టీమిండియా చేతిలో ఓడినా పాకిస్తాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్ టోర్నీలో రెండుసార్లు 18 ఓవర్లపాటు స్పిన్ బౌలింగ్‌నే ప్రయోగించిన తొలి జట్టుగా నిలిచింది.
స్పిన్ దళంపైనే నమ్మకం
టీ20 వరల్డ్‌కప్-2026 టోర్నీలో భాగంగా కొలంబో వేదికగా పాకిస్తాన్ ఆదివారం టీమిండియాతో తలపడిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాక్.. తమ స్పిన్ దళంపైనే ఎక్కువగా ఆధారపడింది. స్పెషలిస్టు స్పిన్నర్లలో ఉస్మాన్ తారిఖ్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 24 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీయగా.. అబ్రార్ అహ్మద్ మూడు ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చుకున్నాడు.
ఇక బ్యాటింగ్ ఆల్‌రౌండర్లు సల్మాన్ ఆఘా రెండు ఓవర్లు వేసి 10 పరుగులిచ్చి ఒక వికెట్ తీయగా.. నాలుగు ఓవర్ల కోటాలో సయీమ్ ఆయుబ్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. మరోవైపు షాదాబ్ ఖాన్ ఒక ఓవర్ వేసి 17 రన్స్, మొహమ్మద్ నవాజ్ 4 ఓవర్లలో 28 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.
షాహిన్ ఆఫ్రిది విఫలం
ఇలా నిర్ణీత 20 ఓవర్లలో 18 ఓవర్లు పాక్ స్పిన్నర్లే వేయగా.. ఏకైక పేసర్ షాహిన్ ఆఫ్రిది రెండు ఓవర్లు వేసి ఏకంగా 31 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కాగా పాక్ ఇలా స్పిన్ దళాన్నే నమ్ముకోవడం ఇదే తొలిసారి కాదు. 2012 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఆస్ట్రేలియా మీద కూడా ఇదే తరహాలో ఇదే వేదికపై స్పిన్ అస్త్రాన్ని ప్రయోగించింది పాక్.
తద్వారా పొట్టి వరల్డ్‌కప్ ఈవెంట్లో అత్యధికంగా రెండుసార్లు 18 ఓవర్లు స్పిన్ వేయించిన తొలి జట్టు పాకిస్తాన్ నిలిచింది. కాగా కొలంబో పిచ్ స్పిన్‌కు అనుకూలం అన్న సంగతి తెలిసిందే. ఇక భారత్‌తో మ్యాచ్‌లో పాక్ 61 పరుగుల తేడాతో ఓడిపోయింది.
టీమిండియా ఇలా
ఈ మ్యాచ్‌లో పాక్ ప్రధానంగా స్పిన్‌ను నమ్ముకుంటే.. టీమిండియా పేసర్లకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. భారత పేసర్లలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మూడు ఓవర్లు వేసి కేవలం 16 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రెండు ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు.
ఇక స్పిన్నర్లలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ నాలుగు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి మూడు ఓవర్లలోనే రెండు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ మూడు ఓవర్లు వేసి ఒక వికెట్ పడగొట్టగా.. పార్ట్‌టైమ్ స్పిన్నర్లు తిలక్ వర్మ రెండు ఓవర్లు వేసి ఒక వికెట్ తీయగా.. రింకూ సింగ్ ఒక ఓవర్లో 9 పరుగులు సమర్పించుకున్నాడు.
ఇదిలా ఉంటే.. తాజా వరల్డ్‌కప్ ఎడిషన్‌లో పాకిస్తాన్ యూఎస్‌ఏతో మ్యాచ్‌లో కూడా ఏకంగా 16 ఓవర్లు స్పిన్ బౌలింగ్ వేయించడం గమనార్హం.


