వినూత్నంగా ప్రేమికుల రోజు
శివాజీనగర: కన్నడ చళవళి వాటాళ్ నాగరాజ్ పార్టీ అధ్యక్షుడు వాటాళ్ నాగరాజు ప్రేమికుల రోజును వినూత్నంగా ఆచరించారు. బెంగళూరు నగర సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద గాడిదలకు సంప్రదాయరీతిలో పెళ్లి చేశారు. పూలమాల వేసి మంగళసూత్రం సమర్పించి మంత్రాలు చదివించారు. ఆ సమయంలో మగ గాడిద హఠాత్తుగా పరిగెత్తి పోయింది. దీనిని వీక్షిస్తున్న జనం నవ్వులలో మునిగిపోయారు. నాగరాజు అనుచరులు మగ గాడిదను పట్టుకొచ్చి వివాహ ప్రక్రియను పూర్తి చేయించారు. వాటాళ్ మాట్లాడుతూ ప్రేమ అనేది మనుషులకు మాత్రమే పరిమితం కాదు, అది ప్రాణి–పక్షులకు కూడా ఉందన్నారు. గాడిద చాలా పవిత్రమైన ప్రాణి, పురాణాల్లో కూడా గాడిద ప్రస్తావనలు ఉన్నాయని తెలిపారు. ప్రేమ వివాహం చేసుకునే జంటలకు ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం చేసి, భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా, బెంగళూరులోని పార్కులు, హోటళ్లు ప్రేమజంటలతో కిటకిటలాడాయి. వీకెండ్ కూడా కావడంతో లవర్స్ డే సందడి ఉట్టిపడింది.
నందికొండ మూసివేత
యశవంతపుర: ప్రేమికుల దినోత్సవం నాడు నందికొండపై విహరించాలని వెళ్లిన ప్రేమజంటలకు, భార్యాభర్తలకు నిరాశే మిగిలింది. జిల్లా అధికారులు శనివారం నంది హిల్స్‌ను పూర్తిగా మూసివేశారు. ప్రేమికుల రోజున కొండపై అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ చర్య తీసుకున్నారు. ఉదయం నుంచే అనేక ప్రేమజంటలు బైక్‌లు, కార్లలో వచ్చాయి, కొండమీదకు వెళ్లడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అలాంటి వారిని పోలీసులు అడ్డుకుని వాపస్ పంపడంతో తీవ్రంగా నిరుత్సాహపడ్డారు. జిల్లా కలెక్టర్ ప్రభు బంద్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. కొండపైన గొడవలు, ప్రేమ విఫలమైనవారు ఆత్మహత్య చేసుకొనే ప్రమాదం ఉందని అన్ని మార్గాలను బంద్ చేశారు.
గాడిద జంటకు వివాహోత్సవం


