్టాల్‌ ఓపన్‌ చేశాడు. మొదటి రోజు అతడు వండిన వంటకాలకు స్వలంగానే లాభం పొందాడు. అది తన కూమార్తె బింగ్డ్‌ ట్యూటర్‌గా సంపాదించే దాంతో పోలిస్తే చాలా తక్కువనే చెప్పొచ్చు. తండ్రి శ్రమను చూసి చలించిపోయిన ఆ కూతురు..తన కథను సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. అంతేగాదు తన తండ్రి శుభ్రమైన వంటకు ప్రాధాన్యత ఇస్తాడని, అతని అమ్మకాలు మరింత మెరుగుపడాలంటే తగిన సలహాలు ఇవ్వగలరు అని పోస్ట్‌లో జోడించింది. 

వెంటనే ఈ పోస్ట్‌ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే గాక..తండ్రి ఫుడ్‌స్టాల్‌ వద్ద జనాలు క్యూలో నిలబడేలా రద్దీగా మారేందుకు దారితీసింది. కొత్తమంది కస్టమర్లు ఆమె తండ్రి వ్యాపారానికి మద్దతిచ్చేలా మరిన్ని ఆర్డర్‌లు కోరారు. అంతేగాదు ఆ తండ్రికి కూతురుపై ఉన్న అచంచలమైన ప్రేమకు ఫిదా అవ్వుతూ ప్రశంసల వర్షం కురిపించారు కూడా.

లాభం కంటే కూతుర చెంత చాలు..
స్టాల్‌ రద్దీగా మారిపోవడంతో లీ తన తండ్రికి సహాయం చేయడం ప్రారంభించింది. గత నెలలో స్టాల్‌ నడుపుతున్నప్పుడూ చాలాచలిగా అనిపించిందని, కానీ ఇప్పుడూ కస్టమర్ల తాకిడితో అది వెచ్చగా మారిపోయిందని చమత్కరిస్తోంది లీ. తన తండ్రి పెద్దపెద్ద లాభాలనేమి ఆశించడం లేదని, కేవలం తన కూతురుకి దగ్గరగా జీవించాలన్నదే తన ఆశ అని వివరించింది. 

తన తల్లి కొన్నేళ్ల క్రితమే లుకేమియాతో మరణించిందని, దాంతో తాము ఒకరిని ఒకరు విడిచి ఉండలేనంతగా ప్రేమను పెంచేసుకున్నామని బింగ్డ్‌ చెప్పుకొచ్చింది. చాలామంది నా తండ్రి లీ ప్రేమను చాలా గొప్పగా అభివర్ణిస్తున్నప్పటికీ..నాకు మాత్రం ఆయనప్రేమ సూర్యుడి వలే వెచ్చని హాయిని అందిస్తుందని సంతోషభరితంగా చెబుతోంది ‍కూతురు బింగ్డ్‌.

(చదవండి: హాట్‌టాపిక్‌గా అల్లు శిరీష్‌ ధరించిన నెక్లెస్‌..! ఆభరణాలు మగవాళ్లు ధరించేవారా?)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement