నీట్ 2 లీకేజీ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీం నో
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ జిల్లాలో నీట్ 2 ప్రశ్నపత్రం లీకైందన్న ఆరోపణలపై న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ జిల్లాలో నీట్ 2 ప్రశ్నపత్రం లీకైందన్న ఆరోపణలపై న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఇటువంటి వాటిని కోర్టులు పర్యవేక్షించవని, కోర్టులు ఇందుకోసం ఏర్పాటు కాలేదని జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌కు తెలిపింది. హల్ద్వాని పోలీసులతో పాటు మరికొందరు ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నందున వారిని దర్యాప్తు పూర్తి చేయనివ్వాల్సిందిగా పిటిషనర్‌ను సూచించింది.
‘ఈ కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును మీరు మమ్మల్నెందుకు అడుగుతున్నారు. దీనిపై మీన్యాయవాదితో కలిసి హైకోర్టును సంప్రదించండి. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదు. ఈ కేసు దర్యాప్తును న్యాయస్థానం పర్యవేక్షించదు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసుల నిబద్ధతను మీరు ప్రశ్నించలేరు. ఈ కేసులో మేమెందుకు కలుగజేసుకోవాలి? ఇప్పటికే లోథా కమిటీ కూడా దీన్ని పరిశీలిస్తోంది.’ అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో పిటిషనర్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.


