probe monitoring
-
ఐఏఎస్ రోహిణి సింధూరికి బిగ్ షాక్..
శివాజీనగర: కర్ణాటకలో సీనియర్ ఐఏఎస్ రోహిణి సింధూరికి ఊహించని షాక్ తగిలింది. కాటన్ బ్యాగుల కొనుగోలులో నిధుల దుర్వినియోగం జరిగాయనే ఆరోపణలపై సింధూరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.మైసూరుకు చెందిన న్యాయవాది ఎన్.ఆర్.రవిచంద్రేగౌడ సమర్పించిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ ఎన్.నాగప్రసన్న విచారించారు. ఆమె మీద విచారణకు అనుమతి నిరాకరిస్తూ సర్కారు ఇచ్చిన ఆదేశాలను జస్టిస్ రద్దు చేశారు. దర్యాప్తు ద్వారానే వాస్తవాలను బహిరంగపరచాలి, అప్పుడే ప్రజలకు నిజాలేమిటో తెలుస్తాయి అని పలు వ్యాఖ్యలు చేశారు. నాలుగు వారాల్లోగా వాస్తవాలను వెలికి తీసేందుకు విచారణకు ఆదేశించాలని ప్రభుత్వానికి సూచించారు. అవినీతిని నియంత్రించకపోతే అది రాజకీయ రంగాన్ని అస్థిరపరుస్తుందని, ప్రభుత్వ సంస్థలను నాశనం చేస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు.గతంలో రోహిణి సింధూరి మైసూరు కలెక్టర్‌గా ఉన్న సమయంలో స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా మైసూరులో ప్లాస్టిక్ సంచుల బదులుగా వస్త్రపు సంచులు కొనుగోలు చేసి, వితరణ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇందులో భాగంగా రూ.13 ధర కలిగిన బట్ట సంచులను రూ.52 ధరతో కొనుగోలు చేశారని, దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.7.65 కోట్ల నష్టం జరిగిందని న్యాయవాది పిటిషన్ వేశారు. -
నీట్ 2 లీకేజీ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీం నో
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ జిల్లాలో నీట్ 2 ప్రశ్నపత్రం లీకైందన్న ఆరోపణలపై న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఇటువంటి వాటిని కోర్టులు పర్యవేక్షించవని, కోర్టులు ఇందుకోసం ఏర్పాటు కాలేదని జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌కు తెలిపింది. హల్ద్వాని పోలీసులతో పాటు మరికొందరు ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నందున వారిని దర్యాప్తు పూర్తి చేయనివ్వాల్సిందిగా పిటిషనర్‌ను సూచించింది. ‘ఈ కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును మీరు మమ్మల్నెందుకు అడుగుతున్నారు. దీనిపై మీన్యాయవాదితో కలిసి హైకోర్టును సంప్రదించండి. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదు. ఈ కేసు దర్యాప్తును న్యాయస్థానం పర్యవేక్షించదు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసుల నిబద్ధతను మీరు ప్రశ్నించలేరు. ఈ కేసులో మేమెందుకు కలుగజేసుకోవాలి? ఇప్పటికే లోథా కమిటీ కూడా దీన్ని పరిశీలిస్తోంది.’ అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో పిటిషనర్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.


